సకలజనులకు సరికొత్త వరాలు

Congress Party Election Manifesto Released - Sakshi

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల 

35 అంశాలు... ప్రొఫెసర్‌ జయశంకర్, అమరవీరుల స్మరణ 

తెలంగాణలో ఏర్పాటులో కాంగ్రెస్‌ కీలక భూమికపై ప్రత్యేక పేరా 

అన్ని వర్గాలకు హామీలు, వరాలు 

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. సకలజనులను ఆకట్టుకునేందుకు సమగ్ర కసరత్తు చేసింది. ‘సమూల మార్పు కోసం.. సమగ్ర ప్రణాళిక’పేరుతో మంగళవారం ఇక్కడ గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా, ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. 35 అంశాలతో రూపొందించిన కాంగ్రెస్‌ మేనిఫెస్టో.. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు హామీల జల్లు కురిపించింది. రూ.2 లక్షల ఏకకాల రైతు రుణమాఫీ, రైతుబంధు విస్తరణ, నిరుద్యోగభృతి వంటి హామీలిచ్చింది. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్‌ పోషించిన పాత్రపై ప్రత్యేకంగా ఓ పేరా కేటాయించింది. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లుభట్టి విక్రమార్క, పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ, కో చైర్మన్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితర ముఖ్యులు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో వారు లేకుండానే మేనిఫెస్టోను విడుదల చేశారు.  

కాంగ్రెస్‌ మేనిఫెస్టోలోని కీలకాంశాలు... 
- రాజ్యాంగ సంస్థల స్వేచ్ఛను కాపాడటం, సచివాలయం నుంచే పాలన, ప్రజలకు అందుబాటులో ముఖ్యమంత్రి, మంత్రులు, సీఎం కార్యాలయంలో పీపుల్స్‌ గ్రీవెన్స్‌సెల్‌ ఏర్పాటు 
రాష్ట్ర గీతంగా ‘జయ జయహే తెలంగాణ’ 
అన్ని జిల్లాకేంద్రాల్లో అమరవీరుల స్థూపాలు, 1969, 2009 తదనంతర రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు సముచిత గౌరవం, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం, ఉద్యమ కేసుల ఎత్తివేత, ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో ఉద్యమకారులకు ప్రాధాన్యం 
ఒకేదఫాలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ, సహకార సంఘాల దీర్ఘకాలిక రుణాలపై వడ్డీభారం ప్రభుత్వానిదే, రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రైతుబంధు పథకం విస్తరణ, రైతులు, రైతుకూలీలు, కౌలు రైతులకు లబ్ధి కలిగేలా పెట్టుబడి సాయం, ఎకరానికి రూ.4 వేల నుంచి రూ.5 వేలకు సాయం పెంపు, రైతు సంక్షేమానికి ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్, ‘రైతు సంక్షేమ వ్యవసాయ అభివృద్ధి శాఖ’గా వ్యవసాయశాఖ పేరు మార్పు. ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబాలకు ఆర్థికసాయం, వ్యవసాయ పంపుసెట్లపై రూ.83 కోట్ల విద్యుత్‌ సర్వీస్‌ చార్జీల ఎత్తివేత, 17 పంటలకు మద్దతు ధర 
నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, 20 వేల పోస్టులతో మెగా డీఎస్సీ, పాతపద్ధతిలోనే డీఎస్సీ నిర్వహణ, ప్రభుత్వ ఉద్యోగాల వార్షిక క్యాలెండర్‌ ద్వారా గ్రూప్‌–1, 2, 3, డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల నిర్వహణ, సంవత్సరంలోపే ప్రభుత్వశాఖల్లోని లక్ష ఉద్యోగాల భర్తీ, రెగ్యులర్‌గా డీఎస్సీలు, డిగ్రీ పర్సంటేజీతో నిమిత్తం లేకుండా బీఈడీ, డీఈడీ, టెట్‌ అర్హతలున్నవారికి డీఎస్సీ అవకాశం, 1994, 1996, 1998, 2008 డీఎస్సీ నోటిఫికేషన్ల ద్వారా ఎంపికైన బీఈడీ అభ్యర్థులకు తగిన న్యాయం 
రాష్ట్ర ఆదాయంలో 20 శాతం నిధులు విద్యారంగానికి ఖర్చు, అన్ని స్థాయిల విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్‌ 
ఆరోగ్యశ్రీ పథకం కింద అన్ని రకాల వ్యాధులకు రూ.5 లక్షల వర్తింపు, ప్రతి మండలానికి 20–30 పడకల ఆసుపత్రి, ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి  
సొంత స్థలం ఉంటే కొత్త ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు, ఇందిరమ్మ ఇళ్ల పాతబకాయిల చెల్లింపు, పాత ఇందిరమ్మ ఇళ్లకు అదనపు గది కోసం రూ.2 లక్షలు, సబ్సిడీ ధరలో సిమెంటు  
ఎస్సీ వర్గీకరణ త్వరితగతిన అమలుకు చర్యలు, ఎస్సీల్లోని అన్ని కులాల కోసం 3 ప్రత్యేక కార్పొరేషన్లు, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పకడ్బందీ అమలు, అర్హులైన ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌.  
కోయగోండులు, లంబాడీలు, ఇతర ఎస్టీ ఉపకులాల కోసం మూడు ప్రత్యేక కార్పొరేషన్లు, గిరిజనుల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు 
మైనార్టీలకు సబ్‌ప్లాన్, ఇమామ్‌ల గౌరవ వేతనం రూ.6వేలకు పెంపు, వక్ఫ్‌ భూముల పరిరక్షణకు చర్యలు, రెండో అధికార భాషగా ఉర్దూకు 
ప్రాధాన్యత 
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌లో పనిచేస్తున్న కార్మికులకు చట్టబద్ధత  
బీసీ సంక్షేమ శాఖ మూడుగా విభజన. బీసీ, ఎం బీసీ, సంచారజాతుల కోసం ప్రత్యేక శాఖల ఏర్పా టు, బీసీ సబ్‌ప్లాన్‌ కోసం చర్యలు, తొలగించిన 26 కులాలను బీసీ జాబితాలో చేర్చడం, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల వర్గీకరణ, రెడ్డి, కమ్మ, వైశ్య, బ్రాహ్మణ, వెలమ కులాలకు కార్పొరేషన్లు 
పేదల వివాహాలకు ఆర్థిక సాయంగా రూ.1,50,116, మహిళాసంఘాల రుణపరిమితి రూ.10 లక్షలకు పెంపు, రూ.50 వేల వరకు రుణమాఫీ, అభయహస్తం పింఛన్‌ రూ.1000కి పెంపు.  
సీసీఎస్‌ విధానం రద్దు, కొత్త పీఆర్సీ ద్వారా 01–07–2018 నుంచి ఆర్థిక ప్రయోజనాల అమలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి 60 ఏళ్లకు పెంపు, ఆంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు తిరిగి రాష్ట్రానికి..  
రూ.300 కోట్లతో న్యాయవాదుల సంక్షేమనిధి, రూ.200 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమనిధి, 58 ఏళ్ల వయసు నిండిన జర్నలిస్టులకు పింఛన్, మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారంతోపాటు రూ.5 వేల ఆర్థిక సాయం, సెంట్రల్‌ వేజ్‌బోర్డు తరహాలో స్టేట్‌ వేజ్‌బోర్డు, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు, మెరుగైన వైద్యం అందేలా చర్యలు  
గల్ఫ్‌ కార్మికుల సంక్షేమనిధికి ఏటా రూ.500 కోట్లు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.300 నుంచి రూ.500 వరకు స్కాలర్‌షిప్, ట్రాన్స్‌జెండర్లకు రాజ్యాంగపరమైన హక్కులు, రూ.3 వేల పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు, 58 ఏళ్లు నిండిన వృద్ధులకు నెలకు రూ.2 వేల పింఛన్, 70 ఏళ్లు పైబడినవారికి రూ.3 వేలు  
కోటి ఎకరాలకు సాగునీరు, సెజ్‌ల కోసం తెలంగాణవ్యాప్తంగా 50 వేల ఎకరాల కేటాయింపు, జీహెచ్‌ఎంసీని స్థానిక ప్రభుత్వంగా గుర్తించి అధికారాల బదలాయింపు, పోలీసులకు వారాంతపు సెలవు, వైన్‌షాపులు, పబ్బుల నియంత్రణ, ఆదాయపరిమితిని బట్టి అన్నిమతాల ప్రార్థనా మందిరాలకు ఉచిత విద్యుత్‌   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top