కాంగ్రెస్‌ హామీలకు ఏటా అయ్యే ఖర్చెంత? | Congress Manifesto 2019 promises big bonanza to jobless youth | Sakshi
Sakshi News home page

10 లక్షల కోట్లు!

Apr 4 2019 5:30 AM | Updated on Apr 4 2019 10:52 AM

Congress Manifesto 2019 promises big bonanza to jobless youth - Sakshi

కాంగ్రెస్‌ పార్టీ మంగళవారం విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో కనీస ఆదాయ పథకం నుంచి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, రైతులకు ప్రత్యేక బడ్జెట్,ఆరోగ్య సంరక్షణ వరకు అనేక హామీలు ఇచ్చింది.అయితే, ఈ హామీల అమలుకు ఏటా పది లక్షల కోట్ల రూపాయలు కావలసి ఉంటుందని, అది దేశ ఆర్థిక వ్యవస్థనే కుదేలు పరుస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

► కనీస ఆదాయ పథకం (న్యాయ్‌)
ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న 20శాతం నిరుపేద కుటుంబాలకు ఏటా 72వేల చొప్పున ఇవ్వాలి.అయితే, దీన్ని యథాతథంగా అమలు చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థే తల్లకిందులవుతుందని నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.కనీస ఆదాయ పథకం కోసం ఏటా 3.60 లక్షల కోట్లు కావాలి. మొదటి సంవత్సరం దీనికయ్యే ఖర్చు దేశ జీడీపీలో దాదాపు 1శాతం ఉంటుంది. రెండో ఏడాది అది 1.5శాతానికి పెరుగుతుంది.

► జీడీపీలో 6శాతం విద్యకే కావాలి
విద్యారంగం వ్యయాన్ని పెంచడం మంచిదే.ఈ సొమ్ములో అధికభాగం మౌలిక సదుపాయాలు, టీచర్లకు వేతనాల కోసం వెచ్చించాల్సి ఉంటుంది.ప్రస్తుతం ప్రభుత్వం జీడీపీలో 4.6శాతాన్ని విద్యకోసం వెచ్చిస్తోందని హెచ్‌ఆర్‌డీ మంత్రి ప్రకాశ్‌జవదేకర్‌ చెబుతున్నారు. ఇది 8.76 లక్షల కోట్లకు సమానం.కాంగ్రెస్‌ తాజా హామీ అమలు పరచాలంటే అదనంగా ఏటా మరో 2.66 లక్షల కోట్లు అవసరం.అంటే, ఏటా మొత్తం 11.4 లక్షల కోట్ల రూపాయలు కావాలన్నమాట.

► ఆరోగ్య సంరక్షణకు 5 లక్షల కోట్లు
2023–24నాటికి ఆరోగ్య సంరక్షణ కోసం జీడీపీలో 3శాతం వరకు వెచ్చించనున్నట్టు కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పేర్కొంది. ప్రస్తుత వ్యయం కంటే ఇది రెండింతలు ఎక్కువ.నీతి ఆయోగ్‌ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఆరోగ్యంపై ఏటా 2.47 లక్షల కోట్లు (జీడీపీలో1.3శాతం) ఖర్చు చేస్తున్నారు. పౌరులందరికీ ఉచితంగా ఆరోగ్య సంరక్షణ కల్పించడం, వైద్య సదుపాయాలను మెరుగుపరచడం వంటి రాహుల్‌ గాంధీ హామీలను అమలు పరచాలంటే ఏటా 5.71లక్షల కోట్లు అవుతుంది. మొత్తం మీద కాంగ్రెస్‌ ఎన్నికల హామీలు వార్షిక బడ్జెట్‌పై 10 లక్షల కోట్ల అదనపు భారాన్ని వేస్తాయి. 2019–20 సంవత్సరంలో బడ్జెట్‌ వ్యయం 27.84 లక్షల కోట్లు మాత్రమే.

దీన్ని దృష్టిలో పెట్టుకుంటే రాహుల్‌ హామీలు ఎంత భారమో అర్థమవుతుంది. ప్రభుత్వ ఆదాయం ఏటా 12 నుంచి 14శాతం పెరుగుతోంది. 2018–19లో 24.57 లక్షల కోట్లు ఉన్న ఆదాయం 2023–24 నాటికి 45 లక్షల కోట్లకు పెరుగుతుంది. వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అయితే, హామీల అమలుకు ఏటా 10లక్షల కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఇప్పటికే సిబ్బంది వేతనాలు, వడ్డీల చెల్లింపులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సామాజిక పథకాల వ్యయం మొదలయిన వాటికి అయ్యే ఖర్చు ఆదాయానికి మించిపోతోంది. ఇలాంట పరిస్థితుల్లో ఏటా అదనంగా పది లక్షల కోట్లు భరించడం భారమేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సర్కారీ కొలువుల భర్తీ భారం 8వేల కోట్లకుపైనే..
2020 మార్చి నాటికి 4 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, రాష్ట్రాలు మరో 20 లక్షల ఖాళీలు భర్తీ చేసేలా చూస్తామని కాంగ్రెస్‌ మానిఫెస్టో హామీ ఇచ్చింది.7వ వేతన సంఘం సిఫారసు ప్రకారం ఉద్యోగి కనీస వేతనం 18వేలు. అంటే ఏడాదికి 2.16లక్షలు. రాహుల్‌ చెప్పినట్టు 4లక్షల మందిని నియమిస్తే వారికి కనీస వేతనం లెక్కన చూసినా ఏడాదికి 8,640 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.రాష్ట్రాలు కూడా మరో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే ఈ భారం తడిసిమోపెడవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement