గెలుస్తున్నామా? ఓడిపోతున్నామా?

Chandrababu Naidu review meeting with party condidates - Sakshi

పార్టీ  అభ్యర్థులతో చంద్రబాబు సుదీర్ఘ సమావేశం

సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓవైపు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూనే మరోవైపు పార్టీ అభ్యర్థులతో విస్తృత స్థాయి సమావేశంలో పోలింగ్‌ సరళి, గెలుపుపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇంకా సమావేశం కొనసాగుతూనే ఉంది. ఉండవల్లిలోని ప్రజావేదికలో సోమవారం సీఎం ముఖ్యమంత్రి... టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఆయన ఈ సందర్భంగా అభ్యర్థులను గెలిచే అవకాశం ఉందా? లేదా? ఎన్ని సీట్లు వస్తాయి అని ఆరా తీశారు. అయితే అభ్యర్థులతో పాటు, పార్టీ సీనియర్లు సైతం ఎక్కడా గెలుపుపై అధినేతకు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు కనపడలేదట. ఈ సమావేశంలో ఎవరిలోనూ గెలుస్తామనే ధీమా లేకపోగా ఏం జరుగుతుందో, ఏమోననే ఆందోళన ఎక్కువగా చోటుచేసుకున్నట్లు భోగట్టా. 

అభ్యర్థులెవరూ తాము కచ్చితంగా గెలుస్తామని చెప్పే సాహసం చేయలేకపోయారని, జిల్లాల్లో చక్రం తిప్పే బలమైన నేతలుగా ముద్రపడిన వారు, పలువురు మంత్రులు సైతం గెలుపుపై స్పష్టత లేకుండా మాట్లాడినట్లు తెలిసింది. గెలిచినా స్వల్ప మెజారిటీతో గెలుస్తామని, అది కూడా చెప్పలేనని గుంటూరు జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. తమ గెలుపుపై స్పష్టత ఇవ్వలేని నేతలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా ముఖ్యమంత్రితో భేటీ అనంతరం జేసీ దివాకర్‌ రెడ్డి సైతం ఓట్ల కోసం కోట్లు ఖర్చుపెట్టినట్లు బహిరంగంగానే అంగీకరించడం గమనార్హం. పలువురు అభ్యర్థులు  పసుపు-కుంకుమపై గంపెడు ఆశలు పెట్టుకుంటే, మరోవైపు ఆ ఒక్క దానితో గెలవలేమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కాగా ప్రతిపక్షం నుంచి ఈసారి తీవ్రమైన పోటీ ఎదుర్కోవాల్సి వచ్చిందని ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు మీడియా వద్ద వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top