ఉత్త డప్పే.. జాబేదీ?

Chandrababu Has Failed To Produce Jobs For Unemployment Youth - Sakshi

రచ్చబండ

సాక్షి, గూడూరు :  ‘జాబు రావాలంటే.. బాబు రావాలంటూ ఎన్నికల్లో ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను మర్చిపోయారు. కొత్త ఉద్యోగాల సృష్టి దేవుడెరుగు.. కనీసం ఖాళీ పోస్టులను భర్తీ చేయండని అడిగితే పోలీసులతో కొట్టిస్తున్నారు.  కూలీనాలి చేసి మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివించారు. కానీ ఉద్యోగాలు మాత్రం రావడం లేదు’  అంటూ నిరుద్యోగులు ఆక్రోశం వెలిబుచ్చారు.  ‘పరిశ్రమల కోసం భూములిచ్చినా ఉపయోగం లేకపోయింది.

నాయుడుపేట, తడ ప్రాంతాల్లో సెజ్‌లున్నా ఉద్యోగాలు రాలేదు. ఇప్పటికీ తల్లిదండ్రులపై ఆధారపడుతున్నాం. నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు చివరకు అదికూడా సక్రమంగా ఇవ్వలేదు’ అంటూ విరుచుకుపడ్డారు. ‘జాబు రావాలంటే బాబు గద్దె దిగాలి. మా బాగోగులు చూసే వారికే ఈ ఎన్నికల్లో పట్టం కడతాం’ అని స్పష్టం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు పెద్ద మసీదు సమీపంలోని రచ్చబండ వద్ద కూర్చొని ఉద్యోగ ప్రకటనల కోసం పత్రికలు తిరగేస్తున్న యువతను కదిలించగా వారి మనోగతాన్ని వెలుబుచ్చారు.

‘రాష్ట్రవ్యాప్తంగా 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భాళీగా ఉన్నాయి. ఏపీపీఎస్సీని పునరుద్ధరించని ఫలితంగా గ్రూప్‌ 1, 2 వంటి 25 వేల పోస్టులు భర్తీ కావట్లేదు. గ్రూప్‌ 4, ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లోనూ చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  పంచాయతీరాజ్‌ శాఖలో ఖాళీగా ఉన్న కార్యదర్శుల పోస్టులను, పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 10 వేల పోస్టులను భర్తీ చేయాలి’ అని డిమాండ్‌ చేశారు.  

‘జాబు’ రాసి మరీ ఆత్మహత్య 
చంద్రబాబు హయాంలో నిరుద్యోగుల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందనే దానికి 2017 ఏప్రిల్‌ 17న విశాఖలో చోటుచేసుకున్న ఘటన సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. మర్రిపాలెంకు చెందిన నిరుద్యోగి పితాని శివదుర్గా ప్రసాద్‌.. చంద్రబాబు గెలిస్తే తన కష్టాలు తీరిపోతాయని భావించాడు. తన ఓటు టీడీపీకే వేశాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడేళ్లు పూర్తయ్యాయి. అయినా ఉద్యోగం రాలేదు.

ఉపాధి సైతం దొరకలేదు. దీంతో ఆ యువకుడు సీఎం చంద్రబాబుకు తన బాధను, అవేదనను వ్యక్తం చేస్తూ ఓ లేఖ రాసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘జాబు లేదని నా భార్య కూడా నన్ను వదిలేసి వెళ్లిపోయింది. ఇది నాలాంటి నిరుద్యోగ యువతకు కనువిప్పు కావాలి’ అని చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. నిరుద్యోగ యువత తనలా అత్మహత్యకు పాల్పడవద్దని, హోదా వస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని ఆ లేఖలో పేర్కొన్నాడు.   

చంద్రబాబు మోసం చేశారు 
మా నాన్న నజీర్‌ కూలీకి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నన్ను బీటెక్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివించాడు. చదువు పూర్తయ్యాక బెంగళూరులో ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరా. ప్రాజెక్ట్‌ పూర్తవగానే ఇంటికి పంపేశారు. అప్పటి నుంచి ఉద్యోగావకాశాల కోసం తిరుగుతున్నా ఫలితం లేదు. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారు.  
– ఎస్‌కే జిలానీబాషా, గూడూరు 

ఉద్యోగాలు రావడం లేదు 
ప్రభుత్వ విధానాలవల్లే ఇంజినీరింగ్‌ చదివినా ఉద్యోగాలు రావడం లేదు. నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు గొప్పలు చెప్పి నాలుగున్నరేళ్ల తర్వాత అందుకు సవాలక్ష నిబంధనలు పెట్టారు. రాష్ట్రంలో 1.30 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కనీసం గ్రూప్‌–4 పోస్టులను కూడా భర్తీ చేయడం లేదు. 
– కె.నేతాజీ, బీటెక్, గూడూరు

ఉపాధి అవకాశాలు కల్పించాలి 
ఐటీఐ డీజిల్‌ మెకానిక్‌ కోర్సు పూర్తి చేశాను. ప్రస్తుతం ఉద్యోగ వేటలో ఉన్నాను. చదువు పూర్తి చేసిన వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. రాష్ట్రంలో ఉన్న ఖాళీ పోస్టులను ఏటా భర్తీ చేస్తే కొంతవరకైనా నిరుద్యోగ సమస్య తీరుతుంది. ఐదేళ్లలో ఒక్క ఉద్యోగాన్నీ భర్తీ చేయలేదు. ఇలా అయితే నిరుద్యోగుల పరిస్థితి ఏమిటి. 
– కె.నవీన్, గూడూరు  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top