ప్లాట్లు ఇస్తుంటే బాబుకు బాధ : బుగ్గన | Sakshi
Sakshi News home page

ప్లాట్లు ఇస్తుంటే బాబుకు బాధ : బుగ్గన

Published Sat, Jun 6 2020 3:27 AM

Buggana Rajendranath Fires On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదలకు భారీగా ఇళ్ల స్థలాలు ఇస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబుకు చాలా బాధగా ఉందని, అందుకే ఈ మధ్య ఆయన తన తనయుడు లోకేష్‌ బాటలో ట్వీట్ల ద్వారా అవాస్తవాలతో విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో గృహ నిర్మాణ పథకంలో తానేదో గొప్పగా చేసినట్లు ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో ఇంటి స్థలం కావాలంటే రూ.30 వేలు, రూ.60 వేలు, రూ.1.5లక్షలు రేట్లు నిర్ణయించి దందాలు ప్రారంభించినట్లు ట్వీట్లు చేస్తున్నారని విమర్శించారు. బుగ్గన ఇంకా ఏమన్నారంటే..

► చంద్రబాబు చేస్తున్న ట్వీట్లలోని అంకెలు, వివరాలన్నీ తప్పే.
► సీఎం వైఎస్‌ జగన్‌ దాదాపు 30 లక్షల ఇంటి పట్టాలు ఇవ్వాలని సంకల్పించారు. 
► చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలోని మొదటి రెండు సంవత్సరాల్లో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్‌తో తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఇల్లూ కట్టలేదు.
► ఇప్పుడు లంచాలు తీసుకుంటున్నారంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు. డబ్బులు వసూలు చేయాలంటే శ్లాబులు ఉంటాయా?
► ఇన్ని చెబుతున్న చంద్రబాబు అర్బన్‌ హౌసింగ్‌కు సంబంధించి రూ.3వేల కోట్లు పెండింగ్‌ పెట్టి వెళ్లారు. అసలు గృహమే ఉండదు.. కానీ ఆయన గృహప్రవేశం చేయిస్తారు.

రాజమండ్రిలో రూ.7 లక్షలకు ఎకరం ఇప్పిస్తారా?
రాజమండ్రిలో రూ.7 లక్షల విలువైన భూములను రూ.45 లక్షలు పెట్టి కొన్నారని చంద్రబాబు ఆరోపణ చేస్తున్నారని.. అక్కడ రూ.7లక్షలు కాదు.. రూ.10లక్షలకైనా ఇప్పిస్తే తీసుకుంటామని బుగ్గన చంద్రబాబుకు సవాల్‌ విసిరారు. భూసేకరణకు చట్టప్రకారమే రూ.43లక్షలు చెల్లించాలని.. ఒకేచోట పెద్ద మొత్తంలో భూమి దొరుకుతోంది కాబట్టి మూడుశాతం పెంచి రూ.45లక్షలకు తీసుకున్నామన్నారు. టీడీపీలో అందరూ అబద్ధాలు చెబుతుంటే తాను వెనుకబడిపోతానేమోనని యనమల కూడా అసత్యాలు వల్లిస్తున్నారని బుగ్గన ఎద్దేవా చేశారు.  

Advertisement
Advertisement