ఆ పెట్టెలో ఏముంది?

Black Trunk From PM Modi Chopper Unlocks Congress Conspiracy - Sakshi

ప్రధాని మోదీ వెల్లడించాలి: కాంగ్రెస్‌

మోదీ హెలికాప్టర్‌ నుంచి ప్రైవేటు కారులో తరలింపు

ఈసీకి ఫిర్యాదు చేసిన కర్ణాటక పీసీసీ

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ కర్ణాటక పర్యటన సందర్భంగా ఆయన హెలికాప్టర్‌లో నలుపురంగు పెట్టెను ప్రైవేటు కారులో తరలించడంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఆ పెట్టెలో ఏముందో ప్రధాని మోదీ వెంటనే చెప్పాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ఆనంద్‌ శర్మ డిమాండ్‌ చేశారు. ‘ఈ నెల 9న చిత్రదుర్గ సభకు మోదీ హెలికాప్టర్‌కు రక్షణగా మరో మూడు హెలికాప్టర్లు వచ్చాయి. ఇవి ల్యాండ్‌ కాగానే ఓ హెలికాప్టర్‌ నుంచి నలుపురంగులో ఉన్న పెట్టెను ఇన్నోవా కారులో ఎక్కించారు. ఈ కారు ఎస్పీజీ వాహనశ్రేణిలో భాగం కాదు’ అని తెలిపారు. ఈ పెట్టెలో భారీగా నగదు ఉందని ఆయన ఆరోపించారు. ఒకవేళ ఇది నిజం కాకుంటే మోదీ విచారణకు సహకరించాలన్నారు.

ఈ విషయమై కర్ణాటక పీసీసీ ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని ఆనంద్‌ శర్మ వెల్లడించారు. అంబేడ్కర్‌ జయంతి రోజున ప్రతిపక్షాలపై విమర్శలు మాని, గత ఐదేళ్లకాలంలో ఏం చేశారో దేశప్రజలకు చెప్పాలని మోదీకి సూచించారు. దమ్ముంటే రఫేల్‌ ఒప్పందంపై అప్పటి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలాండేతో జరిగిన సమావేశం మినిట్స్‌ను బయటపెట్టాలని మోదీని డిమాండ్‌ చేశారు. దీనివల్ల అన్ని ఆరోపణలకు ఒకేసారి తెరపడుతుందని వ్యాఖ్యానించారు. సాయుధ బలగాల త్యాగాలను ఎన్నికల ప్రచారానికి వాడుకోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. 1971 బంగ్లాదేశ్‌ యుద్ధంతో అప్పటి ప్రధాన ఇందిరాగాంధీ రాజకీయంగా లబ్ధిపొందారని కేంద్ర మంత్రి వీకే సింగ్‌ చెప్పడాన్ని తప్పుపట్టిన ఆనంద్‌ శర్మ, ఈ వ్యాఖ్యలపై సింగ్‌ వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top