మోదీపై పోటీ ; ఆ వార్తలన్నీ ఫేక్‌..!

BJP Leader Dharmapuri Aravind Rejects Farmers Contesting In Varanasi - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వినూత్న నిరసన తెలిపారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి 170కి పైగా రైతులు స్వతంత్రులుగా బరిలోకి దిగారు. దాంతో అక్కడ బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నిక నిర్వహించారు. అయితే, అదే స్ఫూర్తితో తాజాగా ప్రధాని మోదీ పోటీచేస్తున్న వారణాసి నుంచి కూడా పసుపు రైతులు భారీ స్థాయిలో ఎన్నికల పోటీకి దిగనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. అవన్నీ తప్పుడు వార్తలు అని నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ స్పష్టం చేశారు.

వారణాసిలో పోటీకి దిగుతున్న అభ్యర్థులెవరూ పసుపు రైతులు కాదని అన్నారు. అక్కడ పోటీకి దిగుతున్నవారు తాజా ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున పనిచేసిన వారేనని వెల్లడించారు. నిజామాబాద్‌ తరహాలో వారణాసిలో కూడా రైతులు భారీ ఎత్తున పోటీకి దిగుతున్నారని విడుదలైన ప్రెస్‌ నోట్‌ తప్పు అని అన్నారు. వీరు మొన్నటి నిజామాబాద్‌ ఎన్నికల్లో కూడా పోటీచేసినవారు కాదని తెలిపారు. రాజకీయ డ్రామాల కోసం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు రైతులపై నిజమైన ప్రేమ ఉంటే బోనస్‌ ఎందుకు ఇప్పించలేదని నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవితను ప్రశ్నించారు. బీజేపీకి పట్టం కడితే పసుపు, ఎర్రజొన్న పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంతో పాటు.. పసుపు బోర్డు కూడా ఏర్పాటు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టామని అరవింద్‌ గుర్తు చేశారు.

(మోదీపై నిజామాబాద్‌ రైతుల పోటీ)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top