ఉప ఎన్నికల ఫలితాలు: 12 స్థానాల్లో బీజేపీ గెలుపు

BJP Lead In Karnataka Assembly Bypoll - Sakshi

12 స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ

కాషాయ శ్రేణుల్లో ఉత్సాహం.. సంబరాలు

సాక్షి,బెంగళూరు: కర్ణాటకలో ఇటీవల జరిగిన 15 అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ హవా కొనసాగింది. ఊహించినట్లుగానే బీజేపీ దూసుకుపోయింది. 15 స్థానాల్లో ఉప ఎన్నికలు జరగగా, 12 సీట్లను కాషాయ పార్టీ కైవసం చేసుకుంది. ఇక కాంగ్రెస్‌ కేవలం 2 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో కర్ణాటక రాజకీయాల్లో ఏర్పడిన సంక్షోభం ఇక శాశ్వతంగా సమసిపోయినట్లే. అసెంబ్లీలో ప్రస్తుతం మైనార్టీ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న ముఖ్యమంత్రి యడియూరప్ప సర్కార్‌కు  ఉప ఎన్నికల ఫలితాలు మంచి జోష్‌ను నింపింది. యడ్డీ సర్కార్‌ మ్యాజిక్ ఫిగర్‌ కంటే ఆరు స్థానాల్లో విజయం సాధించింది.

ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీకి 105 మంది సభ్యుల మద్దతు ఉండగా.. ఉప ఎన్నికల్లో 12  స్థానాల్లో గెలుపొందటంతో ఆ సంఖ్య 117కి చేరింది. దీంతో ఉత్కంఠ భరిత స్థితిలో ముఖ్యమంత్రి పీఠం చేజిక్కించుకున్న బీఎస్ యడియూరప్ప సేఫ్‌ జోన్‌లో ఉన్నారు. ప్రస్తుతం వెలువడుతున్న ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి మరింత ఊరటను కలిగించాయి. కన్నడలో ఇక తమకు తిరుగులేదని బీజేపీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. కన్నడ ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, జేడీఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు ఇక కాలం చెల్లినట్టే అని ఫలితాలపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులు సంభరాలు కూడా ప్రారంభించారు.

ఇక యడియూరప్ప సర్కార్‌ను మరోసారి కూల్చాలని కలలుకన్న జేడీఎస్‌, కాంగ్రెస్‌లకు ఉప ఎన్నికల్లో చేదు పలితాలే ఎదురయ్యాయి. ఇప్పటికే వరుస ఓటములతో ఢీలా పడ్డ కాంగ్రెస్‌కు ఉప ఎన్నికల ఫలితాలు మరింత నిరాశను మిగిల్చాయి. 15 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 5వ తేదీన పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 15 మంది కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులపై స్పీకర్‌ అనర్హత వేటు వేయడంతో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top