లాలు ఇంట్లో దయ్యాలు!  | Bihar CM Nitish Kumar Say Lalu Prasad Yadav Have Left Ghosts In CM House | Sakshi
Sakshi News home page

లాలు ఇంట్లో దయ్యాలు! 

Jan 3 2020 3:05 AM | Updated on Jan 3 2020 3:05 AM

Bihar CM Nitish Kumar Say Lalu Prasad Yadav Have Left Ghosts In CM House - Sakshi

నితీశ్‌తో లాలూ(ఫైల్‌)

  పట్నా: బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్‌ లాలు ప్రసాద్‌ యాదవ్‌ సీఎం తన అధికార నివాసాన్ని వదిలి వెళ్లేముందు అక్కడ దయ్యాలను వదిలేశారా? తన తరువాత ముఖ్యమంత్రి పీఠం చేపట్టిన జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ లక్ష్యంగా లాలు ఆ పని చేశారా? అంటే అవుననే అంటున్నారు నితీశ్‌ కుమార్‌. నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక అనధికార కార్యక్రమంలో ఈ విషయాలను నితీశ్‌ కుమార్‌ పంచుకున్నారు. 2005లో ఆర్జేడీ అధికారం కోల్పోయాక, నితీశ్‌ లాలు కుటుంబం నివాసం ఉన్న 1, అన్నేమార్గ్‌ భవనంలోకి మారారు. విశాలంగా ఉన్న ఆ ఇంటి వెనక భాగంలో తనకు పెద్ద పెద్ద మట్టికుప్పలు కనిపించాయని, ఇంటి నలుమూలల్లో కొన్ని కాగితపు కవర్లు కనిపించాయని నితీశ్‌ గుర్తు చేసుకున్నారు. నీ కోసం కొన్ని దయ్యాలను ఆ ఇంట్లో వదిలి వచ్చానని ఆ తరువాత ఒక సందర్భంలో లాలు ప్రసాద్‌ యాదవ్‌ స్వయంగా నితీశ్‌తో చెప్పారట. అయితే, ఆ మాటలను లాలు తనదైన స్టైల్‌లో సరదాగానే అన్నారని నితీశ్‌ పేర్కొన్నారు. అయితే, నితీశ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బిహార్‌లో సంచలనం సృష్టించాయి.  

నితీశ్‌ గతంలో లాలుకు నష్టం కలిగించే ఉద్దేశంతో పట్నాలోని కాళీమాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారని గురువారం ఆర్జేడీ ఉపాధ్యక్షుడు శివానందతివారీ ఆరోపించారు. ఆ పూజలు చేసిన పూజారులు ఈ విషయాన్ని లాలుకు చెప్పారని, దాంతో లాలు ఆ ప్రభావం తనపై పడకుండా వేరే పూజలు చేశారని తివారీ వివరించారు. ఈ విషయం తనకు లాలునే చెప్పారన్నారు. కాగా, మూఢనమ్మకాలను, మంత్రతంత్రాలను లాలు విశ్వసిస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. అదే సమయంలో నితీశ్‌కు అలాంటి నమ్మకాలేవీ లేవని ప్రచారముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement