
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి పనితీరును రాజ్యసభ ప్రశంసించింది. బడ్జెట్ సమావేశాల్లో ప్రశంసనీయమైన రీతిలో క్రియాశీల పాత్ర నిర్వహించారని రాజ్యసభ సెక్రెటేరియట్ వెల్లడించింది. ఈ మేరకు బుధవారం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. ప్రజా సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో తనకు గల అవకాశాలను రాజ్యసభలోని ఇతర సభ్యుల కన్నా చాలా చక్కగా విజయసాయిరెడ్డి వినియోగించుకున్నారు. (‘రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగుల పెన్షన్ను సవరించాలి’)
విజయసాయి రెడ్డి తొమ్మిది సార్లు అవకాశాన్ని వినియోగించుకుని చర్చల్లో అత్యుత్తమ భాగస్వామ్యాన్ని కనబరిచినట్టు రాజ్యసభ సచివాలయం తెలిపింది. జీరో అవర్ ప్రస్తావన, ప్రత్యేక ప్రస్తావన, ఒక మౌఖిక ప్రశ్న, మౌఖిక ప్రశ్నలకు నాలుగు అనుబంధ ప్రశ్నలు, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ, సాధారణ బడ్జెట్‌పై చర్చలో ఆయన మాట్లాడారు. ఇవి కాక రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపైనా, సాధారణ బడ్జెట్‌పైనా చర్చలో కూడా సాయిరెడ్డి పాల్గొని ప్రభుత్వం దృష్టికి అనేక సమస్యలు తీసుకు రావడంతో పాటుగా పలు నిర్మాణాత్మకమైన సూచనలు చేశారు. కాగా రాజ్యసభ సమావేశాల్లో 155 మంది సభ్యులు జీరో అవర్, ప్రత్యేక ప్రస్తావనలు, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ, బడ్జెట్‌పై చర్చ, బిల్లులపై మాట్లాడారు. (‘ఎల్‌ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ చారిత్రక తప్పిదం’)