టీడీపీ అరాచకాలపై ప్రజల్ని చైతన్యపరుస్తాం.. | Balireddy Pruthviraj Comments On TDP | Sakshi
Sakshi News home page

టీడీపీ అరాచకాలపై ప్రజల్ని చైతన్యపరుస్తాం..

Feb 17 2019 5:45 AM | Updated on Feb 17 2019 5:45 AM

Balireddy Pruthviraj Comments On TDP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీడీపీ ప్రభుత్వ అరాచకాలపై ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తామని సినీ నటుడు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బలిరెడ్డి పృథ్వీరాజ్‌ చెప్పారు. మార్చి మొదటి వారం నుంచి తన సహచర నటులతో కలిసి గ్రామగ్రామానికీ వెళ్లి వీధి నాటకాలు వేస్తామన్నారు. శనివారం హైదరాబాద్‌ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో సినీ నటుడు కృష్ణుడుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు. టీడీపీ కార్యకర్తలకు తప్ప అసలైన అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదని మండిపడ్డారు. ఎన్నికల హామీలు నెరవేర్చకుండా చంద్రబాబు ఎలా వంచించారో.. లోకేశ్, ఇతర మంత్రుల అవినీతి, అరాచకాలు, టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను నాటకాల ద్వారా ప్రజలకు వివరిస్తామని చెప్పారు. అలాగే దివంగత మహానేత వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, 108, ఉచిత విద్యుత్‌ తదితర పథకాలతో పాటు అధికారంలోకి రాగానే వైఎస్‌ జగన్‌ అమలు చేయనున్న నవరత్నాల గురించి వీధివీధిన నాటకాలు ప్రదర్శిస్తామన్నారు. దాసరి అరుణ్‌తో పాటు సినీ, టీవీ కళాకారులు ఈ ప్రదర్శనల్లో భాగస్వాములవుతారని వెల్లడించారు. 

కాపీరాయుడు చంద్రబాబు.. 
ఢిల్లీలో దీక్ష పేరుతో రూ.10 కోట్ల ప్రజాధనాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారని పృథ్వీరాజ్‌ విమర్శించారు. చంద్రబాబు కాపీ రాయుడని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతో నవరత్నాలను కాపీ కొడుతున్నాడని దుయ్యబట్టారు. డ్వాక్రా రుణాల మాఫీ చేస్తామని గత ఎన్నికలప్పుడు దగా చేసిన చంద్రబాబు.. పసుపు కుంకుమ పేరుతో మళ్లీ మహిళలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత ఎన్నికలప్పుడు ఇచ్చిన 600 హామీలను చంద్రబాబు తుంగలో తొక్కారని మండిపడ్డారు. దేశంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇతరులకు మద్దతిస్తున్న పార్టీ ఒక్క జనసేన మాత్రమేనన్నారు.  ప్రజల ఆశీర్వాదం వైఎస్సార్‌సీపీకే ఉందని.. టీడీపీని ఈసారి 30 స్థానాలకే పరిమితం చేస్తారన్నారు.

తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఖమ్మం నుంచి కూకట్‌పల్లి వరకు ఎలా చక్రం తిప్పింది అందరూ గమనించారని ఎద్దేవా చేశారు. కేఏ పాల్, చలసాని శ్రీనివాస్‌ టీడీపీ కోవర్టులన్నారు. ఊపిరి ఉన్నంత వరకు వైఎస్‌ జగన్‌ వెంటే నడుస్తానని చెప్పారు. రాష్ట్ర కార్యదర్శిగా పృథ్వీ నియామకం పట్ల కృష్ణుడు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు పృథ్వీరాజ్‌ను సత్కరించారు. కాగా, జమ్ము కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం చెందిన సైనికుల కుటుంబాలకు పృథ్వీరాజ్‌ తన సానుభూతి తెలిపారు. వీరసైనికుల పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement