బీసీ కమిషన్‌ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

AP Assembly Approves BC Commission bill - Sakshi

సాక్షి, అమరావతి: సామాజికంగా వెనుకబడిన బీసీలకు న్యాయం చేకూర్చేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ బిల్లుకు శాసనసభ మంగళవారం ఆమోదం తెలిపింది. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. అంతకుముందు బీసీ కమిషన్‌ బిల్లుపై సభలో చర్చ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ.. బలహీన వర్గాల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ కృషి చేయడం అభినందనీయమన్నారు. శాశ్వత బీసీ కమిషన్‌ బిల్లుపై అసెంబ్లీ చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. వెనుకబడిన వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించడానికి సీఎం వైఎస్‌ జగన్‌ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని తెలిపారు. సమాజంలో బీసీలు ఇతర వర్గాలతో సమాన స్థాయికి ఎదగాలనే బీసీ కమిషన్‌ బిల్లును తీసుకొచ్చామన్నారు. చంద్రబాబు హయాంలో బీసీల అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.  

బీసీలను కించపరిచేవిధంగా చంద్రబాబు మాట్లాడారని పార్థసారథి గుర్తుచేశారు. దళితుల్లో పుట్టాలని ఎవరు అనుకుంటారని చంద్రబాబు అన్నారని పేర్కొన్నారు. విస్తృత అధికారాలు, లక్ష్యాలతో బీసీ కమిషన్‌ చట్టం రాబోతున్నదని పేర్కొన్నారు. ఔట్‌ సోర్సింగ్‌ విధానాన్ని విస్తృతంగా తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వమేనని, దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ విధానం అమలుకాకుండాపోయిందని అన్నారు. దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా టీడీపీ పాలన సాగిందన్నారు. టీడీపీ హయాంలో కులాల తారతమ్యాలు తగ్గలేదని, అలాంటి పరిస్థితుల్లో బీసీ కమిషన్‌ బిల్లు వెనుకబడిన వర్గాలను ఆదుకుంటుందని తెలిపారు. 

బీసీ కమిషన్‌ ఏర్పాటుతో వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయని అన్నారు. సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సూచనలు ఇచ్చేందుకు బీసీ కమిషన్‌కు హక్కు ఉంటుందన్నారు. కులాల సర్టిఫికెట్ల జారీ అంశాన్ని బీసీ కమిషన్‌ ద్వారా తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు. బీసీల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు టీడీపీ ఒక్క కార్యక్రమమైనా చేసిందా? అని ప్రశ్నించారు. బీసీలకు మేలు చేసేందుకు బీసీ కమిషన్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సభలో టీడీపీ ప్రవర్తన ప్రజలు గమనించారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. 

బీసీలకు న్యాయం చేసేందుకు బీసీ కమిషన్‌
వైఎస్సార్‌సీపీ సభ్యుడు ​కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బీసీ ప్రజలకు న్యాయం చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ సంకల్పించారని, పాదయాత్రలో బీసీ ప్రజల కష్టాలు తెలుసుకొని.. వారికి న్యాయం చేసేందుకు బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. బీసీ వర్గంలో ఎన్ని కులాలు ఉన్నాయో.. అన్ని కులాల వారందరికీ దీని వల్ల న్యాయం జరుగుతుందన్నారు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆ సమస్యను బీసీ కమిషన్‌ పరిష్కరిస్తుందని కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. బీసీలతోపాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకూ న్యాయం జరిగేలా బీసీ కమిషన్‌ చూస్తుందన్నారు. శాశ్వత బీసీ కమిషన్‌ బిల్లు బీసీలకు ధైర్యాన్నిస్తుందని, ఈబిల్లును ఓర్వలేక టీడీపీ సభను అడ్డుకుందని మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top