ఈ మూడు రోజులు కీలకం

Anatapur District Collector Veera Pandian Instructing Constituencies ROs For Election Arrangements - Sakshi

నియోజకవర్గాల ఆర్‌ఓలను ఆదేశించిన కలెక్టర్‌ వీరపాండియన్‌  

సాక్షి, అనంతపురం అర్బన్‌: ‘సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఘట్టం పోలింగ్‌ ఈనెల 11న జరగనుంది. ఈ మూడు రోజులు అత్యంత కీలకం. ఎన్నికల విధుల్లో పొరపాట్లకు, విమర్శలకు చోటివ్వకండి. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ఉల్లంఘన జరగకూడదు. ఓటరు స్లిప్‌లు బీఎల్‌ఓల ద్వారానే పంపిణీ జరగాలి. రాజకీయ పార్టీల ద్వారా జరిగితే కఠిన చర్యలు ఉంటాయి.’’ అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ ఆదివారం స్థానిక ఎస్‌ఎస్‌బీఎన్‌న్‌ డిగ్రీ కళాశాలలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు, అసిస్టెంట్‌ కలెక్టర్‌ కె.ఎస్‌.విశ్వనాథన్‌తో కలిసి ఆర్‌ఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మూడు రోజులు చాలా కీలకం, ఎక్కడా పోరపాటు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రాల్లో తప్పనిసరిగా వీడియోగ్రఫీ చేయించాలని ఆదేశించారు. 

బీఎల్‌ఓలతో అండర్‌ టేకింగ్‌ తీసుకోండి 
ఓటరు స్లిప్పులు రాజకీయపార్టీల ద్వారా పంపిణీ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటరు స్లిప్పులు అనధికార వ్యక్తులకు స్వాధీనం చేయలేదని బీఎల్‌ఓలతో అండర్‌ టేకింగ్‌ తీసుకోవాలని ఆర్‌ఓలను కలెక్టర్‌ ఆదేశించారు. ఓటర్ల జాబితా మార్కింగ్‌ సోమవారం నాటికి పూర్తి చేయాలన్నారు.  

పొరపాట్లు జరగకూడదు 
డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్‌ కేంద్రాల్లో పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దివ్యాంగ ఓటర్ల కోసం వీల్‌ చైర్‌లు ఏర్పాటు చేసుకోవాలని, వాలంటీర్లను నియమించుకోవాలన్నారు. అంధ ఓటర్ల కోసం ప్రత్యేకంగా బ్రెయిలీ బ్యాలెట్‌ పత్రం ఏరా>్పటు చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కు వినియోగించుకునే విధంగా సౌకర్యాలు కల్పించాలన్నారు. 

చురుకుగా పనిచేయాలి 
ఈ మూడు రోజులూ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, ఎంసీసీ, వీఎస్‌టీ బృందాలు చురుకుగా పనిచేయాలన్నారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు విస్తృతంగా పర్యటించి తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. ఇందుకోసం అదనంగా రెవెన్యూ సిబ్బందిని వినియోగించుకోవాలన్నారు. సివిజిల్‌లో వచ్చే ఫిర్యాదులపై తక్షణం స్పందించాలన్నారు. ఎన్నికల విధుల నిర్వహణకు నియమించిన ఉద్యోగులకు మినహాయింపులు ఇవ్వరాదని ఆదేశించారు. పోలింగ్‌కు అవసరమైన సామగ్రి సక్రమంగా ఉన్నాయా లేదాని తనిఖీ చేసుకోవాలన్నారు. 

శిక్షణ నిర్వహించండి 
పోలింగ్‌ నిర్వహణపై నియోజకవర్గాలకు చెందిన పీఓలు, ఏపీఓలకు శిక్షణ కార్యక్రమాలను సోమవారం నిర్వహించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు సంబంధిత ఆర్‌ఓలకు సూచించారు. పోలింగ్‌ ప్రక్రియకు సంబంధించిన విధులు, నివేదికలు గురించి ఆర్‌ఓలకు క్షుణ్ణంగా వివరించారు. సమావేశంలో జేసీ–2 హెచ్‌.సుబ్బరాజు, డీఆరో ఎం.వి.సుబ్బారెడ్డి, అన్ని నియోజకవర్గాల ఆర్‌ఓలు పాల్గొన్నారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top