పార్లమెంట్‌లో ఇచ్చిన మాట శాసనమే | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌లో ఇచ్చిన మాట శాసనమే

Published Mon, Jul 22 2019 1:32 PM

Anakapalle MP Sathyavathi SaysThe Word Given In Parliament Is Edict - Sakshi

సాక్షి, సింహాచలం (పెందుర్తి): రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్‌ సాక్షిగా చెప్పడం జరిగింది..పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన మాట ఒక శాసనమే..దానికి కట్టుబడి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం హోదా ఇవ్వాల్సిందే అని అనకాపల్లి ఎంపీ భీశెట్టి సత్యవతి అన్నారు. సింహాచల వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఆదివారం ఆమె కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. ఈసందర్భంగా విలేకరులతో మాట్లాడారు. నీతి ఆయోగ్‌ ద్వారా రాష్ట్రానికి అన్ని సదుపాయాలు కలుగజేస్తామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పినా హోదా మాత్రం కచ్చితంగా ఇవ్వాల్సిందేనని తెలిపారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎంపీలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అవకాశం వచ్చినప్పుడల్లా ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తాలని దిశానిర్దేశం చేశారన్నారు.

రాష్ట్రంలోని 22 మంది ఎంపీలు విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో హోదా కోసం పోరాటం చేస్తున్నట్టు చెప్పారు. రైల్వేజోన్‌పై కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌తో మాట్లాడటం జరిగిందని..రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు తక్షణం ఇస్తామని చెప్పారన్నారు. వాల్తేరు డివిజన్‌ను విశాఖ జోన్‌లోనే ఉంచాలని తామంతా ఫ్లోర్‌లీడర్‌ మిథున్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రిపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే వినతిపత్రం కూడా ఇచ్చామన్నారు. వాల్తేరు డివిజన్‌ అనేదే లేకుండా చేయడం సరికాదన్నారు. అనకాపల్లి–ఆనందపురం ఆరులైన్లు రోడ్డు మార్గం త్వరితగతిన పూర్తయ్యేలా కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ దృష్టికి సోమవారం తీసుకెళ్లనున్నట్టు వెల్లడించారు. రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తిచేయడం, టోల్‌గేట్‌వద్ద స్కూల్‌ బస్సులు, ప్రభుత్వ వాహనాలకు ఫీజుల మినహాయింపు విషయాలని గడ్కరీని కోరుతామని చెప్పారు.

తిరుమలలో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో సింహాచలంలో అలాంటి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం తరపున తనవంతు సహకారం అందిస్తానని ఎంపీ చెప్పారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్టు తెలిపారు. సత్యవతి దంపతులు కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో అష్టోత్తరంపూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. 

Advertisement
Advertisement