కాషాయ జెండా ఎగురవేస్తాం 

Amit Shah Telangana Assembly Election Campaign Kamareddy - Sakshi

సాక్షి, కామారెడ్డి: ‘‘తెలంగాణ రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కూటమి, టీఆర్‌ఎస్‌లకు ఓటమి తప్పదు. కమలం వికసిస్తుంది.. కాషాయ జెండా ఎగురుతుంది’’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పే ర్కొన్నారు. కామారెడ్డి పట్టణంలో ఆదివా రం సాయంత్రం మార్పు కోసం బీజేపీ బ హిరంగ సభ నిర్వహించారు. సభలో అమిత్‌షా మాట్లాడారు. కాంగ్రెస్‌ కూటమి, టీ ఆర్‌ఎస్‌లపై విరుచుకుపడ్డారు.

రాష్ట్రంలో ప్రస్తుతం కేసీఆర్‌ సారథ్యంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ మజ్లిస్‌కు లొంగిపోయిందని, కాంగ్రెస్‌ పార్టీ కూడా లొంగడానికి సిద్ధంగా ఉందని విమర్శించారు. బీజేపీ తెలంగాణ వికాసం కోసం పనిచేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ  అధికారంలోకి రాగానే 17 సెప్టెంబర్‌ను తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

కొడుకు కోసమే ముందస్తుకు.. 
లోక్‌సభ ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉందని, అయితే మోదీ ప్రభావంతో ఓటమి భయం పట్టుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లాడని అమిత్‌ షా విమర్శించారు. ముందస్తు ఎన్నికలతో తెలంగాణ ప్రజలపై అదనపు భారం పడిందన్నారు. కొడుకు కోసం, కుటుంబం కోసం ఆరాటపడుతూ కేసీఆర్‌ ప్రజలపై భారం మోపుతున్నాడని ఆరోపించారు.
 
ఒక్క అవకాశం ఇవ్వండి 
దేశంలో నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం వాటిని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా పేద కుటుంబాలకు ఆరోగ్యభద్రత కల్పిస్తే.. దాన్ని అమలు చేయకుండా ప్రజలకు అన్యాయం చేశాడన్నారు. దేశంలో ఇప్పటి వరకు 3.50 లక్షల కుటుంబాలు ఆయుష్మాన్‌భారత్‌ పథకాన్ని వినియోగించుకున్నాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు, కోదండరాం పార్టీ, టీడీపీలు కలిసి కూటమి కట్టారని, వారిని ప్రజలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని అమిత్‌ షా పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు, టీడీపీకీ, టీఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చారని, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే దేశంలోనే నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
 
హిందువుల గురించి ఎందుకు మాట్లాడరు? 
కాంగ్రెస్‌ పార్టీ తమ మేనిఫెస్టోలో మజీద్‌లు, చర్చీల కరెంటు బిల్లులు మాఫీ చేస్తామని చెప్పిందని, మరి హిందూ ఆలయాల గురించి ఎందుకు మాట్లాడదని అమిత్‌ షా నిలదీశారు. ఉర్దూ చదివిన వారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తామంటున్నారని, తెలుగు చదివిన వారికి ఎందుకు ప్రాధాన్యతనివ్వరని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ వికసిస్తుందని, అందుకే తెలంగాణ ప్రజలు కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని కోరారు.

ప్రతి ఒక్కరూ మార్పు కోసం సంకల్పం తీసుకోవాలన్నారు. సభలో బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు, కామారెడ్డి అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఎల్లారెడ్డి అభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డి, బాన్సువాడ అభ్యర్థి నాయుడు ప్రకాశ్, నాయకులు మురళీధర్‌గౌడ్, మర్రి రాంరెడ్డి, నీలం చిన్న రాజులు, తేలు శ్రీనివాస్, సురేందర్‌రెడ్డి, మోజీరాంనాయక్, నరేందర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, బాలకిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top