క్యాష్‌ 'పార్టీ' కీలకం

Alternatives to the BJP and Congress Parties - Sakshi

చక్రం తిప్పనున్న నయాధనిక వర్గం

బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా వ్యూహాలు  

అజిత్‌జోగి – బీఎస్పీ కూటమితో కలిసి ముందుకు

చాపకింద నీరులా విస్తరణ

మధ్యప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ విడిపోయి 18 ఏళ్లవుతుంది. ఈ కాలంలో వివిధ రంగాల్లో రాష్ట్రం పురోగతి సాధించింది. కొత్త ప్రపంచస్థాయి రాజధాని మొదలుకుని చాలా కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేసింది. ఈ ప్రగతి ప్రయాణంలోనే.. ఛత్తీస్‌గఢ్‌లో నయా ధనిక వర్గం ఆవిర్భవించింది. ఈ వర్గం స్థానికంగా బలపడుతూ.. రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి చేరేలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగానే ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నయాధనిక వర్గం ప్రభావం చూపనుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. అయితే బీజేపీ, లేదంటే కాంగ్రెస్‌ అన్నట్లుగా ఉన్న పరిస్థితినుంచి ఈ వర్గం సొంతబలంతో ఎదిగేందుకు కృషిచేస్తోంది. క్రమేణా ప్రధానపార్టీల బలం క్షీణిస్తుండటంతో.. మాజీ సీఎం, కొత్తపార్టీ పెట్టిన అజిత్‌ జోగి నేతృత్వంలోని మూడో ఫ్రంట్‌తో రాజకీయ ప్రవేశానికి ప్రయత్నాలు చేస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు అవకాశం లభించిన జోగి ఆలోచనలకు ఈ వర్గం అండగా నిలుస్తోందనే ప్రచారం జరుగుతోంది.  

కాంగ్రెస్‌ నుంచి బీజేపీకి మార్పు 
రాష్ట్రం ఏర్పాటయ్యేనాటికి అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 48మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో 22 మంది గిరిజన ఆధిపత్యంగల సర్గుజ, బస్తర్‌ డివిజన్ల నుంచే (మొత్తం 26 సీట్లలో) గెలిచారు. వీటిలో 25 ఎస్టీ రిజర్వ్‌డ్‌ స్థానాలు. ఇక బిలాస్‌పూర్, రాయ్‌పూర్, దుర్గ్‌ డివిజన్లలో ఉన్న 64 సీట్లలో బీజేపీకి 32, కాంగ్రెస్‌కు 29 ఉన్నాయి. రాష్ట్రంలో మొదటి అసెంబ్లీ ఎన్నికల నాటికి (2003) పరిస్థితి మారిపోయింది. బస్తర్, సర్గుజ డివిజన్లలో బీజేపీ పట్టు సాధిస్తే.. బిలాస్‌పూర్, రాయ్‌పూర్, దుర్గ్‌ డివిజన్లలో కాంగ్రెస్‌ పాగావేసింది. 2008 ఎన్నికల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. అయితే, 2013 ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ దెబ్బతిన్నాయి. సర్గుజ, బస్తర్‌లలో కాంగ్రెస్‌ 15 సీట్లే గెలుచుకుంది. 37 మంది కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో 26 మంది ఓడిపోయారు. బీజేపీ కూడా ప్రభుత్వ వ్యతిరేకతతో నష్టపోయింది. 

ఆ ఎన్నికల్లో ఐదుగురు మంత్రులు సహా పలువురు సిట్టింగ్‌లు ఓడిపోయారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ.. 2004, 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల్లో ఒకరికి మొత్తం 11 సీట్లకు గాను పది సీట్లు దక్కాయి. కానీ.. అసెంబ్లీల్లో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల అభ్యర్ధులు గణనీయమైన ఓట్లు సంపాదించారు. ఈ పరిస్థితిపై  ప్రధాన పార్టీల్లో 2014 నుంచి కలవరం మొదలైంది. క్షీణిస్తున్న పార్టీల ఓటుబ్యాంకు రాష్ట్ర ఆవిర్భావం నుంచి 2018 వరకు ఛత్తీస్‌గఢ్‌ రాజకీయాల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌లు రెండింటి ఓటు బ్యాంకులూ క్షీణిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం స్థానిక వర్గం (నయా ధనికవర్గం) బలపడటమే కాక ఎన్నికల ఫలితాలను నిర్ణయించే శక్తిగా ఎదుగుతూ వస్తోంది. ధనబలంతో పాటు కులం బలం ఆధారంగా ఈ వర్గం సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసే సత్తా సంతరించుకుంది. ప్రధాన పార్టీలతో వీరు తలపడటంతో చాలా చోట్ల బహుముఖ పోటీలు అనివార్యమయ్యాయి. ఈ అభ్యర్ధులు ప్రధాన పార్టీల ఓట్లను చీల్చడం వల్ల ఓట్లను నిర్ణయించే స్థితికి చేరుకున్నారు. 

బ్రాహ్మణులకూ బీఎస్పీ టికెట్లు 
ఉదాహరణకు బెల్టర నియోజకవర్గంలో బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే (బ్రాహ్మణుడు)ను కాదని పార్టీ జిల్లా అధ్యక్షుడు రజనీష్‌ సింగ్‌ను నిలబెట్టింది. కాంగ్రెస్‌ ఓబీసీ అభ్యర్థిని బరిలో దించింది. జోగి–బీఎస్పీ కూటమి పంజాబీ బ్రాహ్మణుడిని పోటీకి దించింది. బీజేపీకి సంప్రదాయకంగా వస్తున్న బ్రాహ్మణుల ఓట్లను రాబట్టుకోవడానికి ఈ కూటమి పంజాబీ బ్రాహ్మణుడిని ఎన్నుకుంది. అలాగే, బీఎస్‌పీ మద్దతు ఉండటం వల్ల కాంగ్రెస్‌కు పడే దళితుల ఓట్లను కూడా చీల్చే అవకాశం ఉంది. ఏ పార్టీ ఓట్లను ఏ మేరకు చీల్చగలడన్న దానిపై సదరు అభ్యర్థి విజయం ఆధారపడి ఉంటుంది. అలాగే, అకల్తరలో జోగి కోడలు బీఎస్పీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. ఆమెకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కూడా బలమైన వాడే. సిట్టింగ్‌ ఎమ్మెల్యే కాంగ్రెస్‌ వ్యక్తి. ఆయన కాంగ్రెస్‌ ఓట్లు జారిపోకుండా చూసుకోగలిగితే ఆ మేరకు బీఎస్పీ నష్టపోతుంది. లేదంటే బీఎస్పీ అభ్యర్ధి అవకాశాలు మెరుగుపడతాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top