
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ, రాష్ట్ర ప్రజల అభీష్టాన్ని మరోసారి కేంద్రానికి గట్టిగా తెలియజేసేందుకు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఈ నెల 24న ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపునకు వివిధ పార్టీలు, అన్ని వర్గాల మద్దతు లభిస్తోంది. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా, సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం, ముస్లిం జన జాగృతి సమితి బంద్‌కు తమ మద్దతు ప్రకటించాయి. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ శనివారం విలేకరుల సమావేశంలో రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
హోదాతోనే భవిత అంటున్న యువత
ప్రత్యేక హోదాతోనే పారిశ్రామికాభివృద్ధి సాధ్యమని, విభిన్న అవకాశాలతో తమ భవిష్యత్తు బాగుపడుతుందని యువత విశ్వసిస్తోంది. ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా వైఎస్సార్‌సీపీ అలుపెరగని పోరాటం కొనసాగిస్తుండగా సీఎం చంద్రబాబు మాత్రం ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా అని, హోదా కలిగిన రాష్ట్రాలు ఏమైనా బాగుపడ్డాయా అని ఎద్దేవా చేశారు. హోదా తప్పనిసరని, దాన్ని సాధించుకోవడానికి అందరం కలిసి ప్రయత్నిద్దామని వైఎస్ జగన్ పదే పదే చెప్పినా చంద్రబాబు చెవికెక్కించుకోలేదు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సమయంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం తీవ్రస్థాయిలో తమ వాణిని వినిపించి కేంద్రంపై 13 సార్లు అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చారు. చివరకు ఏప్రిల్ 6న తమ పదవులకు రాజీనామా చేశారు. అదే రోజు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షను చేపట్టి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎంత అవసరమో దేశానికి తెలియజెప్పారు. కాగా, ప్రత్యేక హోదాను కోరుతూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలను చంద్రబాబు సర్కారు ఎక్కడికక్కడ అణచివేయడానికి ప్రయత్నించింది.
విద్యార్థులను, యువతను చైతన్యవంతుల్ని చేయడానికి వైఎస్సార్‌సీపీ యువభేరి కార్యక్రమాలను రాష్ట్రమంతటా నిర్వహిస్తుంటే ఆ కార్యక్రమాలకు వెళ్లినా, ఆ ఊసెత్తినా పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని భయభ్రాంతులకు గురిచేసింది. అంతేకాకుండా పిల్లలు జాగ్రత్త అంటూ తమకు హెచ్చరికలు పంపారని, ఇప్పుడేమో చంద్రబాబు యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా అవసరమని అంటున్నారని, ఊసరవెల్లులు కూడా ఇలా రంగులు మార్చలేవని విద్యార్థులు, యువత తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి, వామపక్షాలు, కాంగ్రెస్, వివిధ ప్రజా సంఘాలు ప్రత్యేక హోదా కోసం నినదించిన సందర్భాల్లోనూ చంద్రబాబు సర్కారు వారిని అణచివేయడానికే ప్రయత్నించింది.
రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా స్వప్రయోజనాల కోసం ప్రత్యేక ప్యాకేజీ కావాలని కేంద్రం వద్ద చంద్రబాబు అర్రులు చాచారని, ఇప్పుడేమో అసలు ప్యాకేజీ కోరలేదని, హోదాను వద్దనలేదని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని పరిశీలకులు అంటున్నారు. హోదా విషయంలో తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్ర ప్రజలను మోసగించాయని, ఈ పార్టీలను నమ్మొద్దని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్పష్టంగా చెప్పారని, హోదా విషయంలో తొలి నుంచి ఒకే మాటపై ఉన్నది వైఎస్సార్‌సీపీనేనని, అందుకే ఆ పార్టీ బంద్‌కు పిలుపునిచ్చినా, ఏ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చినా విజయవంతమవుతున్నాయని టీడీపీకి చెందిన ఓ మాజీ మంత్రి, సీనియర్ నేత విజయవాడలో ‘సాక్షి’తో చెప్పారు. బంద్‌కు అన్ని వర్గాల మద్దతు లభిస్తోందని సామాజిక ఉద్యమాల్లో పాల్గొంటున్న ఒక సీనియర్ నాయకుడు అభిప్రాయపడ్డారు.
నిరుద్యోగ యువత బంద్‌ను జయప్రదం చేయాలి
తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఏపీకి చేసిన మోసానికి గాను ఈ నెల 24న జరగనున్న బంద్‌కు మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ప్రత్యేక హోదా లేక లక్షలాది మంది ముస్లిం యువత చదువుకుని గల్ఫ్ దేశాలకు వలస కూలీలుగా వెళుతున్నారు. కనీసం తన మంత్రివర్గంలో ఒక మైనార్టీకి కూడా చంద్రబాబు అవకాశం ఇవ్వలేదు. నిరుద్యోగ యువత స్వచ్ఛందంగా పాల్గొని బంద్‌ను జయప్రదం చేయాలి.
–షబ్బీర్ అహ్మద్, అధ్యక్షుడు, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా
ప్రధాని మోదీ హామీ నిలబెట్టుకోవాలి
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్‌సీపీ ఇచ్చిన బంద్ పిలుపునకు మా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది. గత సాధారణ ఎన్నికల సందర్భంగా తిరుపతి సభలో ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ పార్టీ మోసం చేయగా, అధికారంలో ఉన్న మోదీ, చంద్రబాబు ప్రభుత్వాలు హోదా సాధనకు తూట్లు పొడిచాయి. హోదాతో ఏమొస్తుందని, ప్యాకేజీలోనే అన్నీ ఇస్తున్నారని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ తీసుకొని ప్రజలను మోసం చేస్తున్నారు.
–కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) – ఆంధ్రప్రదేశ్
బంద్‌ను విజయవంతం చేయండి
ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు, నరేంద్రమోదీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 24న నిర్వహించే రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలి. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుంది. హోదా వస్తే రాష్ట్రంలోని యువకులకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయి. బంద్‌ను విజయవంతం చేసి రాష్ట్ర ప్రజల సత్తాను దేశానికి చాటిచెప్పాలి.
– హరీష్‌కుమార్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం
హోదాకోసం వైఎస్సార్‌సీపీ చేసిన పోరాటాలు మరిన్ని కథనాలు ఇక్కడ చదవండి