మమత నాకు ఏటా స్వీట్లు పంపుతారు

Akshay Kumar interview with Prime Minister Narendra Modi - Sakshi

ప్రధాని అవుతానని కలలో కూడా అనుకోలేదు

ప్రతిపక్షాల్లో నాకు చాలామంది స్నేహితులున్నారు

రోజూ 3–4 గంటల నిద్రకు నా శరీరం అలవాటుపడిపోయింది

మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం.. కానీ తగ్గిస్తున్నా

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: భారత ప్రధానిగా బాధ్యతలు చేపడతానని తాను కలలో కూడా అనుకోలేదని ప్రధాని మోదీ తెలిపారు. చిన్నప్పటి నుంచి తాను సైనికుల నుంచి స్ఫూర్తి పొందాననీ, సైన్యంలో చేరి దేశసేవ చేద్దామనుకున్నట్లు చెప్పారు. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తనకు గాంధీజీ స్ఫూర్తి అన్న మోదీ.. స్వచ్ఛభారత్‌లో భాగంగా గత ఐదేళ్లలో 9 కోట్ల మరుగుదొడ్లు నిర్మించడం నిజంగా గొప్ప విజయమని వ్యాఖ్యానించారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ఏఎన్‌ఐ వార్తాసంస్థ తరఫున  మోదీని ఇంటర్వ్యూ చేశారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన ఈ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, బాల్యం, దినచర్య, అలవాట్లు సహా పలు అంశాలపై మోదీ ముచ్చటించారు.

ఆజాద్, మమత మంచి స్నేహితులు
ప్రతిపక్ష పార్టీల్లో మీకెవరైనా స్నేహితులు ఉన్నారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ ‘నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. మేమంతా అప్పుడప్పుడూ కలుస్తుంటాం. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ నాకు మంచి స్నేహితుడు. ఓసారి మేమిద్దరం పార్లమెంటులో చాలాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాం. దీంతో చాలామంది నేతలు ఆశ్చర్యపోయారు. వేర్వేరు సిద్ధాంతాలు, భావజాలాలకు చెందిన మీ మధ్య స్నేహం ఎలా? అని వాళ్లు అడిగారు. అప్పుడు ఆజాద్‌ చక్కటి జవాబిచ్చారు.

‘ఎన్నికల్లో మేం ప్రత్యర్థులం కావచ్చు. కానీ ఇద్దరం స్నేహితులం, ఒకే కుటుంబంలా ఉంటాం’ అని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ గురించి మాట్లాడుతూ.. ‘మమత సహా పలువురు నేతలతో నాకు మంచి స్నేహం ఉంది. రాజకీయ వైరం ఉన్నప్పటికీ ప్రతిఏటా మమత స్వయంగా కుర్తాలను కొని నాకు పంపిస్తూ ఉంటారు. బెంగాలీ మిఠాయిలంటే నాకెంతో ఇష్టమని తెల్సి వాటినీ పంపిస్తున్నారు’ అని తెలిపారు. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా తనకు బెంగాలీ స్వీట్లు ఢాకా నుంచి పంపుతారని తెలుసుకున్న మమత.. తానూ స్వీట్లు పంపడం మొదలుపెట్టారని చెప్పారు.

బాల్యంలోనే అన్ని బంధాలను వదులుకున్నా
మీకు కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలని ఎప్పుడైనా అనిపించిందా? అని అక్షయ్‌ అడిగిన ప్రశ్నకు మోదీ జవాబిస్తూ..‘చాలా చిన్నవయసులోనే కుటుంబం సహా అన్నింటిని వదులుకుని వచ్చేశాను.  కుటుంబ బాంధవ్యాల నుంచి దూరమైపోయాను. ఇప్పుడు అమ్మ దగ్గరికెళ్తే‘ఎందుకు నాకోసం పనులు మానుకుని సమయం వృథా చేస్తుంటావ్‌’ అంటుంది. అమ్మను ఇంటికి తీసుకొచ్చినప్పుడు నేను పనుల్లో పడి బాగా రాత్రిపోయాక ఇంటికి వస్తుంటాను. అప్పుడు కూడా అమ్మతో మాట్లాడటం కుదరదు. అందుకే నేనుంటున్న ప్రదేశానికి రావడం అమ్మకు ఇష్టముండదు. సొంత ఊర్లోనే గడపడానికి ఆమె ఇష్టపడుతుంది. ఇప్పటికీ అమ్మను కలవడానికి వెళితే నా చేతిలో రూ.1.25 పెడుతుంది’ అని చెప్పారు. ఒకవేళ తాను ప్రధానిగా కాకుండా చిన్నపాటి గుమస్తా ఉద్యోగం సాధించి ఉన్నా తన తల్లి ఇరుగుపొరుగువాళ్లకు సంతోషంతో లడ్డూలు పంచి ఉండేదన్నారు.

డ్రైవర్, ప్యూన్‌ పిల్లలకు రూ.21 లక్షలు ఇచ్చేశా
ప్రధాని కుర్చీలో కూర్చుంటానని తాను కలలో కూడా అనుకోలేదని మోదీ తెలిపారు. అత్యంత సామాన్యమైన కుటుంబం నుంచి రావడమే ఇందుకు కారణమన్నారు. ‘నాకు గతంలో బ్యాంకు ఖాతా కూడా లేదు. స్కూల్‌ రోజుల్లో ‘దేనా బ్యాంకు’ వాళ్లు అకౌంట్‌ ఇచ్చారు. హుండీ ఇచ్చి అందులో దాచుకున్న డబ్బులను బ్యాంకు ఖాతాలో జమచేస్తామని చెప్పేవారు. అయితే నా దగ్గర పెద్దగా డబ్బులుండేవి కావు. దీంతో నన్ను వెతుక్కుంటూ వచ్చిన బ్యాంకు అధికారులు ఖాతాలో కనీస నగదు నిల్వలు లేకపోవడంతో మూసివేయాలని సూచించారు.

నేను గుజరాత్‌ సీఎం అయ్యాక నాకొచ్చే నెలవారీ గౌరవ వేతనం ఆ బ్యాంకు ఖాతాలోనే పడేది. అధికారులు ఈ వేతనాన్ని నాకు తెచ్చి ఇచ్చినప్పుడు ‘దీన్ని నేనేం చేసుకోవాలి? నాకు ఇచ్చుకోవడానికి ఎవ్వరూ లేరు’ అని చెప్పా. కానీ అధికారులు ‘సార్‌ మీపై కేసులు ఉన్నాయి. వాదించే లాయర్‌కైనా ఇవ్వాలికదా’ అన్నారు. కానీ నేను వద్దని చెప్పా. అప్పట్లో గుజరాత్‌ సచివాలయంలో డ్రైవర్, ప్యూన్‌లుగా పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలకు రూ.21 లక్షలు ఇచ్చేశాను’’ అని మోదీ వెల్లడించారు.

ఒబామా అదే చెప్తారు
రోజుకు కేవలం 3–4 గంటలు నిద్ర ఎలా సరిపోతుంది? అని అక్షయ్‌ కుమార్‌ మోదీని ప్రశ్నించారు. దీనికి ఆయన జవాబిస్తూ..‘నా గురించి తెలిసిన చాలామంది స్నేహితులకు నా నిద్ర విషయంలో ఆందోళన ఉంది. స్నేహితుడు, అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా నన్ను ఎప్పుడు కలిసినా నిద్రపోయే సమయం పెంచుకోమని పదేపదే చెబుతుంటారు. తక్కువసేపు నిద్రపోయే ఆరోగ్యం దెబ్బతింటుందని అంటుంటారు. కానీ రోజుకు 3–4 గంటల నిద్ర నా శరీరానికి అలవాటైపోయింది. పనివేళల్లో నాకు ఒత్తిడిగా అనిపించదు. నిద్ర కూడా రాదు’ అని తెలిపారు. ప్రధానికి మామిడి పండ్లంటే ఇష్టామా? కాదా? అని అడగాల్సిందిగా తన డ్రైవర్‌ కుమార్తె కోరిందని అక్షయ్‌ తెలపగా..‘నాకు మామిడిపండ్లంటే చాలా ఇష్టం. కానీ ఆరోగ్యరీత్యా తియ్యటి పండ్లను తినడాన్ని తగ్గించుకుంటున్నా’ అని సమాధానమిచ్చారు.

కోపం వస్తే అదే చేస్తా
తనకు సాధారణంగా కోపం రాదని అన్నారు. ‘కోపం కారణంగా ప్రతికూలత వస్తుంది. కాబట్టి నేను ఎవ్వరిపైనా కోప్పడను. కానీ ఎప్పుడైనా నా భావోద్వేగాలు అదుపుతప్పితే ఓ కాగితం తీసుకుని అందులో అసలు కోపం రావడానికి గల కారణం రాస్తాను. ఆ తర్వాత దాన్ని చించేస్తాను. నా కోపం తగ్గేవరకూ ఇలా పదేపదే చేస్తూనే ఉంటాను. దీనివల్ల నాలోని కోపం మొత్తం బయటకు వెళ్లిపోయిన భావన కలుగుతుంది. ఈ సందర్భంగా నన్ను నేను విశ్లేషించుకుంటాను. దీనివల్ల నా తప్పులను తెలుసుకునే అవకాశం నాకు లభిస్తుంది’ అని తెలిపారు.

కొత్త వృత్తిలో మోదీ: కాంగ్రెస్‌
ప్రధాని నరేంద్ర మోదీని హీరో అక్షయ్‌ కుమార్‌ ఇంటర్వ్యూ చేయడంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా మండిపడింది. మే 23న ప్రజలు తిరస్కరించబోతున్న, విఫలమైన ఓ రాజకీయ నేత ప్రత్యామ్నాయ ఉపాధిని చూసుకుంటున్నారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా దుయ్యబట్టారు. ‘అక్షయ్‌ కుమార్‌ విజయవంతమైన గొప్ప నటుడు. ఆయన సినిమాలంటే మాకు చాలా ఇష్టం. పలు బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను ఆయన అందించారు. కానీ భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన, లక్షలాది ఉద్యోగాలను తుడిచిపెట్టేసిన, దేశంలోని కోట్లాది రైతులు, నిరుపేదల బతుకును నరకప్రాయం చేసిన ఓ విఫల రాజకీయ నేత ఇప్పుడు అక్షయ్‌ కుమార్‌ కంటే గొప్ప నటుడు అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని  సూర్జేవాలా విమర్శించారు. కానీ దేశం విషయంలో విఫలమైనట్లే నటనలోనూ ప్రధాని మోదీ విఫలమయ్యారని స్పష్టం చేశారు.

నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. మేమంతా అప్పుడప్పుడూ కలుస్తుంటాం. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ నాకు మంచి స్నేహితుడు. ఓసారి మేమిద్దరం పార్లమెంటు హౌస్‌లో చాలాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాం. దీంతో చాలామంది నేతలు ఆశ్చర్యపోయారు.

చాలా చిన్నవయసులోనే కుటుంబం సహా అన్నింటిని వదులుకుని వచ్చేశాను. కుటుంబ బాంధవ్యాల నుంచి దూరమైపోయాను. ఇప్పుడు కూడా మా అమ్మను కలవడానికి వెళ్లితే ‘ఎందుకు నాకోసం పనులు మానుకుని సమయం వృథా చేస్తుంటావ్‌’ అంటుంది.

నేను ఎవ్వరిపైనా కోప్పడను. కానీ ఎప్పుడైనా నా భావోద్వేగాలు అదుపుతప్పితే ఓ కాగితం తీసుకుని అందులో అసలు కోపం రావడానికి గల కారణం రాస్తాను. ఆ తర్వాత దాన్ని చించేస్తాను.

మీ కాపురం ప్రశాంతంగా ఉందిగా..
అక్షయ్‌ భార్య ట్వింకిల్‌  తనపై ట్విట్టర్‌లో  విమర్శలు చేయడంపై  మోదీ సరదాగా స్పందించారు. ‘ప్రపంచంలో ఏం జరుగుతుందో తెల్సుకునేందుకు సోషల్‌మీడియా చూస్తా. అందులో భాగంగా ట్వింకిల్‌ ఖన్నా, మీ(అక్షయ్‌) ట్విట్టర్‌ ఖాతాలను కూడా ఫాలో అవుతున్నా. ట్వింకిల్‌ తన కోపాన్నంతా నాపై తీర్చుకుంటూ ఉంటుంది. ఆవిడ నన్ను లక్ష్యంగా చేసుకుంటున్న తీరును బట్టి మీ కాపురం చాలా ప్రశాంతంగా, సజావుగా సాగుతోందని అర్థం చేసుకోగలను. దీనివల్ల మీరు ఇంట్లో ప్రశాంతంగా ఉంటున్నారని అనుకుంటున్నా’ అని వ్యాఖ్యానించారు. ట్విట్టర్‌లో వచ్చే మెమెలను తాను చాలా ఎంజాయ్‌ చేస్తాననీ, అందులో సృజనాత్మకత అద్భుతంగా ఉంటుందని మోదీ కితాబిచ్చారు. సోషల్‌మీడియా సాయంతో తాను సామాన్యుల ఆలోచనల్ని అర్థం చేసుకోగలనని తెలిపారు.

సానుకూలంగా తీసుకుంటా: ట్వింకిల్‌
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై అక్షయ్‌ కుమార్‌ కుమార్‌ భార్య ట్వింకిల్‌ వెంటనే స్పందించారు. తాను చేసిన విమర్శలపై ప్రధాని కామెంట్లను సానుకూలంగా తీసుకుంటున్నట్లు ట్వింకిల్‌ తెలిపారు. ‘నేను ఈ వ్యాఖ్యలను సానుకూలంగా తీసుకుంటున్నా. ప్రధాన మంత్రి మోదీకి నేనెవరో తెలియడం మాత్రమే కాదు. ఆయన నా రచనలను కూడా చదువుతున్నారు’ అని ట్వీట్‌ చేశారు. పలు బాలీవుడ్‌ సినిమాల్లో నటించిన ట్వింకిల్‌  ప్రస్తుతం సామాజిక అంశాలపై వార్తాపత్రికల్లో కథనాలు రాస్తున్నారు. అంతేకాకుండా మిసెస్‌ ఫన్నీబోన్స్, ది లెజెండ్‌ ఆఫ్‌ లక్ష్మీప్రసాద్‌ అనే పుస్తకాలను ట్వింకిల్‌ రాశారు.

బూట్లకు చాక్‌పీస్‌ పొడితో పాలిష్‌..
చిన్నప్పుడు పేదరికం కారణంగా వచ్చిన ఆత్మన్యూనతా భావంతో బాగా కనిపించాలని ఉబలాటపడేవాడ్ని. అందులో భాగంగా నా తెలుపురంగు బూట్లు మరింత తెల్లగా కన్పించేందుకు చాక్‌పీస్‌ పొడిని వాడేవాడిని. దుస్తులపై మడతలు లేకుండా చేసేందుకు ఓ వంటపాత్రలో నిప్పు కణికలు వేసి ఇస్త్రీ చేసుకునేవాడిని. గుజరాత్‌ సీఎం బాధ్యతలు స్వీకరించేవరకూ నా దుస్తులను నేనే ఉతుక్కునేవాడిని’ అని తెలిపారు. బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు తాను చాలా జాగ్రత్తగా ఉంటాననీ, ఎందుకంటే తన వ్యాఖ్యలను వక్రీకరించే అవకాశముందని వెల్లడించారు.

వంటింటి చిట్కాలతో చికిత్స..
ప్రస్తుతం జలుబు, దగ్గు, తలనొప్పి వంటి చిన్న సమస్యలకు ఈతరం అలోపతి మందులను ఆశ్రయిస్తోందన్నారు. కానీ తాను మాత్రం వంటింటి చిట్కాలతో రెండ్రోజుల్లో జలుబును తగ్గించుకుంటానని తెలిపారు. ‘‘ఒకవేళ నాకు జలుబు వస్తే గోరువెచ్చటి నీళ్లు తాగుతా. అందులో ఏమీ కలుపుకోను. అలాగే రెండ్రోజుల పాటు ఉపవాసం ఉంటాను. ఇలాంటప్పుడు ఆవ నూనె అద్భుతంగా పనిచేస్తుంది. ఆవనూనెను కొద్దిగా వేడిచేసి నిద్రపోయేముందు ముక్కులో రెండు చుక్కలు వేసుకోవాలి. కొంచెం మంటగా అనిపించినా జలుబు, ముక్కు దిబ్బడ రెండ్రోజుల్లో తగ్గిపోతుంది. అలాగే నాకు కాళ్ల నొప్పులు వస్తే అస్సామీ సంప్రదాయ వస్త్రం ‘గమోచా’ను కాలికి గట్టిగా చుట్టేస్తా. ఎంతటి భరించలేని నొప్పి అయినా కొద్దిసేపటికే తగ్గిపోతుంది’’ అని మోదీ వివరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top