101వ రోజు పాదయాత్ర డైరీ | 101th day padayatra diary | Sakshi
Sakshi News home page

101వ రోజు పాదయాత్ర డైరీ

Mar 3 2018 1:56 AM | Updated on May 29 2018 4:40 PM

101th day padayatra diary - Sakshi

02–03–2018, శుక్రవారం
గాడిపర్తివారి, ప్రకాశం జిల్లా

బాబు ఇంత దగా చేస్తారా అని రైతులు భగ్గుమంటున్నారు..
పల్లె ప్రగతికి పచ్చ కామెర్లొచ్చాయి. అధికార పార్టీకి అవినీతి చీడ పట్టింది. బండ్లమూడి గ్రామంలో అధికార పార్టీ నేతల అవినీతి పర్వాన్ని రమణారెడ్డి అన్న పూసగుచ్చినట్టు చెప్పాడు. పేదోడి పొట్ట నింపే ఉపాధి హామీ నిధులు ఎలా కొల్లగొడుతున్నారో తెలిపాడు. ఆ ఊళ్లో వాటర్‌షెడ్‌ పథకం కింద ఫామ్‌ పాండ్స్‌ నిధులు మొత్తం టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా తినేశారట. గుంతలన్నీ జేసీబీలతో తవ్వించారట. రికార్డుల్లో మాత్రం కూలీలే తవ్వినట్టు చూపించారని చెప్పాడు. పెన్షన్, బియ్యంలాంటివి ఆపేస్తామని బెదిరించి కూలీలతో వేలిముద్రలేయించుకుని నిధులన్నీ నొక్కేశారట. ఇదే కాదు.. ఆ గ్రామంలో ఎప్పుడో కట్టిన నాడప్స్‌ (కంపోస్ట్‌ తయారుచేసే చెత్త తొట్లు)కు, అసలు కట్టనే కట్టని వాటికీ అన్యాయంగా లక్షల్లో నొక్కేశారట. ఎంత అన్యాయం! ఉపాధి హామీ నిధులన్నీ పేదవాడికే చెందాలని అప్పట్లో నాన్నగారు అనుకున్నారు. కార్యాచరణలో పెట్టారు. పేదోడిపై కనీస కనికరం లేని టీడీపీ సర్కార్‌ జన్మభూమి కమిటీల పేరుతో ఆ పార్టీ నేతలకు దోచిపెడుతోంది. ఇది క్షమించరాని నేరం.

చీమకుర్తికి చెందిన సుబాబుల్, జామాయిల్‌ రైతన్నల కన్నీరు నన్ను కదిలించింది. నలుగురు మంత్రులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుల మేరకు టన్ను సుబాబుల్‌కు రూ.4,200, జామాయిల్‌కు 4,400 మద్దతు ధర ఇస్తూ ప్రభుత్వం జీవో తెచ్చింది. కానీ అదెక్కడా అమలుకు నోచుకోవడం లేదని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ప్రైవేటు కంపెనీలు కుమ్మక్కై మా నోట్లో మట్టి కొడుతున్నారన్నారు. జామాయిల్‌కు టన్నుకు రూ.1,800, సుబాబుల్‌కు రూ.2,500కు మించి రావడం లేదని చెప్పారు. ప్రభుత్వం చేసిన జీవోకే దిక్కులేకపోతే ఎలా? రైతన్న అంటే చంద్రబాబుకు ఇంత చులకనా అని ప్రశ్నించారు. నాన్నగారి హయాంలో జామాయిల్‌కు టన్నుకు రూ.4,600, సుబాబుల్‌కు రూ.4,200 దక్కిందని, అంతా ఆనందంగా ఉండేవారమని గుర్తు చేశారు. వాళ్ల ఆవేదనకు అర్థముంది. చంద్రబాబే దళారిగా మారాడు. రైతన్న కన్నీళ్లు అమ్ముకుంటున్నాడు. ఈ వ్యవస్థ మారాలి. రైతన్నకు మళ్లీ పూర్వ వైభవం తేవాలి. 

చంద్రబాబు రుణమాఫీ మోసానికి బలవ్వని రైతు ఈ రాష్ట్రంలో బహుశా ఉండడేమో! బండ్లమూడి గ్రామ రైతు శ్రీనివాసరావు ఆవేదన విన్నాక ఇది నిజమనిపించింది. ఎన్నికల ముందు రైతు రుణాలన్నీ మాఫీ చేస్తానన్న బాబు మాటలను అందరిలాగే ఆయనా నమ్మాడు. అప్పటికప్పుడు టీడీపీ సభ్యత్వం కూడా తీసుకున్నాడు. ఉత్సాహంగా ఆ పార్టీకి ఓటేశాడట. బాబొస్తే.. స్థానిక సహకార బ్యాంకులో పాసుబుక్కులు పెట్టి తెచ్చిన రూ.80 వేల అప్పు మాఫీ అవుతుందన్నదే ఆయన చిన్న ఆశ. బాబొచ్చాక గానీ అసలు సంగతి తెలియలేదు. పాపం! మొదటి విడత కింద రూ.16,452 రుణమాఫీ వచ్చిందట. ఆ వచ్చింది వడ్డీకి కూడా సరిపోదయ్యా.. అని బ్యాంకోళ్లు అన్నారట. తల తాకట్టు పెట్టయినా మా అప్పు కట్టాల్సిందేనని నిలదీయడంతో అప్పు చేసి మరీ రూ.20 వేలు కట్టానన్నాడు. అయినా బ్యాంకులో అప్పు ఇంకా రూ.1.10 లక్షలు ఉందని నోటీసు పంపారని బావురుమన్నాడు. మార్చిలోగా తీర్చకుంటే ఉన్న రెండెకరాలు వేలం వేస్తామని బ్యాంకు అధికారులు హెచ్చరించారని చెప్పాడు. చంద్రబాబు మోసమేంటో ఆయనకు ఇప్పుడు పూర్తిగా బోధపడింది. ఇంత దగా చేస్తాడా అని భగ్గుమంటున్నాడు. నమ్ముకుంటే నట్టేట ముంచుతాడా? ఉన్న భూమి అమ్ముకునేలా చేస్తాడా? ఇంటిల్లిపాది ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తాడా? అంటూ నిప్పు కణికల్లా మారిన ఆయన నేత్రాలు ప్రశ్నిస్తున్నాయి. అయ్యా చంద్రబాబూ.. ఇది ఈ రైతన్న గుండెమంటే కాదు.. రాష్ట్రంలోని లక్షలాది మంది రైతన్నల ఆందోళన.

ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న
అయ్యా చంద్రబాబు గారూ... రాష్ట్రంలో లక్షలాదిమంది రైతన్నలు మీరు చేసిన మోసానికి అప్పులపాలై అవమాన భారంతో ఉన్నామంటున్నారు. బ్యాంకుల గడప కూడా తొక్కలేని పరిస్థితికి తెచ్చావంటున్నారు. వారికేం సమాధానం చెబుతావు? 
మీరిచ్చిన జీవో ప్రకారమే రైతన్నలకు మద్దతు ధర లభించకపోతే ఆ జీవోలకు కానీ, వాటిని ఇచ్చిన మీకు కానీ విలువ ఏమైనా ఉందా? ఆ జీవోలు, మంత్రివర్గ ఉపసంఘాలు కేవలం రైతన్నలను మభ్యపెట్టడానికి, మోసపుచ్చడానికే కాదా?
దోచుకున్న ప్రతిదాంట్లో వాటాలు పంచుకోండి అంటూ మీరే పంచాయితీలు చేశారని స్వయంగా మీ మంత్రిగారే చెప్పారు. పై స్థాయిలో మీరే అలా ఉంటే కింది స్థాయిలో మీ అనుచరులు దోచుకోకుండా ఉండగలరా? ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?   
-వైఎస్‌ జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement