సమాధానం లేని ప్రశ్నలెన్నో!

సమాధానం లేని ప్రశ్నలెన్నో! - Sakshi


రిషిత మృతికి దారితీసిన పరిస్థితులే హేయమంటే, మరణానంతర పరిణామాలు మరింత ఘోరం. నిజాలను నిగ్గుతేల్చడంకన్నా వాస్తవాల్ని మరుగుపరచడమే జోరుగా సాగుతున్నట్టుంది. ప్రభుత్వ ఉదాసీనత ఓ వర్గ ప్రయోజనాల్ని పరిరక్షించే ఎత్తుగడేనన్న బలమైన అభిప్రాయముంది. సమస్య తీవ్రతను గుర్తించి, శాశ్వత పరిష్కారానికి చిత్తశుద్ధి చూపడం ఏ కోశానా కనిపించటం లేదు. నీచమైన లైంగిక వేధింపులకు, పురుషాధిక్యపు దాష్టీకాలకు, కుల క్రౌర్యానికి ‘ర్యాగింగ్’ అనే ముసుగు కప్పి దాన్ని తేలికగా చూసే భావజాలం తక్షణం మారాలి. కొత్త గాలి వీయాలి.


 


వికసిస్తున్న పువ్వు... రిషితేశ్వరి, కలుషిత ‘విద్యా’వనంలో నిర్దాక్షిణ్యంగా రాల్చేస్తే రాలిపోయింది. 75 ఏళ్ల కింద కలామ్ అనే పసి మొగ్గ ఇలా రాలలేదు గనుకే, జాతి గర్వించే మహనీయుడయ్యాడు. మత మౌఢ్యం కల్పించిన విపత్తు నుంచి ఆనాడాయన్ని ఓ ఆలయ ప్రధాన పూజారి కాపాడాడు. ఆ పసి మొగ్గే పువ్వై, కాయై, పండై... భారతరత్నమై విరాజిల్లింది. కుల దురహం కారం నుంచి పుట్టిన ఓ విష సంస్కృతి నుంచి కాపాడేవారు లేకనే, యావత్ వ్యవస్థ విఫలం కావడం వల్లనే  నిన్నటికి నిన్న రిషితేశ్వరి అనే విరిసీ విరి యని మొగ్గ నేల రాలింది. రామేశ్వరం మసీదు వీధి కుర్రాడు కలామ్, అక్కడి ఆలయ ప్రధాన పూజారి కుమారుడు, తన మిత్రుడు రామనాథశాస్త్రితో అయిదో తరగతిలో పక్కపక్కనే కూర్చోవడాన్ని ఉపాధ్యాయుడు తప్పు పట్టి, కలామ్‌ని వెనక బెంచీకి పంపేశాడు. విషయం తెలుసుకున్న ప్రధాన పూజారి ‘‘దేవుడి దృష్టిలో ఏ విద్యార్థీ ఇతర విద్యార్థి కన్నా తక్కువ కాదు. వారి వారి నేపథ్యాల్లో అలాంటి వ్యత్యాసాలున్నా, వాటికతీతంగా విద్యార్థుల్లో సామ రస్యాన్ని పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది’’ అని ఉపాధ్యాయుడ్ని మందలించాడు. తప్పు గ్రహించిన టీచర్ బాల కలామ్‌ను ఆలింగనం చేసు కొని మన్నించమని మనస్ఫూర్తిగా కోరాడు. అందరి మనసులు తేటపడ్డాయి.

 

 రిషితేశ్వరి రాసుకున్న డైరీలోని చివరి 3 పేజీలు, చావుకు ముందు ఆమె ఎదుర్కొన్న మానసిక వ్యధకు, సంఘర్షణకు అద్దం పట్టాయి. అంతకుమించి, విశ్వవిద్యాలయంలో నెలకొన్న దుస్థితిని స్కానింగ్ చేసి చూపాయి. రిషితేశ్వ రిది హత్యా? ఆత్మహత్యా? అనేది చట్టం దృష్టిలో అది ఇప్పటికి మీమాంసే! కానీ, సమాజ పరంగా అది ఖచ్చితంగా హత్యే. ఇపుడు తేలాల్సింది... హంత కులెవరన్నది. ర్యాగింగ్ రాక్షస క్రీడా? ప్రిన్సిపాల్ నియంతృత్వ వైఖరా? ఆయన అండ చూసుకొని విచ్చలవిడిగా వ్యవహరించిన కొందరు సీనియర్ విద్యార్థులా? ప్రాంగణం మూల మూలన బలపడి ఉన్న కులాధి పత్య ధోర ణులా? కుల రాజకీయాలతో పూర్తిగా భ్రష్టుపట్టిపోయిన అధికార-రాజకీయ వ్యవస్థా? ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరెవరు రిషితేశ్వరి హత్యకు బాధ్యుల న్నది ఇప్పుడు తేలాల్సి ఉంది.

 

 సమాధానం లేని ప్రశ్నలెన్నో!

 

 రిషితేశ్వరి మరణానికి దారితీసిన పరిస్థితులే ఘోరమంటే, మరణానంతర పరిణామాలు మరింత దయనీయమైనవిగా ఉన్నాయి. నిజాలను నిగ్గుతేల్చ డంకన్నా వాస్తవాల్ని మరుగుపరచడమే జోరుగా సాగుతున్నట్టుంది. ఇంత జరిగినా నిన్న మొన్నటి వరకు నిమ్మకు నీరెత్తినట్టున్న ప్రభుత్వ ఉదాసీనత కూడా ఓ వర్గ ప్రయోజనాల్ని పరిరక్షించే వ్యూహాత్మక ఎత్తుగడేనన్న బలమైన అభిప్రాయముంది. సమస్య తీవ్రతను గుర్తించడం, శాశ్వత పరిష్కారానికి చిత్తశుద్ధి చూపడం ఏ కోశానా కనిపించటం లేదు. పైగా శస్త్ర చికిత్స అవసర మైన మొండి రోగానికి పై పై లేపనాలు పూస్తున్నారు. కాయకల్ప చికిత్స లాంటి కమిటీల విచారణలు ఏ మేరకు ఫలితాలిస్తాయన్నది అనుమానమే! ఇన్ని అరిష్టాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఇంజనీరింగ్-ఆర్కిటెక్చర్ కాలేజీ ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా ఇప్పటికే పలు కమిటీలిచ్చిన నివేదికలకు అతీగతీ లేదు. అక్కడ బలంగా వీచే కుల పవనాల వల్ల విద్యార్థులు విషయాన్ని బట్టి స్పందించలేకపోతున్నారు. సమస్యతో నిమిత్తం లేకుండా ప్రిన్సిపాల్ అను కూల, ప్రతికూల బృందాలుగా విద్యార్థులు చీలి ఉండటమే విస్మయం.

 

 ప్రిన్సి పాల్‌కి సన్నిహితులుగా ముద్రపడ్డ వారిపై ఈగ వాలడానికి లేదు. విభేదించి నిజాలు మాట్లాడిన విద్యార్థులే కాదు, బోధన, బోధనేతర సిబ్బందికీ  పుట్టగతులుండవు. రిషితేశ్వరి మరణం తదుపరి విద్యార్థులకు బలవంతంగా సెలవులిచ్చి ఇంటికి పంపాక కాలేజీ ఆవరణలో ‘విచారణ’ ప్రక్రియ సాగు తోంది. ప్రిన్సిపాల్ అనుకూల విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం కమిటీ ముందు వాంగ్మూలం ఇవ్వడం విడ్డూరం. బలమైన ఓ సామాజికవర్గం ఛత్ర ఛాయల కింద సాగే ఆధిపత్యం అనేక అరాచకాలకు ప్రధాన కారణం. ఈ కుల పోరాటాలు, వత్తిళ్లు, వర్గపెద్దల అండతో చెలరేగే కొందరి విచ్చలవిడి తనం, నియంత్రణ లేని ర్యాగింగ్ అరాచకాలు... తట్టుకోలేక విద్యార్థులే కాదు, బోధ నా సిబ్బంది కూడా అర్ధంతరంగా విశ్వవిద్యాలయం వీడిపోయిన ఘటన లెన్నో! ఈ విశ్వవిద్యాలయం ఏర్పడి నాలుగు దశాబ్దాలు కావస్తున్నా ఇంకా సంపూర్ణ విశ్వవిద్యాలయం స్థాయి సంతరించుకున్నట్టు కనబడదు. క్యాంపస్ వాతావరణం విద్యార్థులకు విశ్వాసం కలిగించకపోగా, భయసందేహాలను రేకెత్తించేదిగా ఉంటుంది. జరిగింది హత్యా? ఆత్మహత్యా? అన్న అనుమా నాలూ పొడచూపుతున్నా దర్యాప్తు మాత్రం స్వతంత్రంగా, సమగ్రంగా జరగ టం లేదు. ఫ్యాన్‌కు ఉరి వేసుకుందంటున్న రిషితేశ్వరి శవాన్ని పోలీసులు రాక ముందే కిందకెవరు దింపారు? ఆ తొందర ఎవరిది? వంటి మౌలిక ప్రశ్నలకు సమాధానాలు కావాలి. పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్న ముగ్గురికన్నా కీలకమైన నిందితులు బయట స్వేచ్ఛగా ఉన్నట్టు ఆరోపణలున్నాయి.

 

 కులాల కుంపట్లు, దిగజారిన ప్రమాణాలు

 

 తెలుగు రాష్ట్రాల్లో విశ్వవిద్యాలయ విద్య తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందనే మేధావులు, పౌరసమాజం ఆక్రందన చెవిటివాడి ముందు శంఖమూది నట్టవుతోంది. ప్రభుత్వాలకు అది పట్టదు. అన్ని స్థాయిల్లో కులాల కుంపట్లే. ఉపకులపతుల నియామకం నుంచి కింది స్థాయి వరకు రాజకీయ జోక్యాలు పెచ్చు మీరుతున్నాయి. ఇక పనితీరు, విద్యాప్రమాణాలపైన నిఘా, నియం త్రణ లేనే లేవు. విలువలు, వ్యక్తిత్వం, అకడమిక్ నైపుణ్యం కన్నా రాజకీయ ప్రాపకం ఉన్న వారికే ప్రాధాన్యత లభిస్తోంది. పెద్ద పెద్ద జీతాలు తీసుకుంటున్న ప్రొఫె సర్లు, ఇతర సిబ్బందిలో కూడా అత్యధికులు చాలా సందర్భాల్లో బాధ్యతా యుతంగా వ్యవహరించటం లేదు. విధులు, బాధ్య తల నుంచి తప్పించు కునేందుకు, స్వయంగా ఈ కులాల కుంపట్లు రగిలి స్తున్నవారున్నారు. బాధ్యులే విద్యార్థుల్ని విభజించి పాలిస్తున్నారు. హోదా ల్లో, బాధ్య తల్లో ఉన్న వారిలో అత్యధికులు అవినీతిలో, రాజకీయాల్లో, టీఏ, డీఏల పెంపు లెక్కల్లో మునిగితేలుతున్నారు. తమకు తాబేదారులుగా ఉండే వారినే నియమించే ప్రభుత్వ పెద్దల పోకళ్లు కూడా ప్రమాణాల పతనానికి ఒక కారణం. ఏపీలో పేరున్న ఓ యూనివర్సిటీ వీసీ పదవి కోసం సెర్చ్ కమిటీ ప్రతిపాదించిన జాబితాలోని మొత్తం మూడు పేర్లూ ఒకే కులానికి చెందినవి! అంటే, ఏదేమైనా తమ కులంవాడే వీసీ అవ్వాలి! ఇదీ పోకడ! ఇలా ఏలిన వారి దయాదాక్షిణ్యాలతో వస్తున్న వీసీలు, రిజిష్ట్రార్‌లు, కుల సమీకరణా ల్లోనో, విద్యార్థుల వర్గాధిపత్యపు ఒత్తిళ్ల ఫలితంగానో పదవులందుకునే డీన్‌లు, రెక్టార్‌లు... విద్యార్థుల బాగోగులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. విద్యార్థులు-బోధకుల మధ్య ఎలాంటి సంబంధాలుంటున్నాయి?  విద్యా ప్రమాణాలెలా ఉన్నాయి? అనేవి వీసీలతో సహా ఎవరికీ పట్టదు. లైంగికంగా, కుల వివక్షతో, గ్రూపుల వారిగా విద్యార్థుల్ని వేధించే బోధకుల అకృత్యాలకు చాలా చోట్ల అడ్డూ అదుపూ ఉండటం లేదు. ఉపకార వేతనాల మీద, ఫెలోషిప్‌ల మీద ఆధారపడుతూ, పరిశోధనలు తొందరగా పూర్తి చేసి ఉద్యోగ-ఉపాధి అవకాశాల కోసం ఆశగా చూసే విద్యార్థుల అవసరాలతో ఆటలాడుకునే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది దాదాపు అన్నిచోట్లా ఉన్నారు. ప్రతిభ లేదనే సాకుతో చేసే ‘చాపకింది’ వేధింపులే ఎక్కువ. ఏదీ బయటకు చెప్పుకోలేని సున్నితత్వంతో విద్యార్థులు, ముఖ్యం గా విద్యార్థినులు తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో గత రెండేళ్లలో పదిమంది విద్యార్థులు ప్రేమ వైఫల్యాలు, ఒత్తిళ్ల నుంచి బోధకుల వేధింపుల దాకా వేర్వేరు కారణాలతో ఆత్మహత్యలు చేసుకున్నారు. హైదరాబాద్‌లోనే ఉన్న ఇంగ్లీషు, విదేశీ విద్యల విశ్వవిద్యాలయం (ఇఫ్లూ)లో, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తరచూ ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి.

 

 పరిష్కారాల గురించి ఆలోచించరెందుకు?

 

 పరిస్థితుల పరంగా, చట్టపరంగా విద్యార్థినులకు పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ధైర్యంగా నిలబడాలనే ఆత్మస్థయిర్యాన్ని కల్పించడం తోపాటూ, విద్యార్థినుల భద్రతకు అన్నివిధాలా భరోసా కల్పించాలి. ఆత్మహ త్యలకు తలపడవద్దని సమాజం సైతం వారికి అండగా నిలవాలి. నీచమైన లైంగిక వేధింపులకు, పురుషాధిక్యపు దాష్టీకాలకు, కుల క్రౌర్యానికి ‘ర్యాగింగ్’ అనే ముసుగు కప్పి తేలికగా చూడటం తక్షణమే మారాలి. బాధ్యతారహి తంగా ఇలాంటి  భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న సినిమాలు, టీవీ సీరియళ్లు, ఎఫ్‌ఎమ్ రేడియో కార్యక్రమాల సృష్టికర్తలు తమ తీరును మార్చుకోవాలి. ఇం టర్ వరకు తమ అబ్బాయిల్ని, ఎంతో శ్రద్ధాసక్తులతో గమనించే తల్లిదం డ్రులు డిగ్రీ, యూనివర్సిటీ. వృత్తి విద్యాకోర్సులకు వచ్చాక కూడా వారు ఎలా వ్యవహరిస్తున్నారో గమనించాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత మగ పిల్లల తల్లిదండ్రులదీ.

 

 విశ్వవిద్యాలయాలు, తదితర ముఖ్య విద్యా సంస్థలో రాజకీయ జోక్యా లు పోవాలి. 1) జరిగే ప్రతి అనర్థానికి వీసీ, డీన్, రిజిష్ట్రార్ లాంటి ఉన్నతాధి కారుల్ని బాధ్యుల్ని చేయాలి. 2) ఫ్యాకల్టీ విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లోనే నివాసముండాలి. 3) నిర్ణీత వ్యవధితో తల్లిదండ్రుల సమావేశాలు జరిగి తీరాలి. 4) జరిగే అవాంఛనీయ పరిణామాలకు స్థానిక ప్రజాప్రతినిధులు తక్షణమే స్పం దించి, దిద్దుబాటుకు బాధ్యత వహించాలి. 5) రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి ఉన్నతాధికారులు తరచూ సమీక్షలు జరిపి పరిస్థితులపై నిఘా ఉంచాలి. 6) అన్నిచోట్లా హాస్టళ్లను తగు ప్రమాణాలతో నిర్వహించాలి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సభ్యులుగా నిర్వహణ  కమి టీలు వేయాలి. 7) ఏ వివాదాలు, అనర్థాలు తలెత్తినా ప్రత్యేక న్యాయ ట్రిబ్యునళ్లు వేసి విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలి.

 

 ఇదేం అత్యాశ కాదు!

 

 సమకాలీన రాజకీయాల తీరుతెన్నుల పట్ల, ప్రతిష్టంభనలతో పార్లమెంటు కార్యకలాపాలు తరచూ నిలిచిపోతుండటం పట్ల అబ్దుల్ కలామ్ కలత చెందా రు. దీనికి ప్రత్యామ్నాయాలను రూపొందించే కార్యక్రమాన్ని షిల్లాంగ్ ఐఐఎం విద్యార్థులకు ఇద్దామనుకుంటూనే ఆయన వెళ్లిపోయారు. విద్యార్థుల పట్ల, విద్యాలయాల పట్ల ఆయన ఆశావహ దృక్పథం అంత గొప్పది. సంపూర్ణ పరి వర్తనతో మన విద్యాలయాల్ని విద్యా వికాస కేంద్రాలుగా, మేధో సృజనకు నిలయాలుగా తీర్చిదిద్దుకోవడమే మనం కలామ్‌కిచ్చే నిజమైన నివాళి.


 


ఆర్.దిలీప్ రెడ్డి


ఎగ్జిక్యూటివ్ ఎడిటర్

 -ఈమెయిల్:dileepreddy@sakshi.com


                                 


                                    

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top