పద్యానికి ‘పాడియావు’నిచ్చిన కవీంద్రుడు

పద్యానికి ‘పాడియావు’నిచ్చిన కవీంద్రుడు


సాహిత్య కార్యక్రమాలతో కొద్దో గొప్పో పరిచయమున్న తెలుగువారికి సుపరిచితమైన వాక్యం ‘ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్’’.  ఏదో ఒక సభలో, ఎక్కడో ఒక చోట, ఈ వాక్యం నిత్యం మార్మోగుతూనే ఉంటుంది. ఈ వాక్యానికి ఇంతగా ప్రాచుర్యం కలిగించిన ఆ మూలకర్త  సారస్వతమూర్తి చిలకమర్తి లక్ష్మీనరసింహం.

 

గోదావరీ తీరంలోని ఖండవల్లి గ్రామంలో 1867 సెప్టెంబర్ 26న జన్మించిన సామాన్యుడే పున్నయ్య. అంతర్వేది లక్ష్మీనరసింహునికి మొక్కుబడులు కారణంగానేమో, లక్ష్మీ నరసింహం అయ్యారు. పాఠశాల విద్యాభ్యాస కాలం నాటికే, అనూహ్యమైన ధారణాబలం కారణంగా ఏకసంధాగ్రాహి అనిపించుకున్నారు. కళాశాల స్థాయికి వెళ్లలేకపోయినా సంస్కృతాంధ్ర గ్రంథాలను, ఒకరితో చదివించుకుని, జీర్ణించుకున్న ఘనత చిలకమర్తివారిది. పద్యం, గద్యం, నవల, నాటకం, ప్రహసనం, స్వీయచరిత్ర ఇలా పలు రకాల ప్రక్రియలు ఆయన హస్తవాసికి నోచుకుని, తమ గౌరవాన్ని పెంచుకున్నాయి. 1887వ సంవత్సరం విక్టోరియా మహారాణి జూబ్లీ పరిపాలనోత్సవాల సందర్భంగా, శుభాకాంక్షపూర్వకంగా ఆయన పద్యాలు రాశారు. పాతికేళ్ల ప్రాయానికే చిలకమర్తి సారస్వత జీవనం కవిత్వ ప్రక్రియతో ప్రారంభ మైనట్లుంది. అనంతరం పృధ్విరాజీయం, కాదంబరి, రామచరిత్ర వంటి పద్యకావ్య రచనోద్యుక్తులయ్యారు.

 

సాహిత్యప్రక్రియలన్నింటిలోనూ నవలా, నాటకమూ మాత్రం వీరి సాహిత్య కృషిని అగ్రాసనం మీద నిలిపాయి. కందుకూరి వీరేశలింగం ‘రాజశేఖర చరిత్రము’ రచనతో తెలుగునవలతో ఆద్యుడైనా, చిలకమర్తి కరస్పర్శతో తెలుగు నవల ఒక గొప్ప ఆకర్షణను సొంతం చేసుకుంది. నాటి సాహిత్య పోషకులు న్యాపతి సుబ్బారావు నిర్వహించిన పోటీ రచనల కోసం ‘రామచంద్ర విజయం’ అనే నవల రాశారు చిలకమర్తి. బుద్ధిమంతుడైన అమలాపురం కుర్రాడి కథ ఇది. చేయని తప్పుకు అపనిందల పాలై, తన సత్ప్రవర్తనతో, తనను నిందల పాలు చేసిన కుటిలాత్ముల మనసును సహితం మార్పు చేసేలా నైతిక వర్తన జెండా ఎగరేసిన కథా క్రమమే ‘రామచంద్రవిజయం’. ఇది 1894వ సంవత్సరం చింతామణి పత్రికలో ప్రచురితమై ప్రథమ బహుమతి గెల్చుకుంది. అటు తర్వాత... కర్పూర మంజరి, సుధాశరచ్చంద్రము, హేమలత, కృష్ణవేణి, అహల్యాబాయి, సౌందర్యతిలక, మణిమంజరి, గణపతి వంటి నవలలు వ్రాశారు.

 

ముఖ్యంగా గణపతి, ఆనాటి సమా జంలోని బ్రాహ్మణ కుటుంబాల స్థితి గతుల్ని కళ్లకు కట్టిస్తుంది. గణపతిని తలచు కున్నప్పుడల్లా, గిలిగింతలు తెచ్చుకుని, ఎవరికివారుగా, నవ్వుకునే గుణ విశేషం ఉన్న హాస్యరచన. 1960లలో, విజయ వాడ ఆకాశవాణి కేంద్రం, దీనిని 60 నిమి షాల నిడివిగల శ్రవ్యనాటకంగా మలచి ప్రసారం చేసింది. దశాబ్దాలపాటు, ఆకాశవాణి శ్రోతలను అలరించి, ఆహ్లాదపరచిన ఈ శ్రవ్యరూపం, తెలుగు వాళ్ల శ్రవ్య మాధ్యమంలో మైలురాయిగా నిలిచిపోయింది.

 


రాణ్మహేంద్రవరంలో ఇమ్మానేని హనుమంతరావు నాయుడు కోరిక మీదనే, 1899లో ‘కీచకవధ’ నాటకాన్ని రాశారు. ఈ నాటకానికి ఆ రోజుల్లో అనూహ్యంగా ప్రజా దరణ లభించింది. హనుమంతరావు ప్రోత్సాహం కారణంగానే సీతాకల్యాణం, ద్రౌపదీ కల్యాణం, నలచరిత్రము, పారిజాతాపహరణం, గయోపాఖ్యానం ఇలా మరిన్ని నాట కాలు రాశారు. రాసిన కాలంలో ఇవన్నీ వచన నాటకాలే. తదనంతరం కొన్ని పద్యాలు కూడా చేర్చి ప్రచురించారు. ఆ పద్యాల చేరికతో ఈ నాటకాలు అజరామరమై పోయాయి. ముఖ్యంగా ‘గయోపాఖ్యానం’.

 

ఇద్దరు కొట్లాటకు దిగితే, ఆసక్తిగా గమనించడం, మానవ నైజం. అందునా, అయిన వాళ్ల మధ్య కొట్లాట జరిగితే, ఈ ఆసక్తి ద్విగుణీకృతమౌతుంది. ఈ మానవ నైజానికి, గయోపాఖ్యానం నాటకంతో సాక్షి సంతకం చేశారు చిలకమర్తి. వ్యాస భారతంలో లేనప్పటికీ గయోపాఖ్యానంలో కృష్ణార్జునులు ఒకరినొకరు ఎత్తి పొడుచుకునే పద్య సంభా షణలు రంగస్థల వేదికలమీద, సామాన్యులను సహితం ఆకట్టుకున్నాయి. ఆ నాటకం, అద్భుత నాటకమై కూర్చుంది. లక్షల సంఖ్యలో నాటక ప్రతులు అమ్ముడుపోయాయి. ‘‘అల్లుడా రమ్మని యాదరమ్మున పిల్వ బంపు మామనుబట్టి, చంపగలమె?’’ అనే పద్య పాదాలు తెలుగువాళ్ల రసనాగ్రాలపైన ఈనాటికీ నరిస్తూనే ఉంటాయి.

 

డబ్బు కోసమే చిలకమర్తి రచనలు చేయలేదు. ఒక సందర్భంలో ఆంగ్లేయుల ప్రచు రణ సంస్థ ఒకటి, కొన్ని వాచకాలను రాసిపెట్టమని అడిగితే, ఈ దేశంలోని ప్రతి వనరు పైన సంపదను దోచేస్తున్న జాతి, ఈ అక్షర సంపదపైన కూడా దోపిడీ చేస్తుందని తలచి, ఆయన ఒప్పుకోలేదు. దేశీయ సంస్థలకు తప్ప, ఇంగ్లిష్ సంస్థలకు రాయబోనని కరా ఖండిగా తేల్చి చెప్పేశారు. అటువంటి స్వాభిమానంతోనే, పాఠశాలలు నడిపారు.  ప్రస్తుతం వీరేశలింగం హైస్కూల్‌గా చలామణిలో ఉన్న పాఠశాల పూర్వరంగంలో చిలకమర్తి స్థాపించినదే. ‘రామమోహన్‌రాయ్ పాఠశాల’ పేరుతో దళిత విద్యార్థుల అభ్యు న్నతికోసం పాఠశాల నడిపారు. నాటి రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగానికి చేయూతనిస్తూ, పత్రికా నిర్వహణలోనూ చిలకమర్తి కృషి ప్రశంసనీయంగా నిలిచిఉంది. మనోరమ, దేశ మాత, సరస్వతి, దేశసేవ అనే పత్రికలు నడిపారు.

 

స్వాతంత్య్రోద్యమ సన్నివేశంలో నిర్వహించిన వేదికలపై చిలకమర్తి ప్రసంగాలు ఆనాటి ప్రజానీకాన్ని కార్యోన్ముఖులను చేశాయి. ముఖ్యంగా స్వాతంత్య్రోద్యమ సాహి త్యంలో తలమానికంగా, ఈనాటికీ పరిగణించే, ‘‘భరత ఖండంబు చక్కని పాడియావు’’ అన్న పద్యం. అలా వేదికాముఖంగా ఆశువుగా పుట్టినదే. 1907వ సంవత్సరం వంగదేశం నుంచి, రాజమహేంద్రవరం వచ్చిన బిపిన్ చంద్రపాల్ సమక్షంలో గోదావరీ మండల మహాసభ వేదికపైన అది ఊపిరి పోసుకుంది. పాఠశాల నడిపినా, పత్రిక నడిపినా, రచనా వ్యాసంగంలో నవల, నాటకం, పద్యం గద్యం, ప్రక్రియ ఏది నెరిపినా, సామాన్యతలోనే ధీమాన్యతను ప్రదర్శించినవాడు. సారస్వత లోకానికి పులకింతలు పంచిన సింహత్రయంలో చివరివాడు, దృక్కు మంద గించినా, వాక్కున అందగించినవాడు చిలకమర్తి లక్ష్మీ నరసింహం.

 


(చిలకమర్తి రచనలపై సమగ్ర పరిశోధన చేసిన డా. ముక్తేవి భారతికి, చిలకమర్తి 150వ జయంతి నాడు (26-09-2016) హైదరాబాద్‌లో కిన్నెర ఆర్ట్ థియేటర్స్ సంస్థ... చిలకమర్తి లక్ష్మీనరసింహం స్మారక సాహితీ పురస్కారాన్ని అందజేస్తున్న సందర్భంగా)


 వోలేటి పార్వతీశం,

 వ్యాసకర్త దూరదర్శన్ పూర్వ ప్రయోక్త  మొబైల్ : 94400 31213

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు 

Read also in:
Back to Top