Pingali Lakshmikantham: బహుముఖ ప్రజ్ఞాశాలి

Pingali Lakshmikantham: Telugu Poet, Actor, Critic, Biography - Sakshi

ఆధునికాంధ్ర సాహిత్యంలో సుప్రసిద్ధ కవి, ఆచార్యుడు, నటుడు, విమర్శకుడు, ఆకాశవాణి కార్యక్రమాల సలహాదారు ఆయన. అష్టదిగ్గజ కవుల్లో పింగళి సూరన వంశానికి చెందిన పింగళి లక్ష్మీకాంతం బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన 1894 జనవరి 10వ తేదీన కృష్ణాజిల్లా అర్తమూరులో జన్మించారు. పాఠశాల విద్య మచిలీపట్నం హిందూ ఉన్నత పాఠశాలలో అభ్యసించారు. అప్పుడు చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి అక్కడ తెలుగు పండితుడుగా ఉన్నారు. పింగళి, విశ్వనాథ వంటి వారంతా చెళ్లపిళ్ల వారి శిష్యులే. 

బందర్‌ నోబుల్‌ హైస్కూల్‌లో తెలుగు పండితుడిగా పింగళి కొన్నాళ్లు పనిచేశారు. తర్వాత మద్రాస్‌ ఓరియంటల్‌ మాన్యుస్క్రిప్ట్‌ లైబ్రరీలో పరిశోధకుడిగా పనిచేశారు. 1931లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఏ ఆనర్స్‌ కోర్సు ప్రారంభించి పాఠ్య ప్రణాళికను రూపొందించారు. అన్ని విశ్వవిద్యాలయాలకు అదే ప్రామాణికమైన పాఠ్యప్రణాళిక. 

ఆయన ప్రియమిత్రుడు, సహాధ్యాయి కాటూరి వెంకటేశ్వరరావుతో కలసి తొలి రోజుల్లో శతావధానాలు చేశారు. ఇద్దరూ జంట కవులుగా రచించిన ‘సౌందర నందం’ కావ్యాన్ని తమ గురు వైన చెళ్లపిళ్ల వేంకట శాస్త్రికి అంకితం ఇచ్చారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఆచార్యుడిగా 1961–65 మధ్య పని చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 18 సంవత్సరాలు పనిచేసి 1949లో పదవీ విర మణ చేశారు. 

ఆయన బోధనల నోట్సులు ఆంధ్ర సాహిత్య చరిత్ర, విమర్శకు ప్రామాణి కాలు. తర్వాత వాటిని ఆంధ్ర సాహిత్య చరిత్ర, సాహిత్య శిల్ప సమీక్షలుగా ఆయనే ప్రచురించారు. అవి ఎంతో ప్రసిద్ధి పొందాయి. ఆయన రూపొందించిన సంస్కృత ‘కుమార వ్యాకరణం’ ఎన్నో విశ్వవిద్యాలయాల్లో పాఠ్య గ్రంథంగా ఉంది. ఆయన రేడియో ప్రసంగాలు, గౌతమ వ్యాసాలు విమ ర్శకు నిలువెత్తు నిదర్శనాలు. ఆయన రచించిన మధుర పండితరాజం, గంగాలహరి, తేజోలహరి ప్రసిద్ధి పొందాయి. ఆయన గౌతమ నిఘంటువు (ఇంగ్లీషు–తెలుగు) ప్రామాణికమైంది. 
 
పింగళి 1954 నుండి 1961వరకు విజయవాడ ఆకాశవాణి కేంద్రం సలహాదారుడిగా గొప్ప కార్యక్రమాలు రూపొందించారు. నటుడిగా పాండవోద్యగ విజయాల్లో ధర్మరాజుగా, ముద్రారాక్షసం నాటకంలో రాక్షస మంత్రిగా ప్రేక్షకుల మన్ననలు పొందారు.  పింగళివారు 1972 జనవరి 10 తేదీన పరమదించారు. సాహితీ ప్రియుల హృదయాల్లో ఆయన చిరస్మర ణీయులు.

– డాక్టర్‌ పీవీ సుబ్బారావు, సాహితీ విమర్శకులు
(జనవరి 10 పింగళి లక్ష్మీకాంతం జయంతి, వర్ధంతి)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top