నువ్వొకటి రాస్తావు! నేనొకటి చదువుతాను!!

నువ్వొకటి రాస్తావు! నేనొకటి చదువుతాను!!


ఆక్స్‌ఫర్డ్ ఎడిటర్‌తో ఇంటర్వ్యూ...

  ప్రపంచం ఇండియాను తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉంది.  తమకు తెలిసినది చెప్పగలిగితే ఇంగ్లిష్‌లో పబ్లిష్ అయ్యేందుకు ఇండియన్ రైటర్స్‌కు అనేక అవకాశాలున్నాయి. డబ్బుకు ఏమాత్రం లోటు లేదు. దేశీయభాషల నుంచి ఇంగ్లిష్‌లోకి అనువాదమయ్యే సాహిత్యం ‘నువ్వొకటి రాస్తావు, నేనొకటి చదువుతాను’ తీరుగా ఉంటోంది. ఇంగ్లిష్‌లో రాయాలి లేదా అనువదించాలి అనుకునే భారతీయ రచయితలు ‘ఒకే ఇంగ్లిష్’ ద్వారా బయటవారికి చెప్పాలి! ఇంగ్లిష్‌లో అనేక ఇంగ్లిష్‌లున్నాయి. మనకు ‘ఇండో ఇంగ్లిష్’ కావాలి. ఏమిటి మార్గం!  తమ భాషా పరిధిని దాటి భారతీయ  సాంస్కృతిక వాతావరణం తెలుసుకోవాలి. సామెతలు, మాండలీకాల  వ్యక్తీకరణకు ఇంగ్లిష్‌లో ఒక ఉమ్మడి ప్రాతిపదిక ఏర్పరచుకోవాలి. ఇదెలా సాధ్యం?  కనీసం, ఇరుగుపొరుగు భాషల రచనలతో. రచయితలతో పరిచయం పెంచుకోవాలలి. తాము రాసినదేమిటో, చదివినదేమిటో సంభాషించుకోవాలి.

 

  చదవడం, వినడం, రాయడం గురించి  ప్రొఫెషనల్ ట్రైనింగ్ పొందాలి. బైబిల్ అనువాదాలు, బాగ్దాద్ యాత్రల అనువాదాలు, గాథలు,  తొలినాళ్ల సైన్ గ్రంథాల అనువాదాలను ఎప్పటికప్పుడు రివ్యూ చేయాలి. మరింత సరళమైన పదం, అర్ధవంతమైన పదం వాడొచ్చేమో చర్చించాలి. పనిచేయడం, కలసి పనిచేయడం ద్వారా మాత్రమే మనం వైరుధ్యాలనుంచి ఏకాభిప్రాయ బిందువును చేరుకోగలం (ఏక్టింగ్ అండ్ ఇంటరాక్టింగ్ బ్రింగ్స్ అస్ ఇన్‌టు సెంటర్). ఉదాహరణకు  కేశవరెడ్డి తన తెలుగు నవల ‘మూగవాని పిల్లనగ్రోవి-చివరి గుడిసె’ను ‘మూగవాని పిల్లనగ్రోవి-బ్యాలెడ్ ఆఫ్ ఒంటిల్లు’గా ఇంగ్లిష్‌లోకి స్వయంగా అనువదించారు. జే.కే.సిండర్ రివైజ్ చేశారు. ఇరువురికీ సీరీస్ ఎడిటర్ మిని కృష్ణన్ సంధానకర్తగా వ్యవహరించారు. కాబట్టే చిత్తూరు జిల్లాలోని ఒక కుగ్రామంలో నేలను శ్వాసించిన బక్కిరెడ్డి జీవితం స్థలకాలాదులను దాటి పాఠకులను ఆర్ద్రపరచింది.

 

 రచయితలు కానివారు అనువాదకులు కాలేరు! : మిని కృష్ణన్

 మాతృభాష, మరోభాష వచ్చినంత మాత్రాన అనువాదకులు కాలేరు. ఏదైనా ఒక భాషలో రచయిత అయిన వ్యక్తి మాత్రమే అనువాదం చేయగలరు. 1992లో ఓయూపి తరఫున దళిత్ ఆంథాలజీ ప్రచురించాం. ఆ సందర్భంలో ఒక అనువాదకుడు అబ్బే ఫలానా రచన బాగోలేదన్నారు. మరాఠీ తెలిసిన వ్యక్తి ద్వారా చదివించుకుని భావం గ్రహించగానే అద్భుతం అన్పించింది. ఇందులో ఏమీ లేదు అని ఒక అనువాదకుడు ఎలా అనగలిగాడు? అతడు రచయిత కాదు కాబట్టి! రచయిత కాని వ్యక్తి రచనలోని స్ఫూర్తిని గ్రహించలేడు! మలయాళంలోని ‘అంగడి’ని ఇంగ్లిష్‌లో ‘షాప్’ అన్నాను. మలయాళంలో ‘అంగడి అంటే కల్లు అంగడి’ అని అర్థం. మీరు టాడీషాప్ అనాల్సింది అన్నారు. నిజమే కదా! అనువాదకులకు ‘సాంస్కృతిక పరిచయం’ కూడా అవసరం!

 ఫెస్టివల్స్ అతిథులు కుర్రకారా!

 

 మాతృభాష తెలీని తరం, ఇంగ్లిష్‌లో మాత్రమే రాసే కుర్రకారు తరచూ ‘గ్లోబల్ వ్యూ’ అనడం ఫ్యాషనైంది. లిటరరీ ఫెస్టివల్స్‌లో ఈ తరహా కుర్రకారే ముఖ్య అతిథులు. అపార జీవితానుభవంతో మాతృభాషలలో రాసిన ప్రతిభావంతులు అపరిచితుల్లా ఫెస్టివల్స్‌లో తచ్చాడుతుంటారు. మీ కుటుంబంలో ఒక ‘ఫెస్టివల్’ జరుపుతూ మీ నానమ్మను, అమ్మమ్మను పిలవలేదంటే అదేం ‘ఫెస్టివల్’? వారికి కొంత స్పేస్ ఇవ్వండి. గౌరవం ఇవ్వండి. ఎవ్వరూ గ్లోబల్ కాలేరు. ప్రతి ఒక్కరూ వారి నేలలో వేళ్లూనుకునే ఉంటారు. ఉండాలి. మనకు ఏమి కావాలంటే అది తెలుసుకోవచ్చు. టెక్నికల్‌గా అంత ముందున్నాం. మనకు ఏది కావాలో మనకు తెలీదు. కల్చరల్‌గా అంత వెనుకబడి ఉన్నాం. గ్రాండ్ పేరెంట్స్‌తో డిస్‌కనెక్టై గుగులింగ్‌తో రైటర్స్ అవుతాం అనుకుంటే అది భ్రమే!

 - పున్నా కృష్ణమూర్తి

 

 ఆక్స్‌ఫర్డ్! ఎడ్లు నదిని దాటేందుకు వీలైన చోటు!  అజ్ఞానాన్ని దాటేందుకు జిజ్ఞాసువులకు దోహదపడాలని థేమ్స్ నదీ తీరంలోని ‘ఆక్స్‌ఫర్డ్’ పట్టణంలో  ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ (ఓయూ) ఏర్పడింది! ఇది ఇంగ్లిష్ భాషాప్రపంచంలో తొలి యూనివర్సిటీ.  తరగతి గదులను ప్రపంచానికి చేరువ చేసేందుకు పుస్తకమే వాహకంగా భావించిన ‘ఓయూ’  1586లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ (ఓయూపీ)ని స్థాపించింది. 50 దేశాల్లో కార్యాలయాలను కలిగి, ఏటా ఆరువేలకు పైగా పుస్తకాలను ప్రచురిస్తోన్న ఓయూపీ, 1912లో  ‘ఓయూపీ ఇండియా’ ప్రారంభించింది. ఆక్స్‌ఫర్డ్ ఇండియా శతజయంతి నేపథ్యంలో ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు అయిన మిని కృష్ణన్ సారథ్యంలో ఓయూపి ట్రాన్స్‌లేషన్స్ డిపార్ట్‌మెంట్‌ను నెలకొల్పారు. ఆమె సంపాదకత్వంలో  ఆక్స్‌ఫర్డ్ నవెల్లాస్  సీరీస్‌లో భాగంగా రూపొందిన ఆరు భారతీయభాషల నవెలోస్ (కథ కంటె పెద్దవి నవల కంటె చిన్నవి)ను  ఇటీవల ైెహదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నోబెల్‌బహుమతి గ్రహీత  అమర్త్యసేన్‌తో వైవాహిక జీవితాన్ని గడిపిన  డా. నవనీత దేవసేన్ పాల్గొన్నారు. నవనీత దేవసేన్, ఓయూపి మిని కృష్ణన్, కేంబ్రిడ్జి యూనివర్సిటీ పబ్లిషర్ దీపా ఛటర్జీ తదితరులు  ‘బహుళభాషలు-అనువాదం, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రచురణ’ అనే అంశాలపై తమ అభిప్రాయాలను, అనుభవాలను యూనివర్సిటీ విద్యార్థులతో పంచుకున్నారు.

 

 

 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top