‘ ఎన్నారై పాలసీ ప్రకటించాలి’

'NRI Policy to Announce' - Sakshi

లండన్‌ : నాలుగేండ్లు కావస్తున్నా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నారై పాలసీ విషయంపై తేల్చకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని టీపీసీసీ ఎన్నారై సెల్‌ సభ్యులు విమర్శించారు. లండన్‌లో టీపీసీసీ ఎన్నారై సెల్‌ సభ్యులు విలేకరులతో మాట్లాడారు. 2014 ఎన్నికల సమయంలో ఎన్నారైలకు అరచేతిలో వైకుంఠాన్ని చూపి నేడు ఎన్నారై లను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 2016 జులైలో అట్టహాసంగా, విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి ఎన్నారై పాలసీపై ఆశలు రేకెత్తించి  రెండు ఏండ్ల వరకు కోల్డ్  స్టోరేజీ పడేశారని మండిపడ్డారు.

టీపీసీసీ అడ్వైజరీ మెంబర్‌ గంగసాని ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నారై మంత్రి కేటీఆర్‌ తెలంగాణ సాకారం చేసిన కాంగ్రెస్‌ను లోఫర్  అనడం  ఖండిస్తున్నామన్నారు. నాలుగేండ్లయినా ఎన్నారై పాలసీ ప్రకటించకుండా విదేశీ పర్యటనలు చేస్తున్న మంత్రి కేటీఆర్‌ని జోకర్‌గా అభివర్ణించారు. 

ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్  కార్యదర్శి ,టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ మాట్లాడుతూ..వలస బాధితులు ఏజెంట్ల చేతిలో మోసపోవడాన్ని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, ఎన్నారై సంక్షేమంపై చిత్తశుద్ధి లేదని  వ్యాఖ్యానించారు.

ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఎన్నారై సెల్  కో-కన్వీనర్  సుధాకర్ గాడ్ మాట్లాడుతూ..పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ పై  పార్లమెంటులో అవమానకరంగా మాట్లాడిన ప్రధాని మోదీని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నేడు కాంగ్రెస్ను విమర్శించడం తగదని అన్నారు. దళితులకు అధికారం పేరుతో గద్దెనెక్కి మోసం చేసిన కేసీఆర్‌ కుటుంబమే లోఫర్‌ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. బీసీలకు రాజ్యాధికారం అందకుండా గొర్లు, బర్లు అని మాయపుచ్చడం కుట్రలో భాగమేనని చెప్పారు.

ఎన్నారై సెల్  కో-కన్వీనర్  చిట్టెం అచ్యుత రెడ్డి  మాట్లాడుతూ..ఎన్నారై పాలసీ ప్రకటించక పోవడం వల్ల గల్ఫ్ ఎన్నారైలు ఎన్నో అవస్థలు పడుతున్నారని, నారాయణపేటకు సంబంధించి  ఓ గల్ఫ్ ఎన్నారై సౌదీలో చనిపోయి  15 రోజులైనా పార్దీవ దేహాన్ని తీసుకురావడంలో ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదని విమర్శించారు.

కోర్ సభ్యులు  బాలకృష్ణా రెడ్డి మాట్లాడుతూ..ఎన్నారై మంత్రి కేటీఆర్‌ ట్విటర్ పిట్ట అని ఎద్దేవా చేశారు. కబుర్లు ఆపి ఎన్నారై పాలసీ ప్రకటించి గల్ఫ్ ఎన్నారైలకు న్యాయం చేయాలని  డిమాండ్‌ చేశారు. కోర్ సభ్యులు జి.నర్సింహా రెడ్డి మాట్లాడుతూ..మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనపై శ్వేత పత్రం సమర్పించాలని డిమాండ్ చేశారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top