డాలస్ లో ఘనంగా గాంధీజీ 15౦ వ జయంతి ఉత్సవాలు

Mahatma Gandhi 150th Birth Anniversary Celebrations In Dallas - Sakshi

ప్రతి పురుషుని విజయం వెనుక ఓ స్త్రీ  ఉంటుంది అనే నానుడి  వాస్తవం కాదని నిరూపిస్తూ గాంధీజీతో సమానంగా ఆయన పక్కనే నడుస్తూ సత్యాగ్రహంతో పాటు మరెన్నో విషయాల్లో కస్తూర్బాగాంధీ ఎంతో తోడ్పాటును అందించారని మహాత్మా గాంధీ మనవరాలు ఈలా గాంధీ పేర్కొన్నారు.  డాలాస్‌లోని పార్క్‌ప్లాజాలో మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎంజీఎంఎన్‌టీ) ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్ముని 150వ జయంతి  వేడుకల్లో పాల్గొని ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మహాత్ముని జీవిత గాథలపై గాక ఆయన సతీమణి కస్తూర్బాగాంధీ జీవితంపై చక్కని ప్రదర్శనతో కూడిన ప్రసంగాన్ని వినిపించారు. 13ఏళ్ల వయస్సులో గాంధీజిని వివాహం చేసుకున్న కస్తుర్బా.. ఏనాడూ బడికి పోలేదన్నారు. గాంధీజీ చొరవతో ఆయన శిక్షణలోనే చదువుకున్న కస్తూర్భా.. భర్తతో కలిసి దక్షిణాఫ్రికా వలస వెళ్లాక అక్కడి భారతీయులకు వ్యతిరేకంగా అమలులో ఉన్న జాతి వివక్ష చట్టాలపై ఆమె చేసిన పోరాటాల గురించి వివరించారు. 1942-44 మధ్య కాలంలో ఆమె జీవిత చివరి దశలో బాపూజీతో కలిసి గడిపిన జైలు జీవితంపై ఈలా గాంధీ సుదీర్ఘంగా ప్రసంగించి పలు ఛాయాచిత్రాలను ప్రదర్శించారు.  బాహ్యప్రపంచానికి గాంధీజీ మహాత్ముడేమో గానీ, ఇంట్లో మాత్రం ఆమె శక్తిమంతురాలని, బాపూజీకి సత్యాగ్రహాన్ని, దాని శక్తిని పరిచయం చేసిన తొలి వ్యక్తి కస్తుర్బా అని ఈలా గాంధీ పేర్కొన్నారు. మహిళా చైతన్యం, మహిళా సాధికారత వంటి అంశాల పట్ల ఆ రోజుల్లోనే ఎంతో అవగాహన కలిగిన తన నాయినమ్మ కస్తుర్బా గాంధీ నేటి మహిళలకు తప్పక ఆదర్శంగా నిలుస్తుందని ఈలా గాంధీ ఆశాభావం వ్యక్తపరిచారు. ఎంజీఎంఎన్‌టీ రూపొందించిన ప్రత్యేక సంచికను  ముఖ్య అతిధి ఈలా గాంధీ ఆవిష్కరించారు. అనంతరం ఆమెను ఎంజీఎన్‌టీ కార్యవర్గం ఘనంగా సత్కరించింది.

అహింసయే శాంతి- శాంతియే శక్తి-శక్తియే ఆనందం-ఆనందమే ఐకమత్యం
ఈలా గాంధీ ప్రసంగానికి పూర్వం ఎంజీఎంఎన్‌టీ ఛైర్మన్ డా. తోటకూర ప్రసాద్ ప్రసంగిస్తూ.. కస్తుర్బా గాంధీ 150వ జయంతి కూడా ఇదే సంవత్సరం కావడం విశేషమని అన్నారు. సోషల్ మీడియాలు, వైరల్ వీడియోలు లేని రోజుల్లోనే కోట్ల మందిని అహింసా, సత్యాగ్రహం, క్రమశిక్షణ వంటి శాంతియుతమైన నినాదాలతో కదిలించిన మహిమాన్వితుడు మహాత్మా గాంధీ అని, ఆయన 150వ జయంత్యుత్సవాలను డల్లాస్‌లో నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. నోబెల్ విజేతలకు, దేశాధినేతలకు, ప్రపంచ ప్రముఖులకెందరికో గాంధీజీ సిద్ధాంతాలు ఆదర్శప్రాయమని కొనియాడారు. గాంధీజి ఆశయాలు, ఆదర్శాలు మరో 150ఏళ్లు విశ్వవ్యాప్తంగా విరాజిల్లుతాయని డా. ప్రసాద్ తోటకూర పేర్కొన్నారు.  2014 లో అమెరికా దేశంలో కెల్లా అతి పెద్దదైన మహాత్మా గాంధీ స్మారకస్థలిని డాలస్ (ఇర్వింగ్‌)లో ఏర్పాటు చేయడానికి సహకరించిన ఇర్వింగ్ పట్టణ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసి భారీ విరాళాలు అందించిన దాతలను సత్కరించారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ పూర్వ ఉపసభాపతి డా. మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ అహింసతోనే శాంతి సాధ్యమని, గాంధీజి సిద్ధంతాలు ఎల్లవేళలా ఆదర్శనీయమని వెల్లడించారు. గాంధీజి నిర్దేశించిన మార్గంలో అందరూ నడవాలని తద్వారా ఐకమత్యం భాసిల్లుతుందని అన్నారు.పుదుచ్చెరి ఆరోగ్య శాఖా మంత్రి మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ యానాంలో ఒక పెద్ద పార్కులో 11 కోట్ల రూపాయిల వ్యయంతో అతిపెద్ద గాంధీజి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, జనవరిలో దాన్ని గాంధీ పార్కుగా  నామకరణం చేస్తున్నామని  ప్రకటించారు.స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో  మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ రీసెర్చ్ సెంటర్ కు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న  ప్రొఫెసర్ క్లేబోర్న్ కార్సన్ మాట్లాడుతూ.. మార్టిన్ లూథర్ కింగ్ కు గాంధీజి చూపిన ఆశయాలు, సిద్ధాంతాలు మార్గదర్శకమని, ఆ శాంతి బాటలోనే అమెరికాలో ప్రజాహక్కుల ఉద్యమాలను కింగ్  నిర్వహించారని పేర్కొన్నారు.  

గాంధీ కింగ్ ఫౌండేషన్ ఛైర్మన్ గొల్లనపల్లి ప్రసాద్ మాట్లాడుతూ గాంధీజి జీవితాన్ని అనుసరించి అందరూ శాంతియుత జీవితాన్ని ఆస్వాదించాలని కోరారు.  బాపూజీ పై ప్రత్యేకంగా నృత్యశక్తి డ్యాన్స్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యరూపకం అందరినీ ఆకట్టుకుంది. గుజరాత్ నుండి వచ్చిన ప్రముఖ చిత్రకారుడు జిగర్ సోని గాంధిజీ పై ప్రత్యేకంగా రూపొందించిన చిత్ర ప్రదర్శన అందరి మెప్పును పొందింది. ఎంజిఎంఎన్టి  కార్యవర్గ సభ్యులు జిగర్ సోనిను, అమెరికాలోనే అతిపెద్దదైన మహాత్మాగాంధీ విగ్రహ  శిల్పి బుర్ర శివవరప్రసాద్ ను సతిసమేతంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో హోస్ట్ కమిటీ సభ్యులైన రన్నా జాని, ఆనంద్ దాసరి, డా. సత్ గుప్తా, శ్రీకాంత్ పోలవరపు, షబ్నం మోడ్గిల్, గుత్తా వెంకట్, మురళి వెన్నం, శాంటే చారి, జాన్ హామొండ్, రాజేంద్ర వంకవాల, శ్రీధర్ తుమ్మల లను ఎంజిఎంఎన్టి బోర్డు ఘనంగా సత్కరించింది.ఈ కార్యక్రమ నిర్వహణలో సహకరించిన కార్యకర్తలు డా. పులిగండ్ల విశ్వనాధం, దినేష్ హూడా, అనిల్ రాతే, మహేందర్ రావు, రాజీవ్ కామత్, ఉర్మిత్ సింగ్ లను ఎంజిఎంఎన్టి అభినందించింది.

ఎంజీఎంఎన్‌టీ కార్యదర్శి రావు కల్వల తన స్వాగతోపన్యాసంలో గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలను వందలాది అభిమానుల మధ్య ఇంత ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని, గాంధీజీ చూపిన బాటలోనే యువతరం కూడా ప్రపంచవ్యాప్తంగా నడవాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర తో పాటు బోర్డు సభ్యులు బీఎన్‌ రావు, జాన్ హామేండ్, రావు కల్వాల, తైయాబ్ కుండావాల, పియూష్ పటేల్, అక్రం సయాద్, కమల్ కౌషల్, అభిజిత్ రాయల్కర్ పాల్గొన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top