ఖల్లివెల్లి కార్మికుడి నుంచి..కంపెనీ యజమానిగా..

From Gulf Worker To Owner - Sakshi

కష్టాలకు ఎదురీది స్వశక్తితో ఎదిగిన తోర్నాలవాసి

తనలా ఎవరూ ఇబ్బందులు పడకూడదని చేయూత

‘ఆమ్నెస్టీ’లో కార్మికులకు సేవలందిస్తున్న నర్సింలు

సిద్దిపేట రూరల్‌ : బతుకుదెరువు కోసం దుబాయికి వెళ్లిన ఆ యువకుడికి అన్నీ కష్టాలే ఎదురయ్యాయి. ఏజెంట్‌ విజిట్‌ వీసా అంటగట్టడంతో కొద్ది రోజులకే గడువు ముగిసింది. స్వదేశం రాలేక అక్కడే తలదాచుకున్నాడు. ఖల్లివెల్లిగా (అక్రమ నివాసి) మారి చిన్నచిన్న కంపెనీల్లో పనిచేశాడు. ఆ తర్వాత స్వశక్తితో కంపెనీ ఏర్పాటు చేసి ఎందరో వలస కార్మికులకు ఉపాధి చూపుతున్నాడు. అంతేకాకుండా ఖల్లివెల్లి కార్మికులకు అండగా నిలిచి సేవలు అందిస్తున్నాడు.  

సిద్దిపేట జిల్లా తోర్నాల గ్రామానికి చెందిన గుండెల్లి నర్సింలు కుటుంబం అతని బాల్యంలో నిజామాబాద్‌కు వలస వెళ్లింది. నర్సింలు తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించే వారు. అక్కడే పదవ తరగతి వరకు చదువుకున్న నర్సింలు కొన్ని రోజులు తాపీ మేస్త్రీగా పనిచేశాడు. ఒక రోజు అతని తండ్రి కట్టెకోత మిషన్‌లో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు మొద్దు అతని భుజంపై పడడంతో గాయపడ్డాడు. ఇదే సమయంలో నర్సింలు తల్లి కూడా అనారోగ్యం బారిన పడింది. దీంతో కుటుంబ పోషణ భారం కావడంతో నర్సింలు గల్ఫ్‌ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

రూ.70 వేలు అప్పుచేసి  2004 సంవత్సరంలో దుబాయికి వెళ్లాడు. అయితే, అతనిని దుబాయికి పంపిన ఏజెంట్‌ కంపెనీ వీసా ఇప్పిస్తానని మోసం చేశాడు. దుబాయికి వెళ్లిన తర్వాత నర్సింలు ఆ ఏజెంట్‌కు ఫోన్‌ చేస్తే స్పందన లేదు. దీంతో నర్సింలు సరైన గూడు లేక చెట్ల కింద, లారీల కింద, పాడుబడ్డ భవంతుల వద్ద తలదాచుకుని దొరికిన పని చేసుకుంటూ రోజులు గడిపాడు. సంవత్సరం తర్వాత ఒక కంపెనీలో నెలకు 700 దిర్హమ్స్‌ జీతానికి పనికి కుదిరాడు.

అప్పడు భారత కరెన్సీలో నెలకు రూ.10 వేలు. ఇలా పనిచేసి సంపాదించి అప్పు తీర్చాడు. నర్సింలు నాలుగు సంవత్సరాలకు పైగా ఖల్లివెల్లిగా (అక్రమ నివాసిగా) పనిచేశాడు. సాయంత్రం వరకు కంపెనీలో పనిచేసి సాయంత్రం సమయంలో పార్కింగ్‌లో కార్లును కూడా కడిగేవాడు. ఈ క్రమంలో అక్కడ ఓ కారు ఓనర్‌ అయిన సీఐడీ విభాగంలో పనిచేసే అధికారితో నర్సింలుకు పరిచయం ఏర్పడింది. ఆ అధికారిని అక్కడి వారు అర్బాబ్‌ (అరబ్బీలో యజమాని, ప్రభువు అనే బిరుదు) అని పిలిచేవారు. ఆయన సహాయంతో నర్సింలు 2008లో దుబాయి నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు.  

మళ్లీ దుబాయికి ప్రయాణం..

తోర్నాలకు చేరుకున్న నర్సింలు పెళ్లి చేసుకుని ఎనిమిది నెలలు సొంత ఊరిలోనే ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత.. దుబాయిలో పరిచయ మైన సీఐడీ అధికారి తన సొంత కారు డ్రైవర్‌గా పనిచేయడానికి వీసా పంపగా నర్సింలు తిరిగి మళ్లీ దుబాయికి వెళ్లాడు. అక్కడే కారు డ్రైవింగ్‌ నేర్చుకొని ఆయన సహాయంతో లైసెన్సు పొందాడు. ఆ అధికారి కారు నడుపు తూనే సొంతంగా కారును కొనుగోలు చేసి నడుపుకున్నాడు. దీంతో పాటు అక్కడే ఇంటర్‌నెట్‌ పెట్టాడు. అందులో మొబైల్‌ రీచార్జ్‌ కార్డులు కూడా విక్రయించాడు. 

2013లో సొంతంగా కంపెనీ ఏర్పాటు..

అందరితో పరిచయాలు పెంచుకున్న నర్సింలు అక్కడి వారి భాగస్వామ్యంతో 2013 సంవత్సరంలో ‘ఎస్‌ఆర్‌జి టెక్నికల్‌ సర్వీసెస్‌ అండ్‌ బిల్డింగ్‌ క్లీనింగ్‌ ఎల్‌ఎల్‌సీ’ అనే కంపెనీని స్థాపించాడు. పెద్ద ఎత్తున కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాడు. తన కంపెనీ నుంచి మంచి వేతనం, వసతులు కల్పిస్తున్నాడు. దీనితో పాటు ఆయనకు మరో కంపెనీలో భాగస్వామ్యం లభించింది. 

ఇమ్మిగ్రేషన్‌కు ఉచితంగా బస్సు సౌకర్యం 

యూఏఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్షమాభిక్షను ఖల్లివెల్లి కార్మికులు ఉపయోగించుకునేందుకు నర్సింలు సహాయపడుతున్నాడు.  ఇమ్మిగ్రేషన్‌ పనుల కోసం ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నాడు. ఖల్లివెల్లిలకు ఈ ఖర్చు లేకుండా నర్సింలు  ఉచితంగా టాక్సీలు, మినీ బస్సుల సౌకర్యం కల్పిస్తున్నాడు. అదేవిధంగా సుమారు 100 మందికి పైగా భారత వలస కూలీలకు ఔట్‌ పాస్‌లు రావడంతో ఈ నెల 22 నుంచి వారిని స్వదేశానికి పంపిస్తున్నానని చెప్పాడు. సహాయం కావాల్సిన వారు తన సెల్‌ నంబర్‌ +97155 9346999 కు ఫోన్‌ చేయవచ్చని, తక్షణ సహాయం చేస్తామని నర్సింలు చెబుతున్నాడు.

ఆమ్నెస్టీకి తెలంగాణ ప్రభుత్వ హెల్ప్‌లైన్‌

యూఏఈ దేశం ప్రకటించిన ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలంగాణ ఎన్నారై శాఖ మంత్రి కేటీఆర్‌  కోరారు. ఆమ్నెస్టీ కాలంలో ఎవరికైనా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి సహాయం కావాలంటే హెల్ప్‌లైన్‌ నెంబర్‌ +9194408 54433 లేదా ఇ–మెయిల్‌  so_nri@telangana.gov.in ను సంప్రదించాలని కోరారు. తిరిగి వచ్చే వారి కోసం ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి అన్నారు. రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ శాఖ యూఏఈ రాయబార కార్యాలయం నుంచి తెలంగాణ ప్రవాసీయుల సమాచారాన్ని సేకరిస్తున్నదని మంత్రి తెలిపారు. దుబాయి ఇండియన్‌ కాన్సులేటులోని హెల్ప్‌ డెస్క్‌ నంబర్‌ +97156 5463903 లేదా Indiaindubai.amnesty@gmail.com  ద్వారా సంప్రదించవచ్చని సూచించారు.

ఏడు రాజ్యాలలో వేర్వేరు నిబంధనలు

యూఏఈలోని ఏడు రాజ్యాలలో (ఎమిరేట్స్‌) వేర్వేరు నిబంధనలు ఉండటం వలన ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) ఉపయోగించుకునేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దుబాయిలో నిబంధనలు కొంతవరకు ఈజీగా ఉన్నాయి. కేటీఆర్‌ దుబాయికి రావాలి, ఖల్లివెల్లీలను ఆదుకోవాలి. వాపస్‌ వచ్చినవారికి తెలంగాణ ప్రభుత్వం డబుడ్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వాలి. ఉపాధి కల్పించాలి.  

– దొనకంటి శ్రీనివాస్, అబుదాబి

రూ.50 కోట్లు కేటాయించాలి 

యూఏఈ క్షమాభిక్ష పథకంలో వలస కార్మి కులను ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించాలి. తెలంగాణ ప్రభుత్వం అధికారుల బృందాన్ని యూఏఈకి పంపి ప్రవాసుల సమస్యలను అధ్యయనం చేయాలి. ఆమ్నెస్టీ పొందేవారిని ఆదుకోవాలి. భారత రాయబార కార్యాలయాల్లో తెలుగు మాట్లాడే సిబ్బందిని నియమించాలి. ప్రస్తుతం దుబాయి లోని లేబర్‌ క్యాంపుల్లో కార్మికులకు అవగాహన కల్పిస్తున్నాను.

– ఎన్‌. దేవేందర్‌రెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ గల్ఫ్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌

యూఏఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు  

యూఏఈ ప్రభుత్వం ఆమ్నెస్టీ ప్రకటించడం హర్షించదగిన విషయం. క్షమాభిక్షకు అర్హులైన వారు ఇండియన్‌ ఎంబసీ నుంచి సహాయం పొందవచ్చు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధితులకు సహాయం చేస్తామని ప్రకటించడం మంచి పరిణామం. అలాగే ఏవైనా సమస్యలుంటే యూఏఈలోని తెలంగాణ జాగృతి వలంటీర్లు అవసరమైన సహాయం చేస్తారు.    

– నవీన్‌ ఆచారి, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ జాగృతి

విమాన టికెట్లకు దాతల సాయం

ఆమ్నెస్టీ పథకంలో దుబాయి నుంచి స్వస్థలాలకు వెళ్లడానికి విమాన టికెట్లకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న తెలుగు కార్మికులకు కొందరు దాతలు ఉచిత విమాన ప్రయాణ టికెట్లు సమకూర్చారు. అమెరికాలోని వర్జీనియాలో నివసిస్తున్న తెలుగు ప్రవాసి యశ్‌ బొద్దులూరి రెండు టికెట్లు, ఆయన సోదరులు మరో మూడు టికెట్లు ఉచితంగా ఇచ్చారు. మరికొందరు దాతల సహకారంతో కయిలోతు రాజం, కెలోప్త్‌ మోహన్‌ (ఎల్లారెడ్డిపేట), భూక్యా గోవర్దన్, మలావత్‌ మహిపాల్‌ (సిరికొండ), అంబుగోత్‌ రతన్‌ (మాచారెడ్డి), మంగళపల్లి భారత్‌ కుమార్‌ (దోమకొండ), సబావత్‌ మోహన్‌ (పాకాల, సిరికొండ), భూక్యా అశోక్‌ (తూముపల్లె, సిరికొండ), బానోత్‌ జగన్‌ (మహ్మదాబాద్, మెదక్‌), బక్కోల్ల లక్ష్మినారాయణగౌడ్, సంపంగి శ్రీకాంత్, రంగబోయిన నవీన్‌లకు ఉచిత టికెట్లు పంపిణీ చేశారు. డాక్టర్‌ గోపాలకృష్ణ రూ.2లక్షలు, డాక్టర్‌ పవిత్ర మరికొన్ని టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

కేటీఆర్‌కు యూఏఈ ప్రభుత్వ ఆహ్వానం

తెలంగాణ ఎన్నారై మంత్రి కె.టి.రామారావును తమ దేశంలో పర్యటించాలని ఆహ్వానిస్తూ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి షేక్‌ అబ్దుల్లా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ ఈనెల 5న ఒక లేఖ రాశారు. విద్య, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో యూఏఈతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి రావాలని కోరారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా తనకు లభించిన ఆతిథ్యానికి షేక్‌ అబ్దుల్లా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్‌ తన పర్యటన సందర్భంగా యూఏఈలోని తెలంగాణ ప్రవాస కార్మికుల సమస్యలతో పాటు, ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) పథకాన్ని ఉపయోగించుకునేవారికి సహాయం చేస్తారని అక్కడి తెలంగాణ వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top