డల్లాస్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Bathukamma Festival Was Held In Dallas - Sakshi

డల్లాస్‌: బతుకమ్మ పండుగ వేడుకలను దేశ విదేశాల్లో ఉ‍న్న తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ పీపుల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డల్లాస్‌ (టీపీఏడీ) అధ్వర్యంలో కొప్పెల్‌లోని ఆండ్రూ బ్రౌన్ పార్క్‌లో శుక్రవారం రోజున ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను భారీ స్థాయిలో నిర్వహించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపంగా వెలుగొందే బతుకమ్మ పండుగ వేడుకలు మహాలయ అమావాస్యతో ప్రారంభమై ఆశ్వయుజ అష్టమి వరకు కొనసాగనున్నాయి. బతుకమ్మ అనే మాట వినగానే ముందుగా గుర్తుకొచ్చేది పూలు, నైవేద్యాలు. తొమ్మిది రోజులు జరుపుకునే ఈ పండుగ వేడుకలో ఒక్కో రోజు ఒక్కో రకమైన నైవేద్యాలను సమర్పిస్తారు. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు.

డల్లాస్‌లో నిర్వహించిన ఈ వేడుకలకు మహిళలు అందమైన పూలతో బతుకమ్మలను తయారు చేసి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ప్రకృతిని ఆరాధిస్తూ బంగారు జీవితానికి ఎలాంటి ఆపద రాకుండా ఆత్మస్థైర్యంతో నిండు నూరేళ్ల బతుకు పండుగలా సాగాలని గౌరీమాతను పూజించారు. కోరికలు తీర్చే అమ్మగా గౌరీమాతను మహిళలు భక్తి శ్రద్ధలతో పూజించారు. వృద్ధులు కూడా వేడుకలకు హాజరై హారతి, నిమర్జన ఆచారాలను అత్యంత ప్రామాణికమైన రీతిలో నిర్వహించడానికి సహాయపడ్డారు. భోజన సౌకర్యం, పార్కింగ్‌ ఏర్పాట్లు టీపీఏడీ అధ్వర్యంలో ఏర్పాటు చేశారు. బతుకమ్మ పండుగ చివరి రోజు వేడుకలకు ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నట్లు టీపీఏడీ సభ్యులు తెలియజేశారు. మొదటి రోజు వేడుకలకు హాజరైన మహిళలందరికీ టీపీఏడీ బృందం ధన్యవాదాలు తెలియజేస్తూ, పండుగ చివరి రోజైన అక్టోబర్‌ 5న సద్దుల బతుకమ్మ వేడుకలకు ఆహ్వానాన్ని అందించారు. చివరి రోజు వేడుకలకు తెలుగు సినీరంగానికి చెందిన అనేక మంది ప్రముఖులు హాజరుకానున్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top