కలెక్టర్‌ కన్నెర్ర ! | Welfare officer of SC boys hostel suspended | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ కన్నెర్ర !

Jan 21 2018 11:01 AM | Updated on Mar 21 2019 8:35 PM

ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌): పేద విద్యార్థుల కడుపు నింపడానికి సంక్షేమ హాస్టళ్లకు సరఫరా చేస్తున్న సన్నబియ్యాన్ని వార్డెన్‌లు పక్కదారి పట్టించడంపై కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు కన్నెర్రజేశారు. ఇప్పటికే ఎస్సీ బాలుర వసతిగృహం వార్డెన్‌పై వేటు పడగా, తాజాగా బియ్యం అక్రమాల్లో మరొకరి హస్తం ఉందని తేలడంతో ఎస్సీ బాలికల హాస్టల్‌ వార్డెన్‌ ఇందిరాను శనివారం సస్పెండ్‌ చేశారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కలెక్టర్‌ సస్పెన్షన్‌ ఫైలుపై సంతకం చేయగా, ఉత్తర్వులు ఇంకా బయటకు తీయలేదని తెలిసింది. దీంతో  ‘సాక్షి’ చెప్పినట్లుగానే హాస్టళ్ల సన్నబియ్యం తరలింపు వ్యవహారంలో మరి కొందరు వార్డెన్‌ల హస్తం ఉందని తేలిపోయింది. ఇంకెవరెవరి హస్తం ఉందో అధికారులతో లోతైన విచారణ చేయిస్తున్నారు. ఈ నెల 12న నిజామాబాద్‌ నగరంలోని చంద్రశేఖర్‌ కాలనీలో 34 క్వింటాళ్ల హాస్టళ్ల సన్నబియ్యం బస్తాలు పట్టుబడిన విషయం తెలిసిందే.

 ఈ వ్యవహారంలో బాధ్యులైన వారందరిపై కలెక్టర్‌ చర్యలకు ఉపక్రమించారు. ఇద్దరు వార్డెన్‌లను సస్పెండ్‌ చేయగా వీరితో పాటు బియ్యం దాచడానికి సహకరించిన ఇంటి యజమాని శ్రీనివాస్, మధ్యవర్తి కిరణ్, సివిల్‌ సప్లయి హమాలీ మహబూబ్‌లపై క్రిమినల్‌ కేసులు పెట్టారు. ఈ మేరకు కలెక్టర్‌ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఇక ముందు అవినీతికి పాల్పడితే సహించేది లేదని పై కలెక్టర్‌ చర్యలతో హెచ్చరించారు. ఇటు సన్నబియ్యం తరలింపు కేసు రోజుకో మలుపు తిరుగుతుండడం ఎస్సీ సంక్షేమ శాఖ అధికారుల్లో కలవరం పెడుతోంది. మున్ముందు ఇంకెవరు బలి కావాల్సి వస్తుందోనని జంకుతున్నారు. కాగా వార్డెన్‌ ఇందిరాను తప్పించడానికి ఓ రాజకీయ నేత గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు.

అధికారులకు జేసీ రవీందర్‌ రెడ్డి వార్నింగ్‌...
హాస్టళ్ల సన్నబియ్యం పక్కదారి పట్టించి అక్రమాలకు పాల్పడుతుండడంపై జాయింట్‌ కలెక్టర్‌ కూడా సీరియస్‌ అయ్యారు. శనివారం సాయంత్రం తన చాంబర్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులు, వార్డెన్‌లు, రెసిడెన్షియల్‌ స్కూళ్ల అధికారులు, ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల అధికారులు, సివిల్‌ సప్లయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఇంత మొత్తంలో వేతనాలు ఇస్తున్నప్పటికీ పేద విద్యార్థుల కడుపు నింపే సన్నబియ్యంను పక్కదారి పట్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ చాటుగా ఎవరు ఎలాంటి పనులు చేస్తున్నారో అన్నీ తెలుస్తున్నాయని, అక్రమాలకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు పెట్టడానికి వెనుకాడబోనని హెచ్చరించారు. ప్రతి నెల 25న బియ్యం క్లోజింగ్‌ బ్యాలెన్స్‌ను చూపాలని, 5వ తేదీలోగా బియ్యం రిసీవ్‌ చేసుకోవాలన్నారు. పర్యవేక్షణ చేయని సంక్షేమాధికారులపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement