
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి నిరాకరించిన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడం, ఆ మరుసటి రోజు ఆంధ్రప్రదేశ్‌లోని అధికార తెలుగుదేశం పార్టీ కూడా కేంద్రంపై అవిశ్వాసం ప్రకటించడంతో దేశంలో ఇప్పుడు అవిశ్వాస తీర్మానాలపై చర్చ జరుగుతోంది. పార్లమెంటు 66 ఏళ్ల చరిత్రలో లోక్‌సభలో ఇప్పటి వరకూ అనేక విశ్వాస, అవిశ్వాస తీర్మానాలపై చర్చ జరిగింది. మెజారిటీ సభ్యుల మద్దతు ఉందని నిరూపించుకోలేకపోయిన ఐదుగురు ప్రధానులు రాజీనామా చేశారు.
తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం మొదటి పదేళ్లలో(1952-62) ప్రతిపక్షాల నుంచి అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొనలేదు. 1963 ఆగస్ట్‌లో మొదటిసారి నెహ్రూ సర్కారుపై లోక్‌సభలో సోషలిస్ట్ నేత జేబీ కృపలానీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. లాల్‌బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్న ఏడాదిన్నర కాలంలో ఆయన ప్రభుత్వంపై మూడు అవిశ్వాస తీర్మానాలను (1964లో ఒకటి, 65లో రెండు) ప్రతిపక్షాలు ప్రవేశపెట్టాయి. నెహ్రూ, శాస్త్రీ హయాంలో కాంగ్రెస్‌కు పార్లమెంటులో భారీ మెజారిటీ ఉన్న కారణంగా అవిశ్వాసాలన్నీ వీగిపోయాయి. దాదాపు పదిహేనేళ్లు అధికారంలో ఉన్న ఇందిరాగాంధీ ప్రభుత్వాలపై రికార్డు స్థాయిలో 15 అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు.
ఒక ఓటు తేడాతో వాజ్‌పేయి రెండో సర్కారుపై వీగిన విశ్వాస తీర్మానం!
13 నెలల అటల్‌బిహారీ వాజ్‌పేయి సర్కారు 1999 ఏప్రిల్‌లో తన సంకీర్ణ భాగస్వామి ఏఐఏడీఎంకే మద్దతు ఉపసంహరించుకున్నాక ప్రవేశపెట్టిన విశ్వాసతీర్మానం ఒక్క ఓటు తేడాతో వీగిపోయింది. తీర్మానానికి అనుకూలంగా 269 ఓట్లు, వ్యతిరేకంగా 270 ఓట్లు పడ్డాయి. ఇంత తక్కువ తేడాతో బలపరీక్షలో ప్రభుత్వం కూలిపోయిన సందర్భం ఇదే. ఎన్డీఏ (బీజేపీ) మిత్రపక్షమైన నేషనల్ కాన్ఫరెన్స్ సభ్యుడు సైఫుద్దీన్ సోజ్ పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయడం, అప్పటికి రెండు నెలల క్రితం ఒడిశా సీఎంగా ప్రమాణం చేసిన గిరిధర్ గమాంగ్ (కాంగ్రెస్) తన లోక్‌సభ సభ్యత్వం కొనసాగుతున్న కారణంగా సభకు వచ్చి ఓటేయడంతో వాజ్‌పేయి సర్కారు కూలిపోయింది.
రాజీవ్‌గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై 1987లో తెలుగుదేశం నేత సి.మాధవరెడ్డి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా అది మూజువాణి ఓటుతో వీగిపోయింది. పీవీ నరసింహారావు నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం (1991-96) మూడు అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొని ఐదేళ్లు నిలబడగలిగింది. 2003లో వాజ్‌పేయి చివరి ప్రభుత్వంపైన లోక్‌సభలో కాంగ్రెస్ ప్రతిపక్షనేత సోనియాగాంధీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఇప్పటికి ఇదే చివరి అవిశ్వాస తీర్మానం. ఇది 314-189 ఓట్ల తేడాతో వీగిపోయింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే స్పీకర్ అనుమతి పొందాక దానికి 50 మంది సభ్యుల మద్దతు అవసరం. దాదాపు నాలుగేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ ప్రభుత్వంపై ఇంత వరకూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టలేదు.
ఇప్పుడు రెండు తీర్మానాలు
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, హోదా కోసం ఎందాకైనా అనే నినాదంతో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నాలుగేళ్లుగా సాగిస్తూ వస్తున్న పోరాటానికి చివరికి అధికార తెలుగుదేశం తలొగ్గక తప్పలేదు. ‘హోదా సంజీవనిక కాదు, ప్యాకేజీ మిన్న’ అని ఇప్పటి వరకూ వాదిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చివరికి కేంద్ర సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రజాభిప్రాయానికి భయపడి తొలుత వైసీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి ఇస్తానని ప్రకటించి చివరి నిమిషంలో విడిగా నోటీసు ఇచ్చారు. ఇప్పుడు ఒకే అంశంపై నరేంద్ర మోదీ సర్కారుకు వ్యతిరేకంగా రెండు అవిశ్వాస తీర్మానాల నోటీసులు వచ్చాయి. కాంగ్రెస్ సహా పార్లమెంటులోని అనేక ప్రతిపక్ష పార్టీలు ఈ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించాయి.
-- సాక్షి నాలెడ్జ్ సెంటర్