రేప్‌ చేయబోయాడు.. కోసిపారేసింది! | Woman chops off penis of man attempting rape, buries his body | Sakshi
Sakshi News home page

రేప్‌ చేయబోయాడు.. కోసిపారేసింది!

Apr 21 2016 3:19 PM | Updated on Sep 3 2017 10:26 PM

రేప్‌ చేయబోయాడు.. కోసిపారేసింది!

రేప్‌ చేయబోయాడు.. కోసిపారేసింది!

తనపై, తన కూతురిపై అత్యాచార యత్నానికి ఒడిగట్టిన ఓ యువకుడిపై ఆదివాసి మహిళ గొడ్డలితో తిరగబడింది.

తనపై, తన కూతురిపై అత్యాచార యత్నానికి ఒడిగట్టిన ఓ యువకుడిపై ఆదివాసి మహిళ గొడ్డలితో తిరగబడింది. అతడి పురుషాంగాన్ని కోసేసి.. గొడ్డలితో నరికి చంపింది. గుట్టుచప్పుడు కాకుండా అతడి మృతదేహాన్ని తన స్నేహితురాళ్ల సహాయంతో స్థానిక శ్మశానంలో పూడ్చిపెట్టింది. ఈశాన్య అసోంలోని భారాజులి గ్రామంలో ఈ నెల 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నేరానికి పాల్పడిన రితా ఓరంగ్‌, ఆమె భర్తను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. చనిపోయిన యువకుడిని కృష్ణ భూంజీగా గుర్తించారు.

కృష్ణ భూంజీ కనిపించకపోవడంతో అతడి కుటుంబసభ్యులు పోలీసులు మిస్సింగ్‌ ఫిర్యాదు చేశారు. 'కృష్ణ అదృశ్యమైన ఫిర్యాదుపై దర్యాప్తు జరుపుతుండగా అతడు చనిపోయినట్టు మా దృష్టికి వచ్చింది. మంగళవారం రాత్రి అతడి మృతదేహాన్ని సమాధి నుంచి వెలికితీసి.. పోస్టుమార్టం నిమిత్తం పంపించాం' అని బిశ్వానాథ్‌ చారియాలి జిల్లా ఎస్పీ అంజుర్ జైన్ తెలిపారు. కృష్ణ నేరగాడని, రెండు కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడని పోలీసులు తెలిపారు.

ఏప్రిల్‌ 4న కృష్ణ తనపై, తన కూతురిపై అత్యాచారం చేయబోయాడని, దీంతో ఆత్మరక్షణ కోసం అతడిని గొడ్డలితో ప్రతిఘటించానని ఆమె పోలీసులకు తెలిపింది. 'వెనుక నుంచి నరికిన తర్వాత అతడి ప్రైవేటు అంగాలను నరికేశాను. అతడు ఒకవేళ బతికితే తమపై ప్రతీకారం తీర్చుకుంటాడేమోనన్న భయంతో ఇలా చేశాను' అని ఆమె వివరించింది. అయితే ఈ గొడ్డలి దెబ్బలకు అతడు వెంటనే చనిపోయాడు. దీంతో తన మిత్రులైన ఏడుగురు స్థానిక మహిళల సహాయం తీసుకొని అతడి మృతదేహాన్ని స్థానిక శ్మశానంలో పూడ్చిపెట్టింది. ఈ కేసులో అవసరమైతే ఆమె మిత్రుల పాత్రపై కూడా విచారణ జరుపుతామని పోలీసులు చెప్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement