అబే సాలే.. అంటే అర్థమేంటి?

అబే సాలే.. అంటే అర్థమేంటి?

'అబే సాలే..' అంటే ఏంటో ఓ మాదిరిగా హిందీ వచ్చినవాళ్లందరికీ బాగా తెలుసు. ఎవరినైనా తిట్టాలంటే ముందుగా ఆ పదాన్ని ఉపయోగిస్తారు. కానీ, ప్రస్తుతం గూగుల్ లాంటి సెర్చింజన్ దిగ్గజ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న సుందర్ పిచాయ్ మాత్రం.. అదేదో స్నేహపూర్వకంగా పిలిచే పలకరింపు అనుకున్నారట. అయితే అది ఇప్పటి విషయం కాదు.. 23 ఏళ్ల క్రితం ఆయన ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకునే సమయంలో. చెన్నైలో పుట్టిన పిచాయ్.. ఖరగ్‌పూర్ ఐఐటీకి వెళ్లినప్పుడు అక్కడి విద్యార్థులకు ఈ విషయం చెప్పి నవ్వుకున్నారు. 

 

తాను స్కూల్లో హిందీ చదువుకున్నా, పెద్దగా మాట్లాడేవాడిని కానని.. ఎవరైనా మాట్లాడుతుంటే వినేవాడినని సుందర్ పిచాయ్ చెప్పారు. అందరూ అలాగే పిలుచుకుంటారని భావించి ఒకరోజు మెస్‌లో ఓ స్నేహితుడిని పిలవడానికి తాను 'అబే సాలే..' అన్నానని తెలిపారు. ఆయన ఆ మాట అనగానే ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం నిశ్శబ్దంలో మునిగిపోయింది. మొదటి రెండు వారాల పాటు తాను అలాగే అనుకున్నానని, క్రమంగా అర్థమైందని తెలిపారు. తన భార్య అంజలిని కూడా క్యాంపస్‌లోనే కలిసిన సుందర్.. అమ్మాయిల హాస్టల్లోకి వెళ్లడం మాత్రం అంత సులభం కాదన్నారు. ఎవరో ఒకళ్లు బయట నిలబడి, గట్టిగా.. 'అంజలీ, నీకోసం సుందర్ వచ్చాడు' అని చెప్పాల్సి వచ్చేదని, అది అంత బాగుండేది కాదని తన ప్రేమ వ్యవహారాన్ని కూడా తెలిపారు. 

 

టెక్నాలజీ.. అందునా మొబైల్ ఫోన్లు వచ్చాక ప్రపంచమే మారిపోయిందని, కానీ ఐఐటీలో తన గది మాత్రం పాతికేళ్ల నుంచి అలాగే మారకుండా ఉందని జోక్ చేశారు. అందరు కాలేజి కుర్రాళ్లలాగే తాను కూడా నైటవుట్లు చేసి, పొద్దున్నే క్లాసులు ఎగ్గొట్టేవాడినన్నారు. 2004లో తనకు గూగుల్‌లో ఇంటర్వ్యూ వచ్చిందని, అప్పట్లో వాళ్లు జీమెయిల్ గురించి చెబుతుంటే అదేదో తనను ఏప్రిల్ ఫూల్ చేయడానికి చెబుతున్నారని అనుకున్నానని తెలిపారు. అది వాస్తవమన్న విషయం చాలా కాలం వరకు నమ్మలేదన్నారు. కాలేజిలో చదివే రోజుల్లో నారాయణమూర్తి తనకు హీరో అని, సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడుతుంటే చూడటాన్ని ఇష్టపడేవాడినని అన్నారు.
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

సంబంధిత వార్తలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top