‘రబీ’కి కేంద్రం మద్దతు

Union Cabinet hikes MSPs for rabi crops - Sakshi

గోధుమలకు క్వింటాల్‌పై రూ.85, శనగలకు రూ.255 పెంపు

ఢిల్లీలో అనధికార కాలనీల్లోని వారికి యాజమాన్య హక్కులు

కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు

సాక్షి, న్యూఢిల్లీ: రబీ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ బుధవారం ఈ మేరకు నిర్ణయించింది. సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ మీడియాకు వెల్లడించారు. రబీ పంటలైన గోధుమలు, శనగలు, బార్లీ, మసూర్‌ పప్పు, ఆవాలు, కుసుమల మద్దతు ధరలను పెంచింది. 2020–21కి గాను గోధుమల కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.1,925గా నిర్ణయించింది.

గత సీజన్‌లో ఇది రూ.1.840గా ఉండగా.. ఈసారి రూ.85 పెంచింది. బార్లీ కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.85 మేర పెంచుతూ రూ.1,525గా నిర్దేశించింది. గత సీజన్‌లో ఇది రూ.1,440గా ఉండేది. శనగలకు క్వింటాల్‌కు రూ.255 చొప్పున పెంచుతూ రూ.4,875గా నిర్ణయించింది. మసూర్‌ (కేసరి) పప్పు క్వింటాల్‌ ధర రూ.4,800గా నిర్ణయించింది. గత సీజన్‌లో ఇది రూ.4,475 ఉండగా ఈసారి రూ.325 పెంచింది. ఆవాలు క్వింటాలు ధర గత సీజన్‌లో రూ.4,200 ఉండగా.. ఈసారి రూ.255 పెంచింది. ప్రస్తుత సీజన్‌లో క్వింటాల్‌ ఆవాలు కనీస మద్దతు ధర రూ.4,425గా నిర్ణయించింది. కుసుమ పంటకు క్వింటాల్‌కు రూ.275 పెంచుతూ రూ.5,215గా నిర్దేశించింది. గత సీజన్‌లో కుసుమ ధర క్వింటాల్‌కు రూ.4,945గా ఉంది.

చైనా సరిహద్దుకు కొత్త సైనికులు !
దాదాపు 18 ఏళ్ల తర్వాత ఇండో–టిబెటన్‌ బార్డర్‌ పోలీసు కేడర్‌ను కేంద్ర కేబినెట్‌ సమీక్షించింది. ఈ సమీక్షలో పలువురికి పదోన్నతులు దక్కనున్నాయి. దీంతో పాటు గ్రూప్‌ ఏ సాధారణ విధుల కేడర్, నాన్‌ జనరల్‌ విధుల విభాగంలో కొత్తగా 3 వేల ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉంది. ఐటీబీపీ 58వ రైజింగ్‌ డే సందర్భంగా ఈ సమీక్ష చేపట్టారు. గతంలో చివరగా 2001లో సమీక్ష చేపట్టారని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ అన్నారు. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంట భద్రతను పటిష్టం చేసే దిశగా కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. కొత్త ఉద్యోగాలు వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా భర్తీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.   

ఢిల్లీలో 50 లక్షల మందికి లబ్ధి
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్ర కేబినెట్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని 1797 అనధికార కాలనీల్లో నివసిస్తున్న వారికి యాజమాన్య హక్కులు ఇవ్వాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుం దని జవదేకర్‌ చెప్పారు. అనధికార కాలనీల క్రమబద్ధీకరణ నిర్ణయం వల్ల దాదాపు 50 లక్షల మందికి లబ్ధి కలగనుంది. రాబోయే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి హరదీప్‌ సింగ్‌ పూరి వెల్లడించారు. ఢిల్లీలోని అనధికార కాలనీల క్రమబద్ధీకరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఢిల్లీ సీఎం  కేజ్రీవాల్‌ తెలిపారు. క్రమబద్ధీకరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top