ఒడిశాపై తైవాన్‌ ఆసక్తి

Taiwan Is Interested In Investments In Orissa - Sakshi

రూ.43 వేల కోట్ల పెట్టుబడికి ప్రతిపాదన

ముఖ్యమంత్రితో ఆ దేశ బృందం భేటీ

భువనేశ్వర్‌ : రాష్ట్ర తైల ఉత్పాదన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తైవాన్‌ దేశం ఆసక్తి కనబరుస్తోంది. ఈ నేపథ్యంలో తైవాన్‌ దేశానికి చెందిన సీపీసీ కార్పొరేషన్‌ సంస్థ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో గురువారం సచివాలయంలో భేటీ అయింది. అంతకు ముందు ఈ ప్రతినిధి బృందం పారాదీప్‌ ఓడ రేవు నగరం, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ప్రాంగణాలను ప్రత్యక్షంగా సందర్శించింది.

తైవాన్‌లో అతి పెద్ద తైల సంస్థగా పేరొందిన సీపీసీ కార్పొరేషన్‌ రాష్ట్రంలో రూ.43 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కనబరచడం విశేషం. ఈ ప్రతిపాదనపట్ల ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సుముఖత వ్యక్తం చేశారు.

పారాదీప్‌ ప్రాంతంలో  సీపీసీ కార్పొరేషన్‌ సంస్థ నఫ్తా క్రేకర్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తుం ది. అందుకు అవసరమైన మౌలిక వనరులతో పాటు స్థలం, నీరు, విద్యుత్‌ సరఫరాతో ఇతరేతర ప్రోత్సాహాకాల్ని కల్పించేందుకు  రాష్ట్ర ప్రభుత్వం అభయం ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య ప్రసాద్‌ పాఢి మీడియాకు వివరించారు.

దేశంలో పలు ప్రాంతాలు సందర్శించిన మేరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మక్కువ ప్రదర్శించడం విశేషమని ఆయన  పేర్కొన్నారు. పారాదీప్‌ ప్రాంతంలో ప్రతిపాదిత యూనిట్‌ ఏర్పాటుకు అనుకూలత ఖరారు చేసిన మేరకు ప్రతినిధి బృందం తొలుత రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శితో రాష్ట్ర సచివాలయంలో భేటీ అయింది. అనంతరం ముఖ్యమంత్రితో భేటీ అయింది.

ప్రతిపాదిత నఫ్తా క్రేకర్‌ నిర్వహణకుఒడిశాపై తైవాన్‌ ఆసక్తి అవసరమైన ముడి సరుకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కల్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రతినిధి బృందం ఆ సంస్థ ఉన్నతాధికారులతో ముందస్తుగా భేటీ అయింది.

ప్రతినిధి బృందం సంప్రదింపులు ఫలప్రదం అయితే పారాదీప్‌ ప్రాంతంలో తైవాన్‌ సీపీసీ సంస్థ రూ.43 వేల కోట్లతో నఫ్తా క్రేకర్‌ యూనిట్‌ ఏర్పాటు తథ్యం. పారాదీప్‌ పోర్టు ట్రస్టు ఈ మేరకు సకల సహాయ సహకారాలు అందించేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తోంది. 

మెగా ప్రాజెక్టు ఏర్పాటు చేస్తాం : సీపీసీ కార్పొరేషన్‌ అధ్యక్షుడు

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముఖ్య మంత్రికి ప్రతిపాదించాం. 6.6 బిలియన్ల యూఎస్‌ డాలర్లతో మెగా ప్రాజెక్టును రాష్ట్రంలో ప్రారంభిస్తాం. దేశీయ లెక్కల ప్రకారం ఈ ప్రాజెక్టు పెట్టుబడి విలువ రూ.43వేల కోట్లు ఉంటుందని తైవాన్‌ సీపీసీ కార్పొరేషన్‌ అధ్యక్షుడు లీ షన్‌ షిన్‌ తెలిపారు. 

ప్రత్యేక టాస్క్‌ ఫోర్సు : ముఖ్యమంత్రి

తైవాన్‌ సీపీసీ కార్పొరేషన్‌ ప్రతిపాదిత క్రేకర్‌ యూనిట్‌ ఏర్పాటుకు ముందుకు వస్తే ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తుందని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య ప్రసాద్‌ పాఢి అధ్యక్షతన ఈ టాస్క్‌ఫోర్స్‌ పని చేస్తుంది. ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన సహాయ సహకారాల్ని ఈ వర్గం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుందని సీఎం వివరించారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top