దీదీ నిర్ణయంపై స్టేకు సుప్రీం నిరాకరణ

Supreme Court Refuses To Stay Mamata Banerjee Govts Decision On Funding Durga Puja Committees - Sakshi

సాక్షి, కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని 28,000 దుర్గా పూజ కమిటీలకు  రూ 28 కోట్ల నిధులు మంజూరు చేయాలన్న మమతా బెనర్జీ సర్కార్‌ నిర్ణయంపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం నిరాకరించింది. ఒక్కో కమిటీకి రూ 10,000 చొప్పున 28,000 దుర్గా పూజా కమిటీలకు నిధులు మంజూరు చేయాలన్న మమతా బెనర్జీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఆరు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కోర్టు బెంగాల్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.  కాగా,  ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించేందుకు జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తాతో కూడిన సుప్రీం బెంచ్‌ నిరాకరించింది.

రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన కపిల్‌ సిబల్‌ పూజా కమిటీలకు నేరుగా డబ్బు ఇవ్వడం లేదని, రాష్ట్ర పోలీసుల ద్వారా పూజా కమిటీలకు ప్రభుత్వం ఈ నిధులు సమకూర్చుతుందని కోర్టుకు తెలిపారు. దుర్గా పూజా వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం రూ 28 కోట్ల నిధులను ఆయా కమిటీలకు అందించాలనే నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ప్రముఖ న్యాయవాది సౌరవ్‌ దత్తా పిటిషన్‌ను దాఖలు చేశారు.

దుర్గా పూజ కమిటీలకు రూ 10,000 చొప్పున రూ 28 కోట్లు ఇస్తామని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సెప్టెంబర్‌ పదిన ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు కోల్‌కతా హైకోర్టు ఈనెల 10న నిరాకరించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top