డ్యాన్స్‌ బార్లపై ఆంక్షలు ఎత్తివేత

Supreme Court Eases Dance Bars Rules In Maharashtra - Sakshi

న్యూడిల్లీ: మహారాష్ట్రలో డ్యాన్స్‌ బార్లపై ఉన్న ఆంక్షలను సుప్రీంకోర్టు సడలించింది. హోటళ్లు, రెస్టారెంట్లలలో డ్యాన్స్‌లను నిషేధిస్తూ.. మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను కోర్టు తోసిపుచ్చింది. డ్యాన్స్‌ బార్లకు షరతులతో కూడిన అనుమతులను కోర్టు మంజూరు చేసింది.  వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని హోటళ్లు, రెస్టారెంట్లపై ఆంక్షలు విధిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళ ఆత్మగౌరం పేరిట 2016లో ఓ చట్టాన్ని చేసింది. దీంతో డిస్కో టెక్కులకు లైసెన్స్‌ విషయంలో నిషేధం విధించినట్టయింది. ఈ అంక్షలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హోటళ్లు, రెస్టారెంట్ల ఓనర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను తప్పుబట్టింది. 

హోటళ్లు, రెస్టారెంట్‌లలో డిస్కోలు, ఆర్కెస్ట్రాలకు అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారిచేసింది. డ్యాన్స్‌ బార్లలో మద్యం సేవించేందుకు కూడా కోర్టు అనుమతించింది. కానీ డ్యాన్సర్లపై డబ్బు వెదజల‍్లడంపై కోర్టు నిషేధం విధించింది. అంతేకాకుండా ప్రార్థన మందిరాలకు కిలో మీటర్‌ దూరంలో డ్యాన్స్‌ బార్లను ఏర్పాటు చేయరాదనే రాష్ట్ర ప్రభుత్వ నిబంధన.. ముంబైలాంటి మహానగరాల్లో సాధ్యపడదని తెలిపింది. బార్లలో సీసీటీవీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని.. అలా చేయడం ప్రైవసీకి భంగం కలిగించడమేనని కోర్టు పేర్కొంది. డ్యాన్సు చేసేవారికి, బార్‌ ఓనర్‌లకు మధ్య తప్పకుండా కాంట్రాక్టు ఉండాలని ఆదేశించింది. అంతేకాకుండా రాత్రి 11.30 గంటల వరకు మాత్రమే డ్యాన్స్‌ బార్లను తెరచి ఉంచాలని స్పష్టం చేసింది.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top