రేప్‌ ఘటనలపై సుప్రీం ఆందోళన

Supreme Court concerned over growing incidents of rape in country - Sakshi

రేప్‌ బాధితుల ఫొటోలు వాడొద్దని  మీడియాకు సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ: ఉత్తరభారతం, దక్షిణ భారతం, మధ్యభారత్‌ అని తేడా లేకుండా దేశంలోని అన్నిచోట్లా బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం రోజుకు నాలుగు అత్యాచారాలు జరుగుతున్నాయని తేలిందని.. ప్రభుత్వం వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అత్యాచార బాధితుల ఫొటోలను బ్లర్‌ చేసి గాని, మార్చి గాని, ఏ రూపంలోనూ వాడొద్దంటూ ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్‌ మీడియాలను ఆదేశించింది. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ వసతి గృహంలో 30 మంది బాలికలపై అత్యాచారం జరిగినట్లు పట్నాకు చెందిన వ్యక్తి సుప్రీం కోర్టుకు లేఖ రాశారు. దీనిపై  ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఇంటర్వ్యూ చేయొద్దు
అత్యాచారానికి గురైన మైనర్‌ బాధితులను మీడియా ఇంటర్వ్యూ చేయవద్దని కోర్టు ఆదేశించింది. అది వారి మానసిక ఆరోగ్యం, సంక్షేమంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడింది. వారిని నిపుణులైన కౌన్సిలర్ల సమక్షంలో జాతీయ బాలల హక్కుల రక్షణ సంఘం (ఎన్‌సీపీసీఆర్‌), రాష్ట్ర బాలల హక్కుల రక్షణ సంఘం (ఎస్‌సీపీసీఆర్‌) సభ్యులే ఇంటర్వ్యూ చేయాలని పేర్కొంది. ఈ సందర్భంగా బిహార్‌ ప్రభుత్వంపై కోర్టు తీవ్ర విమర్శలు చేసింది.

ఇలాంటి కార్యకలాపాలను ప్రభుత్వమే స్పాన్సర్‌ చేస్తున్నట్లుందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ సహాయం వసతి గృహాన్ని నడిపే సంస్థకు  మంజూరు చేసే ముందు ఆ సంస్థకు విశ్వసనీయతపై ఎందుకు ఆరా తీయలేదని ప్రభుత్వాన్ని నిలదీసింది. ఎన్జీవోలు నిర్వహించే వసతి గృహాలపై రోజువారీ పర్యవేక్షణ ఉంచడంతో పాటు, సీసీ కెమెరాలు అమర్చాలని ఆదేశించింది.

రేప్‌లలో మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ టాప్‌
ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం మహిళలపై అత్యాచారాలకు సంబంధించి మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌ అగ్ర స్థానంలో ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. దేశంలో ప్రతీ ఆరు గంటలకు ఒక మహిళ అత్యాచారానికి గురవుతోందని.. వీటికి అడ్డుకట్ట వేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top