నలుగురిని హతమార్చి.. ప్రాణాలు వదిలాడు | Soldier kills four heavily-armed terrorists before being martyred | Sakshi
Sakshi News home page

నలుగురిని హతమార్చి.. ప్రాణాలు వదిలాడు

May 27 2016 8:19 PM | Updated on Sep 4 2017 1:04 AM

నలుగురిని హతమార్చి.. ప్రాణాలు వదిలాడు

నలుగురిని హతమార్చి.. ప్రాణాలు వదిలాడు

పెద్ద ఎత్తున ఆయుధాలతో దేశంలోకి చొరబడుతున్న నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాడు. ఈ పోరాటంలో తీవ్రంగా గాయపడి దేశం కోసం ప్రాణత్యాగం చేశాడు. వీరమరణం చెందిన అసోం రెజిమెంట్ జవాన్ 36 ఏళ్ల హవీల్దర్ హంగ్పాన్ దాదా సాహసానికి మారు పేరుగా నిలిచాడు.

శ్రీనగర్: శత్రువులు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నా ఏమాత్రం బెదరకుండా పోరాడాడు. శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్తున్నా లెక్కచేయకుండా తుపాకీ ఎక్కుపెట్టి యుద్ధం చేశాడు. పెద్ద ఎత్తున ఆయుధాలతో దేశంలోకి చొరబడుతున్న నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాడు. ఈ పోరాటంలో తీవ్రంగా గాయపడి దేశం కోసం ప్రాణత్యాగం చేశాడు. వీరమరణం చెందిన భారత సైనికుడు 36 ఏళ్ల హవీల్దర్ హంగ్పాన్ దాదా సాహసానికి మారు పేరుగా నిలిచాడు. జమ్ము కశ్మీర్లో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉత్తర కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో హవీల్దర్.. నలుగురు ఉగ్రవాదులను చంపాడు.

అరుణాచల్ ప్రదేశ్లోని బొడురియా హవీల్దర్ సొంత గ్రామం. దాదా అని పిలుచుకునే హవీల్దర్ 1997లో అసోం రెజిమెంట్లో చేరాడు. 35 రాష్ట్రీయ రైఫిల్స్లో జవాన్గా సేవలందించాడు. 13 వేల అడుగుల ఎత్తున ఉన్న శంసబరి రేంజ్లో పనిచేశాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదులను ఎదుర్కొనే క్రమంలో హవీల్దర్ తీవ్రంగా గాయపడినట్టు ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. హవీల్దర్ ధైర్యసాహసాలు ప్రదర్శించి, శత్రువులతో భీకరయుద్ధం చేసి నలుగురిని హతమార్చాడని ప్రశంసించారు. దేశంకోసం ప్రాణత్యాగం చేశాడని చెప్పారు. హవీల్దర్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అతనికి భార్య లొవాంగ్, కుమార్తె రోకిన్, కొడుకు సెన్వాంగ్ ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement