ఉత్తర భారతీయులకు ఆత్మగౌరవం ఉండదు : రాజ్‌ ఠాక్రే

Raj Thackeray Says North Indians Never Questions Leaders For Development - Sakshi

సాక్షి, ముంబై : మహారాష్ట్రలో నివసిస్తున్న ఉత్తర భారతీయులను ఉద్దేశించి మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్‌ ఠాక్రే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఇతర రాష్ట్రాలకు వలస వచ్చి మీరు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే మీకు ఆత్మగౌరవం లేదు’  అని ఆయన వ్యాఖ్యానించారు. ముంబైలోని ఉత్తర భారతీయ మహాపంచాయత్‌ ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి రాజ్‌ ఠాక్రే హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రసంగిస్తూ... ‘భారతదేశానికి అత్యధిక మంది ప్రధానులను అందించిన ఘనత ఉత్తరప్రదేశ్‌కు ఉంది. ప్రస్తుత ప్రధాని కూడా అక్కడి(వారణాసి) నుంచి ఎన్నికైన వారే. కానీ ఆ రాష్ట్రం ఇప్పటికీ వెనుకబడే ఉంది. ఉద్యోగాలు, ఉపాధి లేక మీరంతా ముంబైకి వస్తున్నారు. యూపీతో పాటు బిహార్‌, జార్ఖండ్‌, బంగ్లాదేశ్‌ ప్రజలు కూడా ఉపాధి కోసం ఇక్కడికే వస్తారు. మీకు, మీ నాయకులకు నిజంగా ఆత్మగౌరవం ఉంటే ముఖ్యమంత్రి, ప్రధానులను నిలదీస్తారు. మీకు చెందాల్సినవి దక్కించుకుంటారు. కానీ అలా జరగడం లేదు. ఇంకో విషయం గుర్తు పెట్టుకోవాలి.. మీరు ఎక్కడికైతే వలస వెళ్లి బతుకుతున్నారో అక్కడి స్థానిక భాషలను, సంస్కృతిని గౌరవించడం నేర్చుకోవాలి’ అని రాజ్‌ ఠాక్రే సభికులకు సూచించారు.

ముంబైకి వచ్చే రైళ్లన్నీ ఖాళీగా వెళ్తాయి!
‘ముంబైకి రోజూ సుమారు 48 రైళ్లు నిండుగా వస్తాయి. కానీ తిరిగి వెళ్లేప్పుడు మాత్రం ఖాళీగా వెళ్తాయి. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సిటీ కెపాసిటీ ఎంత.. ఇక్కడ నివసిస్తున్న జనాభా ఎంత. ఈ స్థాయిలో వలసలు కొనసాగితే మహారాష్ట్ర పరిస్థితి ఏం కావాలి. నిజమే మీరు బతుకుదెరువు కోసమే వస్తున్నారు. కానీ మహారాష్ట్ర ప్రజల పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా’  అంటూ రాజ్‌ ఠాక్రే ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరిపై తనకు వ్యక్తిగతంగా కక్ష లేదని, కాకపోతే తమ రాష్ట్ర ప్రజల బాగుకోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఎక్కువ మంది ప్రజలకు ఈ విషయం చేరాలనే ఉద్దేశంతోనే తాను హిందీలో మాట్లాడుతున్నానని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top