
న్యూఢిల్లీ: వీఐపీ సంస్కృతిని విడనాడే దిశగా రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. 36 ఏళ్ల నాటి ప్రొటోకాల్‌ను పక్కనబెట్టాలని తాజాగా రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. రైల్వే బోర్డు చైర్మన్, ఇతర సభ్యుల పర్యటన సమయంలో జోన్ జనరల్ మేనేజర్లు వారికి స్వాగతం పలకడం, వీడ్కోలు చెప్పడం ఇప్పటి వరకూ ప్రొటోకాల్‌గా కొనసాగుతోంది. ఈ ప్రొటోకాల్ నిబంధనను తక్షణం ఉపసంహరించుకుంటున్నట్టు రైల్వే శాఖ పేర్కొంది.
రైల్వే బోర్డు చైర్మన్, ఇతర సభ్యుల పర్యటనల సమయంలో జోన్ జీఎం హాజరయ్యే అధికారులు పూల బొకేలు, బహుమతులను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురావొద్దని రైల్వే బోర్డు చైర్మన్ అశ్వనీ లోహని స్పష్టంచేశారు. సీనియర్ అధికారులు తమ ఇళ్లల్లో పని చేయించుకుంటున్న రైల్వే శాఖ కింది స్థాయి ఉద్యోగులను తక్షణం రిలీవ్ చేయాలని ఆదేశించింది
. ప్రస్తుతం రైల్వే శాఖలో సుమారు 30 వేల మంది ట్రాక్‌మెన్లు సీనియర్ అధికారుల ఇళ్లలో పని చేస్తున్నారు. వెంటనే వారిని విధుల్లో చేరాలని అధికారులు ఆదేశించారు. సీనియర్ అధికారులు ఎగ్జిక్యూటివ్ క్లాస్‌ల్లో ప్రయాణాలు మానుకోవాలని, తోటి ప్రయాణికులతో కలసి స్లీపర్, ఏసీ 3 టైర్‌లో ప్రయాణించాలి. బోర్డు సభ్యులు, జోన్లమేనేజర్లు, డివిజనల్ మేనేజర్లకు ఈ నిబంధన వర్తిస్తుందన్నారు.