నీరు, విద్యుత్ పొదుపు చేయండి | prithviraj chavan said to people to save the water and power | Sakshi
Sakshi News home page

నీరు, విద్యుత్ పొదుపు చేయండి

Jul 2 2014 10:49 PM | Updated on Sep 2 2017 9:42 AM

నీరు, విద్యుత్ పొదుపు చేయండి

నీరు, విద్యుత్ పొదుపు చేయండి

వర్షాభావ పరిస్థితుల కారణంగా జల వనరులు క్లిష్ట స్థితికి చేరుకోవడంతో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, నీరు, విద్యుత్‌ను జాగ్రత్తగా వాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చవాన్ పిలుపు
 
ముంబై: వర్షాభావ పరిస్థితుల కారణంగా జల వనరులు క్లిష్ట స్థితికి చేరుకోవడంతో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, నీరు, విద్యుత్‌ను జాగ్రత్తగా వాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఇక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో రుతుపవనాల పరిస్థితిపై సమీక్షించారు. అవసరమైన ప్రాంతాల్లో తాగు నీటి సరఫరాకు ట్యాంకర్లను వినియోగించాలని, ఇందుకు తహసీల్దార్ (రెవెన్యూ అధికారి)లకు అధికారం ఇవ్వాలని నిర్ణయించారు. ట్యాంకర్ బిల్లులను కూడా వెంటనే చెల్లించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ ఈ నెలాఖరు వరకు కొనసాగించాలని నిర్ణయించారు.
 
అదే సమయంలో అధికారులు పైసేవరి (పంటను విలువకట్టడం) పరిశీలించరాదని ఆదేశించారు. ‘‘రాష్ట్రంలో నీటి కొరత క్లిష్ట దశకు చేరుకుంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి తీవ్రంగా తగ్గిపోయింది. అందువల్ల ప్రజలు నీటిని, విద్యుత్‌ను జాగ్రత్తగా వినియోగించాలి’’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, జూన్ 30 నాటికి 58.50 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. మొత్తం 355 తాలూకాలకు గాను, 194 తాలూకాల్లో 0 నుంచి 25 శాతం వర్షాలు మాత్రమే కురిశాయి. 123 తాలూకాల్లో 50 శాతం వరకు, 28 తాలూకాల్లో 75 శాతం వరకు వర్షపాతం నమోదైంది.
 
ఠాణే, రాయిగఢ్, నాసిక్, దూలే, నందుర్బార్, జల్గావ్, పుణే, ఔరంగాబాద్, జాల్నా, ఉస్మానాబాద్, నాందేడ్, హింగోలీ, బుల్దానా, అకోలా, యవత్మాల్, చంద్రాపూర్ జిల్లాల్లో 0 నుంచి 25 శాతం వర్షపాతం నమోదైంది. ఇక రాష్ట్రంలోని రిజర్వాయర్లలో 19 శాతం మాత్రమే నీటి నిల్వలున్నాయి. 1,359 గ్రామాలు, 3,317 హేమ్లెట్‌లలో 1,464 ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని త్రైమాసిక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ ప్రణాళికను ఐదు రోజుల్లో సిద్ధం చేసి, పుణే, నాసిక్, ఔరంగాబాద్ డివిజన్‌లలో తాగునీటికి ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించింది.
 
మంత్రివర్గ నిర్ణయాలు

పదోన్నతి పొందే అవకాశం లేని ప్రభుత్వోద్యోగులకు అడిషనల్ గ్రేడ్ పే చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. బీడ్ జిల్లా ఆస్పత్రిలో అదనంగా మరో 200 పడకలను మంజూరు చేసింది. దీంతో పాటు ఆస్పత్రిని ఉన్నతీకరిస్తూ, 125 కొత్త పోస్టులను సృష్టించనున్నట్లు మంత్రివర్గం పేర్కొంది. గ్రామీణ నీటి సరఫరా పథకాలలో ప్రజలు పది శాతం చెల్లించాలన్న నిబంధనను రద్దు చేసింది. గ్రామ పంచాయతీల వాటాను ఇకపై ప్రభుత్వమే చెల్లిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement