ఆ మూడు నగరాల్లో గాలి పీలిస్తే.. చావు ఖాయం

Polluted Air Causes 4K Deaths In Bihar Every Year - Sakshi

పట్నా : జనాభాతో పాటు భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న మరో పెద్ద సమస్య కాలుష్యం. పర్యావరణ కాలుష్యం వల్ల ఏటా కొన్ని వేల మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలోని అత్యంత కాలుష్యమైన 20 నగరాల్లో భారత్‌కు చెందినవి 14 నగరాలున్నాయంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ (సీఈఈడీ), ఐఐటీ ఢిల్లీలు సంయుక్తంగా చేసిన అధ్యయనం ప్రకారం.. వాయు కాలుష్యం వల్ల బిహార్‌లో ఏటా 4 వేల మంది మరణిస్తున్నారు.

‘నో వాట్‌ యూ బ్రీత్’ ‌(మీరేం పీలుస్తున్నారో తెలుసుకోండి) పేరిట చేపట్టిన ఈ అధ్యయనం ప్రకారం బిహార్‌లోని ముజఫర్‌పూర్‌, గయ, పట్నా నగరాల్లో కాలుష్య స్థాయి 2.5 ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ సగటుతో పోలిస్తే ఇది 175 నుంచి 200 శాతం ఎక్కువగా ఉందని.. అంతేకాకుండా రోజు రోజుకు కాలుష్యం పెరుగుతుండడం ఆందోళన కలిగించే విషయమని సీఈఈడీ డైరెక్టర్‌ అభిషేక్‌ ప్రతాప్‌ తెలిపారు. ఈ నగరాలన్నింటిలో కలిపి ప్రతీ లక్ష మందిలో 300 మంది.. హృద్రోగ సమస్యలు, ఊపిరి తిత్తుల క్యాన్సర్‌, శ్వాసకోశ సంబంధ వ్యాధులతో మరణిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన పేర్కొన్నారు. పట్నాలో చేపట్టిన ‘ఎయిర్‌ యాక్షన్‌ ప్లాన్‌’ను స్వాగతిస్తున్నామని, ఇటువంటి కార్యక్రమాల ద్వారా కొంతైనా కాలుష్యాన్ని తగ్గించగలిగే అవకాశం ఉంటుందని హర్షం వ్యక్తం చేశారు. ముజఫర్‌పూర్‌, గయల్లో కూడా ఈ తరహా కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top