విపక్షం.. అభివృద్ధికి ఆటంకం

PM Modi addresses swacchagrahis in Bihar's Motihari - Sakshi

సమాజాన్ని విడదీసే కుట్ర జరుగుతోంది

స్వచ్ఛ మిషన్‌లో బిహార్‌ దేశానికే ఆదర్శం

చంపారన్‌ సత్యాగ్రహం శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో మోదీ

బిహార్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం  

మోతిహారి: ప్రభుత్వం పేదల అభ్యున్నతికోసం చేస్తున్న ప్రయత్నాలకు విపక్షాలు అడ్డుతగులుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా విమర్శించారు. సమాజంలో విభజన తీసుకురావటం ద్వారా ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతిపనిలోనూ అడ్డంకులు సృష్టిస్తున్నాయన్నారు. ‘గల్లీ నుంచి పార్లమెంటు వరకు ప్రభుత్వం పనిలో విపక్షాలు సమస్యలు సృష్టిస్తున్నాయి.

ప్రభుత్వం ప్రజలను కలిపేందుకు ప్రయత్నిస్తే.. విపక్షాలు మాత్రం సమాజాన్ని విడదీసేందుకు కుట్రపన్నుతున్నాయి’ అని మోదీ ఆరోపించారు. చంపారన్‌ సత్యాగ్రహం శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా.. బిహార్‌లోని మోతిహారీలో 20వేల మంది స్వచ్ఛాగ్రహి (స్వచ్ఛత వాలంటీర్లు)లనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ఎస్సీ–ఎస్టీ చట్టంపై సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో భారత్‌ బంద్‌ హింసాత్మకంగా మారటం, పార్లమెంటు వరుస వాయిదాల నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

బిహార్‌ సీఎం భేష్‌
బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ అవినీతి, అసాంఘిక శక్తులతో (పరోక్షంగా ఆర్జేడీ–కాంగ్రెస్‌ కూటమిని విమర్శిస్తూ) పోరాటం చేస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని ప్రశంసించారు. నితీశ్‌ ప్రయత్నాలకు కేంద్రం పూర్తి మద్దతిస్తుందన్నారు. ‘ప్రతి మిషన్‌ను బిహార్‌ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేస్తోంది. మార్పును కోరుకోని వాళ్లకు ఈ ప్రభుత్వ పనితీరు ఇబ్బంది కలిగిస్తోంది.

పేదల అభ్యున్నతి జరిగితే.. అసత్యాలను వారిని మభ్యపెట్టే పరిస్థితి ఉండదు. అందుకే వారి అభ్యున్నతి కోసం చేసే ప్రతి పనిలోనూ ఆటంకాలు సృష్టిస్తున్నారు’ అని మోదీ పేర్కొన్నారు. సమాజంలో ఓ వర్గాన్ని మరో వర్గంపైకి రెచ్చగొడుతున్నారన్నారు. స్వచ్ఛభారత్‌ పథకం అమలులో బిహార్‌ సాధిస్తున్న విజయాలు దేశానికే ఆదర్శమన్నారు.

ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 10 మంది స్వచ్ఛాగ్రహిలను మోదీ సన్మానించారు. ఇందులో ఆరుగురు మహిళలున్నారు. ఒక్కొక్కరికి రూ.51వేల నగదు, జ్ఞాపికతో సత్కరించారు. అంతకుముందు, వేదికపై మహాత్ముని విగ్రహానికి మోదీ పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం సుశీల్‌ మోదీ, గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.  

అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
భారత దేశ తొలి భారీ విద్యుత్‌ సామర్థ్యమున్న ఎలక్ట్రిక్‌ గూడ్స్‌ రైలు ఇంజన్‌ను మోదీ ప్రారంభించారు. బిహార్‌లోని మాధేపుర ఫ్యాక్టరీలో ఉన్న ఇంజన్‌ను మోతిహారీ నుంచి రిమోట్‌ ద్వారా ప్రారంభించారు. 12వేల హార్స్‌పవర్‌ సామర్థ్యమున్న ఈ ఇంజన్‌ను భారతీయ రైల్వే, ఫ్రెంచ్‌ తయారీ సంస్థ అల్‌స్టోమ్‌ సంయుక్తంగా రూపొందించాయి.

మాధేపుర ఫ్యాక్టరీకి ఏడాదికి 110 లోకోలను రూపొందించే సామర్థ్యం ఉంది. 11 ఏళ్లలో 800 లోకోలను తయారుచేయాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. కతిహార్‌–పాత ఢిల్లీ మధ్య నడవనున్న చంపారన్‌ హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ముజఫర్‌పూర్‌–సాగౌలీ, సాగౌలీ–వాల్మీకీ నగర్‌ మధ్య రైల్వే లైను డబ్లింగ్‌ పనులకు శంకుస్థాపన చేశారు.  

తొలిసారిగా ప్రధాని దీక్ష
రేపు పార్లమెంటు ఆవరణలో
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ప్రధాని నిరాహార దీక్షలో పాల్గొననున్నారు. ఏప్రిల్‌ 12న బీజేపీ ఎంపీల ఒకరోజు నిరాహార దీక్షలో ప్రధాని మోదీ, పార్టీ చీఫ్‌ అమిత్‌షా కూడా పాలు పంచుకోనున్నారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలను విపక్ష పార్టీలు అడ్డుకున్నందుకు నిరసనగా దీక్ష చేపట్టనున్నట్లు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు మోదీ స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.

అయితే ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోతుండటం, రాజకీయంగా పరిస్థితి చేయిదాటుతున్నట్లు కనబడుతున్న నేపథ్యంలో ఈ దీక్ష చేపట్టాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలిసింది. అయితే దీక్ష సందర్భంగా మోదీ.. సెలవు తీసుకోకుండా రోజులాగే ఫైళ్లను క్లియర్‌ చేయటం, ప్రజలు, అధికారులతో మాట్లాడటం వంటివి కొనసాగిస్తారని బీజేపీ నేత ఒకరు తెలిపారు.

అటు, అమిత్‌ షా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో దీక్షలో పాల్గొంటారు. పార్లమెంటు కొనసాగకపోవటంతో బీజేపీ బాధపడుతోందనే విషయాన్ని ప్రజలకు వెల్లడించేందుకే దీక్ష చేపట్టామని ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు చెప్పారు.

ఫూలే, అంబేడ్కర్‌ జయంతి కార్యక్రమాలతో..
ఏప్రిల్‌ 11న జ్యోతిబా ఫూలే జయంతిని సమతా దివస్‌గా జరుపుకోవాలని బీజేపీ నిర్ణయించింది. ఈ సందర్భంగా ఎంపీలు వారి నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. దీనికితోడు పార్టీపై పడుతున్న దళిత వ్యతిరేకి ముద్రను తొలగించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.

ఇందులో భాగంగా ఏప్రిల్‌ 14 (అంబేడ్కర్‌ జయంతి) నుంచి మే 5 వరకు ఎంపీలు.. 50 శాతం కన్నా ఎక్కువ ఎస్సీ జనాభా ఉన్న గ్రామాల్లో రాత్రి నిద్ర చేయాలని, ప్రభుత్వం దళితుల కోసం ఉద్దేశించిన పథకాలను వారికి వివరించాలని మోదీ సూచించారు. ప్రధాని దీక్షలో పాల్గొనటం ద్వారా.. బ్యాంకు కుంభకోణాలను నియంత్రించటంలో, ప్రత్యేక హోదా తదితర అంశాలపై విపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేని అశక్తతను వెల్లడించినట్లవుతుందని పలువురు బీజేపీ ఎంపీలు భావిస్తున్నట్లు సమాచారం. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top