షీనా కేసులో పీటర్ ముఖర్జీ అరెస్టు | Sakshi
Sakshi News home page

షీనా కేసులో పీటర్ ముఖర్జీ అరెస్టు

Published Fri, Nov 20 2015 3:48 AM

షీనా కేసులో పీటర్ ముఖర్జీ అరెస్టు

చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ
 ముంబై: షీనా బోరా హత్య కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఇంద్రాణీ భర్త పీటర్ ముఖర్జీని సీబీఐ అరెస్టు చేసి ఫోరెన్సిక్ నిపుణుల నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు మొదలైన మూడు నెలల తర్వాత చార్జిషీటు దాఖలు  చేసింది.  విచారణ సందర్భంగా హత్యలో పీటర్‌కు సంబంధం ఉన్నట్లు తెలియటంతోనే అరెస్టు చేసినట్లు సీబీఐ ప్రకటించింది. సీబీఐ అధికారులు వివరాలు వెల్లడించనప్పటికీ.. నిందితులకు ఆశ్రయం ఇవ్వటం, కేసును తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేయటం వల్ల పీటర్‌ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అరెస్టుకు ముందు రెండు గంటలపాటు పీటర్‌ను ముంబై కమిషనర్ ప్రశ్నించారు.  
 
 ఆయన్ను అరెస్టు చేసి సీబీఐ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. ఆయన్ను శుక్రవారం కోర్టులో హాజరుపరచనున్నారు. వెయ్యి పేజీలకు పైగా ఉన్న ఈ చార్జిషీటులో 150 మంది సాక్షుల వాంగ్మూలం, 200 డాక్యుమెంట్లు, మెజిస్ట్రేటు ముందు ఏడుగురు ఇచ్చిన వాంగ్మూలాలున్నాయి. ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజయ్, డ్రైవర్ శ్యాంలను ప్రధాన నిందితులుగా సీబీఐ పేర్కొంది. డ్రైవర్ గతవారం కోర్టు ముందు నేరాన్ని ఒప్పుకోవటంతోపాటు ఘటన జరిగిన తీరును తెలిపిన విషయం తెలిసిందే. దీన్ని కీలక సాక్షంగా తీసుకునే సీబీఐ డ్రైవర్ సాక్షమే కేసుకు కీలక ఆధారమని సీబీఐ తెలిపింది.
 

Advertisement
Advertisement