భూకంపం భయంతో దూకేసింది | Panic struck student jumps from hostel room | Sakshi
Sakshi News home page

భూకంపం భయంతో దూకేసింది

Published Tue, Oct 27 2015 1:01 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

భూకంపం భయంతో  దూకేసింది - Sakshi

శ్రీనగర్: దేశాన్ని కుదిపేసిన భూకంపం కశ్మీర్‌లోని కాలేజీలు, ఇతర విద్యాలయాల్లో  కూడా ఉద్రిక్తతను రాజేసింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఓ కాలేజీ విద్యార్థినులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేని ఓ అమ్మాయి కాలేజీ హాస్టల్  మొదటి అంతస్తు నుంచి దూకేసింది. ప్రస్తుతం ప్రాణాపాయం లేకపోయినా, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో  చికిత్స పొందుతోంది. ఎంఎ రోడ్ విమెన్స్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కాలేజీ అమ్మాయిలంతా వైవా టెస్టుకు ప్రిపేర్ అవుతున్నారు. అంతా కోలాహలంగా ఉంది. ఇంతలో  ఆకస్మాత్తుగా భూమి కంపించడాన్ని గమనించిన విద్యార్థినులు బయటికి పరుగులు తీశారు. బీఎ మొదటి సంవత్సరం చదువుతున్న మరో అమ్మాయి మాత్రం ఈ  గందరగోళంలో హాస్టల్ భవనం నుంచి దూకేసింది. ఈ వార్తను ధ్రువీకరించిన కాలేజీ ప్రిన్సిపల్.. ఆమెను ఉత్తర కశ్మీర్ కుప్వారా జిల్లాకు చెందిన అమ్మాయిగా గుర్తించామని, ఆమె బంధువులకు సమాచారం అందించామని తెలిపారు.

అటు భూకంపం వార్తలతో తల్లిదండ్రులు కూడా స్కూళ్లకు పరుగులు పెట్టారు. తమ  బిడ్డలను కళ్లారా చూసేదాకా వారి ప్రాణాలు నిలువలేదు. తాను స్కూలుకెళ్లేసరికి పిల్లలు, టీచర్లు అంతా షాక్ లో ఉన్నారని, అక్కడి పరిస్థితి అంతా గందరగోళంగా, అయోమయంగా ఉందని జావేద్ అహ్మద్ అనే పేరెంట్ తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. మరోవైపు  పరిస్థితి అదుపులో ఉందని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ షా ఫజల్ తెలిపారు. విద్యాలయాల నుంచి నివేదికలు సేకరిస్తున్నామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement