ఇది కేంద్రానికి రమణికి మధ్య పోరాటం!

Our Most Important Weapon is Truth, Priya Ramanis Husband - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ఇది ఎంజె అక్బర్‌ వర్సెస్‌ నా భార్య ప్రియ (రమణి)కు మధ్య పోరాటం కాదు. అక్బర్‌ కేంద్ర మంత్రి కనుక యావత్‌ కేంద్రానికి, అక్బర్‌ పేర్కొన్న 97 మంది న్యాయవాదులు, నా భార్య మధ్య జరుగుతున్న పోరాటం. ఎక్కడో ఉంటున్న మా ఇంటి చిరునామాను ఒక్క పూటలో పట్టుకున్నారంటే అక్బర్‌ పవర్‌ ఏమిటో నాకు తెలుసు. నా భార్య మొదటిసారి అక్బర్‌ పేరును వెల్లడించినప్పుడు ఎలా స్పందించాలో నాకు అర్థం కాలేదు. ఎక్కడ మా చిన్న, ప్రశాంత జీవితం బలవుతుందేమోనని భయపడ్డాను. అక్బర్‌ బాధితులు కూడా ఇలాగే భయపడి ఉంటారు. అప్పుడు, అలా భయపడక పోయి ఉంటే వ్యక్తిగత జీవితాలను పక్కన పెడితే ఎంత మంది వృత్తి జీవితాలు దెబ్బ తినేవో!

భారత్‌ లాంటి పురుషాధిక్య సమాజంలో లైంగిక వేధింపులను ఓ రకంగా తమ హక్కుగా పురుషులు భావిస్తున్నారు. మగవాడు మగవాడే, ఆడది ఎక్కడుండాలో అక్కడ ఉండాల్సిందే అన్నది వారి వాదన. బాధితులెప్పుడూ బలహీనులే, భయపడే వారే. అందుకే దేశంలో మహిళలు, పిల్లలపై జరుగుతున్న అత్యాచారల్లో 70 శాతం సంఘటనలు ఫిర్యాదుచేసే వరకు రావడం లేదు. సమాజం ప్రభావం మహిళలపై కూడా కొనసాగుతోంది. భార్యను భర్త కొట్టడం తప్పేమి కాదని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వేలో 42 శాతం మగవాళ్లు అభిప్రాయపడగా 52 శాతం మంది మహిళలు అభిప్రాయపడ్డారంటే ఆశ్చర్యం. అలాంటి సమాజంలోనే పుట్టి పెరిగింది నా భార్య. తనపై జరిగిన లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదు చేసే ధైర్యం ఆమెకు ఆనాడు లేకపోవచ్చు.

మీటూ ఉద్యమం వల్ల ఆలస్యంగానైనా పురుష పుంగవులు లైంగిక ఆగడాలు వెలుగులోకి వస్తున్నాయి. వాటికి శిక్షలుండాలన్నదే బాధితుల వాదన. నా భార్య చేస్తున్న పోరాటంలో ప్రతిపక్ష పార్టీలు మద్దతుగా నిలుస్తాయని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే, వారిదంతా ఒక్కటే రాజకీయ కులం. అక్బర్‌ విషయంలో నా ప్రియ చూపిన ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేక పోయాను. అందుకే ఆమెకు అండగా నిలబడాలనుకున్నాను. ‘నిజం’ ఒక్కటే మాకు కవచం. అదే గెలిపిస్తుందని నమ్మకం. అక్బర్‌ బాధితులంతా ముందుకొస్తే గెలుపు అంత కష్టం కూడా కాకపోవచ్చు’–––సమర్‌ హలార్న్‌కర్‌.

(గమనిక: కేంద్ర మంత్రి ఎంజె అక్బర్‌ తనపై లైంగిక వేధింపు ఆరోపణలు చేసిన ప్రియా రమిణిపై నేరపూరిత పరువు నష్టం దావా వేయడం పట్ల ఆమె భర్త, ‘ఇండియా స్పెండ్‌ డాట్‌ కామ్‌’ ఎడిటర్‌ సమర్‌ హలార్న్‌కర్‌ స్పందన ఇది. ముందుగా ట్విట్టర్‌లో స్పందించిన ఆయన ఆ తర్వాత తమ డాట్‌కామ్‌లో పెద్ద వ్యాసమే రాశారు. ఆ వ్యాసంలోని సారాంశాన్నే ఇక్కడ క్లుప్తంగా ఇస్తున్నాం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top