‘నేను దేవుని బిడ్డను.. అన్ని మతాలను గౌరవిస్తాను’

Nusrat Jahan Said Iam God Special Child I Respect All Religions - Sakshi

కోల్‌కతా : తాను  దేవుని ప్రత్యేక బిడ్డనని, అన్ని మతాల పండగలను జరుపుకొంటానని పశ్చిమ బెంగాల్‌ తృణముల్‌ కాంగ్రెస్‌ ఎంపీ నుస్రత్‌ జహాన్ తెలిపారు. శుక్రవారం తన భర్త నిఖిల్‌ జైన్‌తో కలిసి నుస్రత్‌ చల్తాబాగన్‌లో బెంగాలీ హిందు సంప్రదాయమైన దుర్గా పూజలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా సింధూర్‌ ఖేలా వేడుకలో సింధూరం ధరించారు. బెంగాల్‌లో నవరాత్రుల అనంతరం అక్కడి మహిళలు ఈ దుర్గా పూజలో పాల్గొంటారు. అందరికి మంచి జరగాలని దుర్గాదేవి కాలికి ఉన్న కుంకుమను నుదట ధరిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా నుస్రత్‌ కూడా నుదుటన కుంకుమ ధరించి పూర్తి హిందూ సంప్రదాయంలో కనిపించారు. అయితే ముస్లిం మహిళ ఇలా చేయడమేంటంటూ ఇప్పటికే అనేకమార్లు నుస్రత్‌ చర్యలను సంప్రదాయవాదుల తప్పుబట్టిన విషయం తెలిసిందే. మత సంప్రదాయాలకు విరుద్ధంగా నుస్రత్‌ ప్రవర్తిస్తుందని ఇస్లాంను కించపరచడానికే ఇలా చేస్తుందంటూ ఓ మతాధికారి విమర్శించారు. అంతేగాకుండా ఇకపై ముస్లిం పేరును కొనసాగించవద్దని, వెంటనే తన పేరును మార్చుకోవాలని సూచించారు. 

కాగా పూజా కార్యక్రమం అనంతరం నుస్రత్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రేమ, మానవత్వానికే అన్నింటికంటే ఎక్కువ గౌరవం ఇస్తానని ఇప్పటికే ఈ విషయాన్ని ప్రజలకు చెప్పానని స్పష్టం చేశారు. తను దేవుని బిడ్డనని, తనపై వచ్చిన విమర్శల గురించి ఎప్పటికీ పట్టించుకోనని కొట్టిపారేశారు. ముస్లిం మహిళ అయినప్పటికీ.. హిందూ మతానికి చెందని వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్ల అన్ని మతాలను, వారి సంప్రదాయాలను గౌరవిస్తానని ఎంపీ తెలిపారు. అదే విధంగా దుర్గ పూజలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. బెంగాల్‌లో పుట్టి పెరిగిన తను సంస్కృతి, సంప్రదాయాలను అనుసరిస్తానని, అన్ని మతాల ఉత్సవాలను జరుపుకొంటానని అన్నారు. కాగా నటిగా కెరీర్‌ ప్రారంభించిన నుస్రత్‌ 2019 లోక్‌సభ ఎన్నికల్లో అధికార టీఎంసీ తరఫున గెలుపొంది పార్లమెంటులో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top