
పౌరసత్వ సవరణ చట్టంపై హింసాత్మక ఆంందోళనలు కొనసాగడంతో యూపీలో ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేశారు.
లక్నో : పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు కొనసాగుతున్న క్రమంలో శుక్రవారం ప్రార్థనల దృష్ట్యా యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో ఇంటర్‌నెట్ కనెక్టివిటీని నిలిపివేసి నిరసనలను పర్యవేక్షించేందుకు డ్రోన్‌లను రంగంలోకి దింపింది. పశ్చిమ యూపీలోని బిజ్నోర్, బులంద్ షహర్, ముజఫర్‌నగర్, మీరట్, ఆగ్రా, ఫిరోజాబాద్, సంభల్, అలీగఢ్, ఘజియాబాద్, రాంపూర్, సీతాపూర్, కాన్పూర్ జిల్లాల్లో ఇంటర్‌నెట్‌ను అధికారులు నిలిపివేశారు. కాగా ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న రాష్ట్ర రాజధాని లక్నోలో మాత్రం ఈ దిశగా చర్యలు చేపట్టలేదు.
ఆగ్రాలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఇంటర్‌నెట్‌ను నిలిపివేస్తున్నట్టు ఏఎస్పీ రవి కుమార్ వెల్లడించారు. బులద్‌షహర్‌లో శనివారం ఉదయం ఇంటర్‌నెట్ సేవలను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. సోషల్ మీడియా కంటెంట్‌ను సైతం పరిశీలిస్తామని పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను పెంచడంతో పాటు నిరసనలపై డ్రోన్‌లతో పర్యవేక్షణ చేపడతామని అధికారులు చెప్పారు.