
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్మలా, మన్మోహన్‌తో సమావేశం కావడం ఇదే తొలిసారి. జూలై 5 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా.. ఈ నేపథ్యంలో గతంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన మన్మోహన్‌తో సమావేశమైనట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సమావేశంలో వీరు ఏ అంశాలు చర్చించారనేదానిపై సమాచారం లేదు. చాలా ఏళ్లపాటు రాజ్యసభ సభ్యునిగా కొనసాగిన మన్మోహన్.. తన పదవీ కాలం ముగియడంతో ఈ సమావేశాలకు దూరంగా ఉండనున్నారు.
1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన ఆర్థిక మంత్రిగా సేవలు అందించారు.1991లో కేంద్రం తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణల్లో మన్మోహన్ కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే. 1982 నుంచి 1985 మధ్యకాలంలో ఆర్బీఐ గవర్నర్‌గా విధులు నిర్వర్తించిన మన్మోహన్.. 1985 నుంచి 1987 వరకు ప్లానింగ్ కమిషన్‌కు డిప్యూటీ చైర్మన్‌గా కొనసాగారు.