అతిచేస్తే ‘నిషేధ జాబితా’లోకి!

అతిచేస్తే ‘నిషేధ జాబితా’లోకి!


న్యూఢిల్లీ: దేశీయ విమానాల్లో దురుసుగా ప్రవర్తించే ప్రయాణికులు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం వేటు పడనుంది. వీరి పేర్లను ‘నేషనల్‌ నో ఫ్లై లిస్టు’లో చేర్చాలని పౌర విమానయాన శాఖ ప్రతిపాదించింది. సూచనలు, అభిప్రాయాల కోసం ముసాయిదా నిబంధనలను శుక్రవారం విడుదల చేసింది. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ ఎయిరిండియా ఉద్యోగిపై చేయిచేసుకున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన సిద్ధమైంది. దురుసు ప్రయాణికులతోపాటు భద్రతకు ముప్పు కలిగించే వ్యక్తులుగా భద్రతా సంస్థలు గుర్తించిన వారినీ జాబితాలో చేరుస్తారు. జాబితాలో అన్ని విమానయాన సంస్థల నుంచి సేకరించిన ఇలాంటి ప్రయాణికుల సమాచారం ఉంటుంది.


అయితే నిషేధాన్ని అన్ని విమానయాన సంస్థలు అమలు చేయడం తప్పనిసరేం కాదు. ఇలాంటి  లిస్టు ప్రపంచంలో మరే దేశంలోనూ లేదని పౌర విమానయాన సహాయ మంత్రి జయంత్‌ సిన్హా పేర్కొన్నారు.  ముసాయిదా ప్రకారం.. విమానయాన సంస్థకు చెందిన విచారణ కమిటీ నిర్ణయం తర్వాత పేర్లను ‘నో ఫ్లై లిస్టు’లో చేరుస్తారు. దురుసుతనం స్థాయిని బట్టి 3 రకాలు వర్గీకరిస్తారు. తొలి స్థాయిలో.. మత్తుతో శ్రుతిమించి ప్రవర్తించడం, శరీర కదలికలు, మాటలతో వేధింపులకు పాల్పడితే 3 నెలల నిషేధం ఉంటుంది.


రెండోస్థాయిలో.. నెట్టడం, కొట్టడం, ఇతరుల సీట్లను ఆక్రమించడం, లైంగిక వేధింపులకు పాల్పడటం మొదలైన వాటికి ఆరు నెలల నిషేధం విధిస్తారు. మూడో స్థాయిలో.. విమాన నిర్వహణ వ్యవస్థకు నష్టం కలిగించడం వంటి ప్రాణహాని చర్యలకు తెగబడితే రెండేళ్లు లేదా నిరవధిక నిషేధం ఉంటుంది. పదేపదే ఇలాంటి దురుసు ప్రవర్తనకు పాల్పడితే గతంలో విధించిన నిషేధానికి రెండు రెట్ల కాలపరిమితిలో నిషేధం విధిస్తారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top