ఆర్మీ, నేవీలకు కొత్త అధిపతులు | Sakshi
Sakshi News home page

ఆర్మీ, నేవీలకు కొత్త అధిపతులు

Published Sun, Jan 1 2017 2:31 AM

ఆర్మీ, నేవీలకు కొత్త అధిపతులు - Sakshi

న్యూఢిల్లీ: భారత 27వ సైన్యాధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ శనివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. పదవీ విరమణ పొందిన జనరల్‌ దల్బీర్‌ సింగ్‌ సుహాగ్‌ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు అనూప్‌ రాహా స్థానంలో వైమానిక దళాధిపతిగా ఎయిర్‌ మార్షల్‌ బిరేందర్‌ సింగ్‌ ధనోవా బాధ్యతలు స్వీకరించారు. జనరల్‌ రావత్‌ కన్నా ప్రవీణ్‌ భక్షి, పీఎం హరీజ్‌లు ఎంతో సీనియర్లు కావడం గమనార్హం. అయితే రావత్‌కు ఈస్ట్రన్‌ కమాండ్‌కు అధిపతిగా ఉన్న లెఫ్టినెంట్‌ జనరల్‌ భక్షి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఆర్మీ చీఫ్‌గా రావత్‌ నియామకం నేపథ్యంలో భక్షి రాజీనామా చేయవచ్చు లేదా ముందస్తు రిటైర్‌మెంట్‌ తీసుకోవచ్చనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఇటీవల రక్షణ మంత్రి మనోహర్‌ పరీకర్‌తో కూడా ఆయన భేటీ అయ్యారు.

కానీ మీడియాతో పాటు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న వదంతులన్నిటికీ స్వస్తి పలకాలని భక్షి విజ్ఞప్తి చేశారు. సైన్యంతో పాటు జాతి ప్రయోజనాలపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని సూచించారు. ఇలావుండగా ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని శనివారం పదవీ విరమణ చేసిన జనరల్‌ సుహాగ్‌ చెప్పారు. ఒక ర్యాంకు ఒక పింఛను పథకం అమలు చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మధ్యాహ్నం జనరల్‌ రావత్‌కు ఆయన బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు జనరల్‌ సుహాగ్, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ రాహా అమర్‌ జవాన్‌ జ్యోతి వద్ద నివాళులర్పించి గౌరవ వందనం స్వీకరించారు.

Advertisement
Advertisement